ETV Bharat / bharat

మహాదేవ్​ బెట్టింగ్ యాప్ యజమాని దుబాయ్​లో అరెస్ట్- త్వరలో భారత్​కు!

author img

By PTI

Published : Dec 13, 2023, 11:21 AM IST

Updated : Dec 13, 2023, 12:36 PM IST

Mahadev Betting App Scam Ravi Uppal : దేశంలో తీవ్ర సంచలనం రేపిన మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. యాప్‌ ప్రధాన యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్‌ను దుబాయ్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Mahadev Betting App Scam Ravi Uppal
Mahadev Betting App Scam Ravi Uppal

Mahadev Betting App Scam Ravi Uppal : మహాదేవ్ బెట్టింగ్ యాప్​ యజమానుల్లో ఒకరైన రవి ఉప్పల్​ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్ విజ్ఞప్తి మేరకు ఇంటర్​పోల్ రెడ్​ కార్నర్​ నోటీసు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే దుబాయ్​లో ఉన్న రవిని వారం క్రితమే పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. అతడిని భారత్​ను తీసుకొచ్చేందుకు దుబాయ్ ప్రభుత్వంతో ఈడీ అధికారులు చర్చలు జరుపుతున్నారు.

ఈ కేసులో ఇప్పటికే దాఖలు చేసిన ఛార్జ్‌షీట్​లో రవి ఉప్పల్​కు వనౌటు దేశ పాస్​పోర్ట్ ఉందని ఈడీ పేర్కొంది. ఆ పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి అతడు పలు దేశాల్లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని దర్యాప్తులో తేలినట్లు ఈడీ పేర్కొంది. అయితే, అతడు భారత పౌరసత్వాన్ని వదులుకోలేదని, దీనిపైనే ఆస్ట్రేలియా వీసా కోసం దరఖాస్తు చేసుకున్నట్లు తెలిపింది. ఈ అక్రమ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో మనీలాండరింగ్‌కు పాల్పడ్డారని ఈడీ తెలిపింది. ఈ వ్యవహారంలో ఉప్పల్​తో పాటు మరొక ప్రమోటర్ సౌరభ్​ చంద్రకర్​పై ఛత్తీస్​గఢ్ రాయ్​పుర్​లోని ప్రివెన్షన్ ఆఫ్​ మనీ లాండరింగ్ యాక్ట్ (PLMA) కోర్టులో అక్టోబర్​లోనే ఈడీ ఛార్జ్​షీట్​ దాఖలు చేసింది. రూ.6వేల కోట్ల అక్రమ లావాదేవీలు సాగినట్లు ఈడీ అంచనా వేసింది.

మహాదేవ్ బెట్టింగ్ యాప్ వ్యవహారం..
ఛత్తీస్‌గఢ్‌లోని భిలాల్‌ ప్రాంతానికి చెందిన రవి ఉప్పల్‌, సౌరభ్‌ చంద్రఖర్‌ దుబాయ్‌ కేంద్రంగా భారత్‌లో మహదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌ కార్యకలాపాలను నిర్వహిస్తున్నారు. ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్‌ ముసుగులో వీరు మనీలాండరింగ్‌కు పాల్పడుతున్నారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈడీ రంగంలోకి దిగి ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న కోల్‌కతా, భోపాల్‌, ముంబయి వంటి తదితర నగరాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో రూ. వందల కోట్లలో అక్రమ నగదు బయటపడింది. ఈ బెట్టింగ్‌ యాప్‌ ద్వారా వచ్చే నగదు మొత్తాన్ని ఆఫ్‌-షోర్‌ అకౌంట్లకు తరలించేందుకు హవాలా మార్గాన్ని అనుసరిస్తున్నట్లు ఈడీ గుర్తించింది. అయితే, ఈ మనీలాండరింగ్‌ ఆరోపణలను రవి ఉప్పల్‌, సౌరభ్‌ చంద్రఖర్‌ ఖండించారు. మహదేవ్‌ యాప్‌తో తమకు ఎలాంటి సంబంధం లేదని, దాన్ని శుభమ్‌ సోని అనే వ్యక్తి నడిపిస్తున్నాడని చెప్పారు.

ప్రమోటర్ల నుంచి సీఎం బఘేల్​కు రూ.508కోట్ల చెల్లింపులు..
మరోవైపు, ఈ బెట్టింగ్‌ యాప్‌ వ్యవహారంలో ఛత్తీస్‌గఢ్‌ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్‌ బఘేల్‌పైనా ఆరోపణలు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు యాప్​ ప్రమోటర్లు ఛత్తీస్​గఢ్​ మాజీ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్​కు రూ. 508 కోట్లు చెల్లించినట్లు ఈడీ ఆరోపించింది. ఈ విషయాన్ని క్యాష్‌ కొరియర్‌ ఆసిమ్‌ దాస్‌ తన వాంగ్మూలంలో చెప్పాడని ఈడీ పేర్కొంది. ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆసిమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి రూ.5 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బును తనకు శుభమ్‌ సోని ఇచ్చాడని ఆసిమ్‌ చెప్పినట్లు ఈడీ వెల్లడించింది. అయితే తాను ఏ రాజకీయ నేతకు డబ్బు సరఫరా చేయలేదని తర్వాత దాస్‌ చెప్పాడు. అధికారులు తమతో బలవంతంగా ఆ వాంగ్మూలంపై సంతకం చేయించినట్లు ఆసిమ్​ దాస్ జైలు అధికారికి లేఖ రాసినట్లు వార్తలు వచ్చాయి. ఈ కేసులో మొత్తం రూ.417 కోట్ల ఆస్తులను ఈడీ సీజ్‌ చేసింది.

'బఘేల్​కు రూ.508కోట్లు!'- 'కాంగ్రెస్​ ఎన్నికల ప్రచారానికి బెట్టింగ్​ సొమ్ము, సీఎం జైలుకు వెళ్లడం పక్కా'

Mahadev Betting App Case : బెట్టింగ్ యాప్ కేసులో కమెడియన్​ కపిల్ శర్మ, నటి హ్యూమా ఖురేషికి ఈడీ సమన్లు..

Last Updated :Dec 13, 2023, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.