ETV Bharat / bharat

ముడి చమురు నౌకపై డ్రోన్​ దాడి! షిప్​లో 20 మంది ప్రయాణికులు- రంగంలోకి కోస్ట్​గార్డ్

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 23, 2023, 5:15 PM IST

Updated : Dec 23, 2023, 10:00 PM IST

vikram ship india
vikram ship india

Merchant Ship Drone Attack : భారత సముద్రతీరంలో ఓ వాణిజ్య నౌకపై డ్రోన్ దాడి జరిగింది. వెంటనే అప్రమత్తమైన కోస్ట్​గార్డ్ నౌక రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టింది.

Merchant Ship Drone Attack : భారత్​కు వస్తున్న ఓ వాణిజ్య నౌకలో అగ్ని ప్రమాదం సంభవించింది. సౌదీ అరేబియా నుంచి మంగళూరుకు వస్తుండగా గుజరాత్‌ తీరంలో నౌకపై డ్రోన్ దాడి జరిగినట్లు భారత కోస్ట్​గార్డ్ వర్గాలు తెలిపాయి. పోర్​బందర్​కు 217 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఘటన జరిగినట్లు పేర్కొన్నాయి. నౌకలో ముడి చమురు ఉన్నట్లు వెల్లడించాయి. దాడి కారణంగా నౌకలోని రసాయన పదార్థాలున్న ట్యాంకర్‌ పేలి అగ్నిప్రమాదం జరిగినట్లు రక్షణ శాఖ వర్గాలు వివరించాయి. సమాచారం అందుకున్న కోస్ట్​గార్డ్ వెంటనే ఐసీజీఎస్‌ విక్రమ్‌ను రంగంలోకి దించి సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదని, అయితే నౌకకు కొంత మేర నష్టం జరిగినట్టు సమాచారం. అయితే, ప్రమాదానికి గురైన ఎంవీ కెమ్​ ప్లూటో నౌకను భారత నేవీకి చెందిన విక్రమ్​ తీరానికి తీసుకురానుంది. విక్రమ్​ నౌకను ఎస్కార్ట్​గా పంపాలని ప్లూటో కోరగా పంపించినట్లు అధికారులు చెప్పారు. ప్లూటో డిసెంబర్​ 25 నాటికి తీరానికి చేరుకుంటుందని వివరించారు.

"పోర్‌బందర్‌ తీరానికి 217 నాటికల్‌ మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ప్రయాణిస్తున్న వాణిజ్య నౌక ఎంవీ కెమ్‌ ప్లూటోలో అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం వచ్చింది. డ్రోన్‌ దాడి కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. వెంటనే భారత కోస్ట్‌గార్డ్‌కు చెందిన గస్తీ నౌక ఐసీజీఎస్‌ విక్రమ్‌ను ఘటనాస్థలానికి పంపించాం. అక్కడకు వెళ్లిన విక్రమ్ వాణిజ్య నౌకలో మంటలను ఆర్పివేసింది. ఈ ప్రమాదం నుంచి నౌకలోని 20 మంది భారతీయులు సహా సిబ్బంది అంతా సురక్షితంగా బయటపడ్డారు. అయితే, నౌక మాత్రం దెబ్బతింది. దీనికి సాయం చేసేందుకు ఈ ప్రాంతంలోని అన్ని నౌకలను విక్రమ్‌ అప్రమత్తం చేసింది."
--రక్షణ శాఖ అధికారులు

ఇతర నౌకలను అప్రమత్తం చేసిన నేవీ
ప్రస్తుతం భారత ఎక్స్‌క్లూజివ్‌ ఎకనామిక్‌ జోన్‌ వెలుపల ఉన్న ఈ వాణిజ్య నౌకకు సాయం చేసేందుకు భారత నేవీకి చెందిన యుద్ధ నౌకలను పంపిస్తున్నట్లు అధికారులు చెప్పారు. అయితే ఆ నౌకపై డ్రోన్‌ దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు వెలువడలేదు.

తరచూగా నౌకలపై దాడులు
ఇటీవల ఎర్ర సముద్రంలో ఇరాన్‌ మద్దతున్న యెమెన్‌లోని హౌతీ రెబల్స్‌ ఆధ్వర్యంలో వాణిజ్య నౌకలపై తరచూ దాడులు జరిగాయి. హమాస్‌కు మద్దతు ప్రకటించిన హౌతీ తిరుగుబాటుదారులు ఇజ్రాయెల్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న నౌకలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్‌ దాడులు, హైజాక్‌లు చేస్తున్నారు. ఈ ఘటనలతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా హిందూ మహాసముద్రంలో నౌకపై దాడి జరగడం కలకలం రేపింది. అయితే, ఈ దాడికి బాధ్యత వహిస్తూ ఇంతవరకూ ఎలాంటి ప్రకటనలు రాలేదు.

ఎర్ర సముద్రంలో నౌక హైజాక్‌ వీడియో రిలీజ్- నేరుగా హౌతీలతో మాట్లాడుతున్న జపాన్

వాణిజ్య నౌక హైజాక్- సముద్రపు దొంగలకు చుక్కలు చూపించిన ఇండియన్ నేవీ

Last Updated :Dec 23, 2023, 10:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.