ETV Bharat / bharat

బీజేపీ తరఫున కిచ్చా సుదీప్ ప్రచారం.. ఎన్నికల్లో పోటీకి దూరం!

author img

By

Published : Apr 5, 2023, 12:27 PM IST

Updated : Apr 5, 2023, 5:41 PM IST

ప్రముఖ నటుడు కిచ్చా సుదీప్‌.. కర్ణాటక శాసనసభ ఎన్నికల వేళ బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మైకు ఆయన మద్దతు ప్రకటించారు. బుధవారం బెంగళూరులో సీఎం బొమ్మైతో కలిసి నిర్వహించిన ప్రెస్​ మీట్​లో ఈ విషయం స్పష్టం చేశారు.

kiccha sudeep joining bjp
kiccha sudeep joining bjp

కన్నడ సూపర్‌స్టార్ కిచ్చా సుదీప్.. కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో బీజేపీ తరఫున ప్రచారం చేయనున్నారు. కమలదళంలో చేరతారని తొలుత వార్తలు వచ్చినా.. ఆయన బీజేపీకి మద్దతుగా ప్రచారం చేయడం వరకే పరిమితమయ్యారు. బెంగళూరులో బుధవారం కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, కిచ్చా సుదీప్ కలిసి నిర్వహించిన ప్రెస్​ మీట్​లో ఈ విషయం ప్రకటించారు. "బసవరాజ్ బొమ్మై నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. నా మద్దతు ఆయనకే. కష్టకాలంలో నాకు అండగా నిలిచిన వారి తరఫున నేను పని చేస్తా. నేను రాజకీయాల్లోకి రావడం లేదు. ఎన్నికల్లో పోటీ చేయడం లేదు" అని స్పష్టం చేశారు సుదీప్.

"సుదీప్.. ఏ రాజకీయ పార్టీకి చెందరు. ఆయన నాకు మద్దతు పలికారు. నాకు మద్దతు ఇస్తున్నారంటే.. బీజేపీకి కూడా ఆయన మద్దతు ఇస్తున్నట్లే" అని సీఎం బసవరాజ్ బొమ్మై చెప్పారు.
మరోవైపు.. కన్నడ చిత్ర సీమకు చెందిన మరో ప్రముఖ నటుడు దర్శన్​ కూడా బీజేపీలో చేరతారని జోరుగా వార్తలు వినిపించాయి. సుదీప్​, దర్శన్​ మద్దతు కోసం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి కె. సుధాకర్​ సంప్రదింపులు జరిపినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.

'ప్రైవేట్ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేస్తాం'
అంతకుముందు.. సుదీప్ బీజేపీలో చేరనున్నారన్న వార్తల నేపథ్యంలో ఆయన మేనేజర్​ జాక్​ మంజుకు బెదిరింపు లేఖ అందింది. అందులో సుదీప్​ ప్రైవేట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తామని దుండగులు బెదిరించారు. దీంతో మేనేజర్​ వెంటనే పుట్టెనహళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ బెదిరింపు లేఖపై సుదీప్ స్పందించారు. ఆ లేఖ పంపిన వారికి దీటైన జవాబు ఇస్తానని చెప్పారు. 'నాకు బెదిరింపు లేఖ వచ్చింది. సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఆ లేఖ పంపారో నాకు తెలుసు. నేను వారికి తగిన సమాధానం ఇస్తాను. నా కష్టకాలంలో నాకు అండగా నిలిచిన వారికి అనుకూలంగా పనిచేస్తాను' అని సుదీప్ తెలిపారు.

సీరియల్‌ ఆర్టిస్ట్​గా తన కెరీర్‌ మొదలుపెట్టిన సుదీప్‌ 'తాయవ్వ'తో వెండితెరకు పరిచయమయ్యారు. ఇందులో ఆయన సహాయ నటుడిగా కనిపించారు. 'స్పర్శ' చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. కన్నడలోనే కాకుండా తెలుగు, హిందీ సినిమాల్లోనూ ఆయన అలరించారు. 'ఈగ' చిత్రంతో తెలుగువారికీ మరింత దగ్గరయ్యారు. ఇటీవల ఆయన నటించిన 'విక్రాంత్‌ రోణ'తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.

కర్ణాటకలో ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల జరగనున్నాయి. మే 10 న ఎన్నికలు జరగనుండగా.. మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నువ్వా-నేనా అన్న రీతిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. నటులను పార్టీలో చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. హీరోలను పార్టీలో చేర్చుకోవడం వల్ల వారి అభిమానుల ఓట్లను, వారి జనాకర్షణతో ప్రజల ఓట్లను కొల్లగొట్టొచ్చని పార్టీలు అభిప్రాయపడుతున్నాయి.

Last Updated :Apr 5, 2023, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.