ETV Bharat / bharat

చిరాగ్​ వేరుకుంపటే జేడీయూను ముంచిందా?

author img

By

Published : Nov 11, 2020, 8:02 AM IST

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ ఎన్డీఏ మరోసారి విజయకేతనం ఎగురవేసింది. కూటమిలోని భాజపా అనూహ్యంగా పుంజుకోగా.. అదే సమయంలో గతంలో కంటే జేడీయూ కొన్ని సీట్లు కోల్పోయింది. ఎన్డీఏ నుంచి బయటకొచ్చి స్వతంత్రంగా పోటీ చేసిన లోక్‌జన శక్తి పార్టీ... జేడీయూ ఓట్లను చీల్చడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

LJP JDU
నితీశ్ చిరాగ్

బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు సాధించిన లోక్‌జన శక్తి పార్టీ... జేడీయూ విజయావకాశాలపై మాత్రం తీవ్రంగా ప్రభావం చూపింది. ఎల్‌జేపీ కారణంగా జేడీయూ దాదాపు 30కి పైగా సీట్లను కోల్పోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన ఎల్‌జేపీ.. జేడీయూ అభ్యర్థులు నిలుచున్న చోట తమ పార్టీ అభ్యర్థులను నిలబెట్టింది. అంతిమంగా పలు నియోజకవర్గాల్లో జేడీయూ గెలుపుపై ఇది ప్రభావం చూపింది. బిహార్‌ ఎన్నికల్లో 243 స్థానాలకు గానూ జేడీయూ 115, భాజపా 110 స్థానాల్లో పోటీ చేశాయి. జితన్‌రాం మాంఝీ పార్టీ హిందుస్థానీ అవామీ మోర్చా ఏడు స్థానాల్లోను, వికాశ్‌ శీల్‌ ఇన్షాల్‌ పార్టీ 11 స్థానాల్లో పోటీ చేశాయి.

జేడీయూకు వ్యతిరేకంగా..

సీట్ల పంపకానికి కొద్ది రోజుల ముందు నితీశ్‌ను వ్యతిరేకిస్తూ చిరాగ్‌ పాసవాన్ పార్టీ ఎల్జేపీ ఎన్డీయే నుంచి బయటకొచ్చింది. అదే సమయంలో భాజపాతో తమ బంధం కొనసాగుతుందని స్పష్టం చేసింది. జేడీయూ అభ్యర్థులు నిల్చున్న చోట ఎల్జేపీ తమ అభ్యర్థులను నిలబెట్టింది. మొత్తంగా 135 సీట్లలో పోటీ చేసింది. ఫలితాల్లో జేడీయూకు 15 శాతం కంటే ఎక్కువ ఓట్లు రాగా భాజపాకు 19 శాతం కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఎల్జేపీ దాదాపు 5.7 శాతం ఓట్లు సాధించింది.

చిన్న కారణాలతో..

ఒకవేళ చిరాగ్‌ ఎన్డీయేతో కలిసి పోటీ చేసి ఉంటే జేడీయూకు ఈ పరిస్థితి ఏర్పడేది కాదు. ఎన్డీయే నుంచి ఎల్​జేపీ బయటకు రావడానికి చిరాగ్‌ చెప్పిన కారణలేవీ సహేతుకంగా అనిపించవు. నితీశ్‌ అవినీతికి పాల్పడ్డారని, ఆయన బిహార్‌కు ఏమీ చేయలేదని విమర్శిస్తూ వచ్చారు. తమకు చెక్‌ పెట్టేందుకే జీతన్‌రాం మాంఝీని కూటమిలోకి తీసుకొచ్చారని నితీశ్‌ను తప్పుబట్టారు. ఈ కారణాలతో స్వతంత్రంగా పోటీ చేశారు.

భాజపాపై ఆరోపణలు..

కానీ ప్రభుత్వంలో అంతర్భాగంగా ఉన్న భాజపాను చిరాగ్‌ పాసవాన్ ఏనాడూ పల్లెత్తు మాట అనలేదు. ఫలితంగా ఎల్జేపీని భాజపానే ఒంటరిగా పోటీ చేయించిందన్న ఆరోపణలూ వచ్చాయి. జేడీయూ సీట్లను భారీగా చీల్చడం ద్వారా ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కమలదళం భావించినట్లు విశ్లేషణలు ఉన్నాయి. ఎల్​జేపీ బయటకొచ్చిన తొలినాళ్లలో భాజపా కూడా చిరాగ్‌ను పెద్దగా విమర్శించిన దాఖలాల్లేకపోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుతోంది.

అయితే ఈ వ్యూహం వల్ల మహాకూటమి బలపడే అవకాశం ఉందన్న అంచనాకొచ్చిన కాషాయ పార్టీ ఎల్​జేపీతో తమకు ఎలాంటి బంధం లేదని ప్రకటించింది. నిన్న మొన్నటి వరకు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న ఎల్జేపీ... అధికార పార్టీపై ఆరోపణలు చేయడం జేడీయూకు నష్టం చేసింది. అంతిమంగా ఆ పార్టీ సీట్లు తగ్గేలా చేసింది. జేడీయూ, భాజపా దాదాపు చెరి సగం స్థానాల్లో పోటీ చేసినా రెండు పార్టీల మధ్య 31 సీట్ల అంతరం ఉంది.

ఇదీ చూడండి: సీట్లు పెరిగినా భాజపాకు ఓట్లు మాత్రం తగ్గాయ్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.