ETV Bharat / bharat

రాజస్థాన్​లో బీజేపీకి ఎదురుదెబ్బ - ఉపఎన్నికలో మంత్రి ఓటమి

author img

By PTI

Published : Jan 8, 2024, 5:34 PM IST

Karanpur By Election Result : రాజస్థాన్​లో బీజేపీకి ఎదురుదెబ్బ తగిలింది. కరణ్​పుర్ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో మంత్రి సురేంద్ర పాల్, కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. దీంతో ఎన్నికల్లో గెలవకుండానే మంత్రి అయిన సురేంద్ర పాల్ మంత్రి పదవి చేజారింది.

Karanpur By Election Result
Karanpur By Election Result

Karanpur By Election Result : రాజస్థాన్​లోని కరణ్​పుర్ నియోజకవర్గానికి జరిగిన ఉపఎన్నికలో అధికార బీజేపీ సర్కార్​కు ఎదురుదెబ్బ​ తగిలింది. ఎన్నికల్లో గెలవకుండానే మంత్రి అయిన సురేంద్ర పాల్ సింగ్​, కాంగ్రెస్ అభ్యర్థి రూపిందర్ సింగ్ కూనూర్​ చేతిలో 11,283 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. రూపిందర్​ సింగ్​కు 94,950 ఓట్లు రాగా, సురేంద్ర పాల్​కు 83,667 ఓట్లు వచ్చాయి.

కాగా ఉపఎన్నికలో విజయంపై కాంగ్రెస్ అభ్యర్థి రూపిందర్ సింగ్ స్పందించారు. తనకు ఓట్లు వేసిన కరణ్​పుర్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రచారం కోసం కేంద్ర మంత్రులు వచ్చినా, ప్రజలు వారిని (బీజేపీ) తిరస్కరించారని అన్నారు. కరణ్​పుర్​ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని గెలిపించారని చెప్పారు.

రాజస్థాన్​లో 200 అసెంబ్లీ స్థానాలున్నాయి. అయితే ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కరణ్​పుర్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్​ సింగ్ చనిపోయారు. ఈ కారణంగా 199 స్థానాలకే ఎన్నికలు జరిగాయి. అనంతరం వెలువడిన ఫలితాల్లో బీజేపీ 115 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కరణ్​పుర్ బీజేపీ అభ్యర్థికి ఉన్న సురేంద్ర పాల్​ను గెలవకుండానే మంత్రివర్గంలోకి తీసుకున్నారు ముఖ్యమంత్రి భజన్​లాల్​ శర్మ.

మంత్రి పదవి దక్కించుకున్న సురేంద్ర పాల్ నిబంధనలు ప్రకారం ఆరు నెలల్లో అసెంబ్లీకి ఎన్నిక కావాలి. ఈ క్రమంలో జనవరి 5న ఈ స్థానానికి ఉపఎన్నిక నిర్వహించారు. బీజేపీ నుంచి సురేంద్ పాల్ బరిలో నిలవగా, కాంగ్రెస్​ నుంచి గుర్మీత్​ సింగ్ కుమారుడు రూపిందర్ సింగ్ పోటీ చేశారు. జనవరి 8న విడుదలైన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో సురేంద్ర పాల్​ ఓటమి చవిచూశారు. కరణ్​పుర్​లో సురేంద్ర పాల్​ ఓడిపోవడం ఇది రెండోసారి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రూపిందర్ తండ్రి గుర్మీత్​ సింగ్​ చేతిలో ఓటమిపాలయ్యారు.

మంత్రిగా 10 రోజులే!
2023 డిసెంబర్ 30న రాజస్థాన్​ ప్రభుత్వం మంత్రివర్గ విస్తరణ చేసింది. సురేంద్ర పాల్​ను మంత్రివర్గంలోకి తీసుకుని వ్యవసాయ మార్కెటింగ్ బోర్డు, ఇందిరా గాంధీ కెనాల్ డిపార్ట్​మెంట్, మైనారిటీ వ్యవహారాల శాఖలను కేటాయించారు. అయితే ఇంకా ఎన్నికలు జరగని స్థానంలో పోటీలో నిలబడ్డ అభ్యర్థికి మంత్రి పదవి ఇవ్వడంపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు ఎన్నికల కమిషన్​కు కూడా ఫిర్యాదు చేసింది కాంగ్రెస్.

గహ్లోత్-పైలట్ ఫైట్, గుజ్జర్లు దూరం- రాజస్థాన్​లో కాంగ్రెస్ పతనానికి కారణాలివే!

సంప్రదాయానికే జై- రాజస్థాన్ అధికారం పీఠం బీజేపీదే- గహ్లోత్​ షాక్​ రాజీనామా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.