ETV Bharat / opinion

గహ్లోత్-పైలట్ ఫైట్, గుజ్జర్లు దూరం- రాజస్థాన్​లో కాంగ్రెస్ పతనానికి కారణాలివే!

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 3, 2023, 6:03 PM IST

reasons for congress loss in rajasthan election
reasons for congress loss in rajasthan election

Reasons For Congress Loss In Rajasthan Election : రాజస్థాన్​లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి అనేక కారణాలు కనిపిస్తున్నాయి. గహ్లోత్ ప్రభుత్వంపై ఉన్న అసంతృప్తికి తోడు కాంగ్రెస్​లో కుమ్ములాటలు ఎన్నికల్లో ఆ పార్టీని దెబ్బతీశాయి. పేపర్ లీకులు, రెబల్స్ సమస్యతో పాటు గుజ్జర్లు దూరం కావడం కాంగ్రెస్​కు ప్రతికూలంగా మారినట్లు తెలుస్తోంది.

Reasons For Congress Loss In Rajasthan Election : పార్టీలో వర్గపోరు, ప్రభుత్వ వ్యతిరేకత, ప్రతికూల సామాజిక సమీకరణాలు- అధికారం కోల్పోవడానికి ఉండాల్సిన అన్ని అంశాలు కాంగ్రెస్ పక్షానే ఉండటం ఆ పార్టీని నట్టేట ముంచింది. ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఘోర పరాభవాన్ని తప్పించుకోలేకపోయింది. యువత, మహిళల ఆగ్రహాన్ని తట్టుకోలేక అధికారం కోల్పోయింది. స్వయంకృతాపరాధాలే రాజస్థాన్​లో కాంగ్రెస్​ను దెబ్బతీసినట్లు రాజకీయ పండితులు చెబుతున్నారు.

గహ్లోత్ X పైలట్
రాజస్థాన్​లో కాంగ్రెస్ ఓటమికి కారణాల్లో ముందుండేది ఆ పార్టీలో అంతర్గత కుమ్ములాటలే. అగ్రనేతలైన అశోక్ గహ్లోత్, మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్ మధ్య కలహాలు పార్టీ ఇమేజ్​ను దారుణంగా దెబ్బ తీశాయి. సర్కారు తీరును నిరసిస్తూ పైలట్ ఆమరణ దీక్ష చేపట్టడం, అవినీతికి వ్యతిరేకంగానే తాను డిమాండ్ చేస్తున్నానని సమర్థించుకోవడం వంటి పరిణామాలు పార్టీ వర్గాలనే కాక, సాధారణ ప్రజలను సైతం గురిచేశాయి.

కొంపముంచిన లీకులు
పరీక్ష పేపర్ల లీక్ వ్యవహారం రాజస్థాన్​లో కాంగ్రెస్​కు ప్రతికూలమైంది. సీఎం అశోక్‌ గహ్లోత్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న జోధ్‌పుర్ జిల్లాలోనూ ఈ విషయంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగేళ్లలో 18సార్లు పేపర్లు లీక్ అయ్యాయి. అవి తమ కుటుంబాలను కోలుకోలేని దెబ్బతీశాయనే భావన యువతలో కనిపించింది. ఈ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడంలో బీజేపీ విజయవంతమైన నేపథ్యంలో కాంగ్రెస్​కు ఓటమి తప్పలేదు.

ప్రభుత్వంపై వ్యతిరేకత
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్రస్థాయిలో సరిగా అమలు కాలేదని ఎన్నికల సమయంలో కాంగ్రెస్​లోనే అంతర్గతంగా గుసగుసలు వినిపించాయి. దీంతో పథకాలను సరిగా ప్రచారం చేసుకోలేకపోయారు. వంట గ్యాస్​పై సబ్సిడీ వంటి స్కీమ్​లతో రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకతను గహ్లోత్ కాస్త తగ్గించుకునే ప్రయత్నం చేశారు. అయితే, లోకల్ లెవెల్​లో ఈ వ్యతిరేకత తగ్గకపోవడం నెగెటివ్​గా మారింది.

గుజ్జర్ గేమ్!
సచిన్ పైలట్ పట్ల కాంగ్రెస్ వ్యవహరించిన తీరుతో గుజ్జర్లు ఆ పార్టీకి దూరమయ్యారు. సచిన్ పైలట్​ను ముఖ్యమంత్రిని చేస్తారన్న అంచనాతో గత ఎన్నికల్లో హస్తం పార్టీకి ఓటేసిన ఆ వర్గం ఓటర్లు ఈ సారి మాత్రం కాంగ్రెస్​కు షాక్ ఇచ్చారు.

రెబెల్స్ సమస్య
రాష్ట్రంలో రెబల్స్ కాంగ్రెస్​కు తలనొప్పి తెచ్చిపెట్టారు. సొంత పార్టీ నేతలే అనేక ప్రాంతాల్లో పార్టీ విజయావకాశాలను దెబ్బతీశారు. ఏఐసీసీ ఇంఛార్జిలు రంగంలోకి దిగినా రెబల్స్ వెనక్కి తగ్గలేదు. ఫలితంగా కాంగ్రెస్ అభ్యర్థుల ఓట్లలో భారీగా చీలిక వచ్చి బీజేపీకి లాభం చేకూరినట్లు తెలుస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.