ETV Bharat / bharat

నీట్‌, జేఈఈ విలీనం విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకే

author img

By

Published : Aug 13, 2022, 10:08 AM IST

Updated : Aug 13, 2022, 11:50 AM IST

neet jee merge విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు యూజీసీ సరికొత్త ప్రతిపాదనతో ముందుకొచ్చింది. నీట్, జేఈఈ, సీయూఈటీ పరీక్షలను విలీనం చేయాలని భావిస్తోంది. మార్కులను బట్టి విభిన్న కోర్సుల్లో చేరే వెసులుబాటు కల్పించనున్నట్లు యూజీసీ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

neet jee merge
neet jee merge

neet jee merge 2023: విద్యార్థులపై ప్రవేశ పరీక్షల ఒత్తిడిని తగ్గించడానికి యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ కొత్త ప్రతిపాదనను తెరమీదికి తెచ్చింది. కేంద్ర విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నుంచి మొదలుపెట్టిన సీయూఈటీలోకే నీట్‌, జేఈఈ మెయిన్‌ను విలీనం చేయాలని యోచిస్తున్నట్లు యూజీసీ ఛైర్మన్‌ ఎం.జగదీశ్‌కుమార్‌ చెప్పారు. "ప్రస్తుతం ఈ మూడు పరీక్షలనూ ఎన్టీయే(నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ) నిర్వహిస్తోంది. మూడు వేర్వేరు పరీక్షలను ఒకే పరీక్ష కిందికి తెస్తే ఎన్టీయే దాన్ని మరింత సమర్థంగా నిర్వహించడానికి వీలవుతుంది. విద్యార్థులు ఒకే పరీక్ష రాసి తమకు వచ్చిన మార్కుల ఆధారంగా ఏదో ఒక కోర్సును ఎంచుకోవడానికి వీలవుతుంది. అందుకే ఈ కొత్త విధానాన్ని తీసుకురాబోతున్నాం" అని ఆయన తెలిపారు. ఈ అంశంపై సంబంధిత భాగస్వాములతో చర్చించి ఏకాభిప్రాయానికి రావడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. తీసుకురాబోతున్న కొత్త విధానంపై 'ఈనాడు' ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.

ugc chairman Jagadesh Kumar
ugc chairman Jagadesh Kumar

పరీక్ష విధానంలో రానున్న మార్పులు ఏమిటి?
ప్రస్తుతం నీట్‌ విద్యార్థులు ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ రాస్తారు. జేఈఈ విద్యార్థులు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ రాస్తారు. సీయూఈటీలోనూ ఈ సబ్జెక్టులతోపాటు 61 విభిన్న ఇతర సబ్జెక్టులు కూడా ఉంటాయి. ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌ ఆధారంగా అన్నింటికీ కలిపి ఒకే సీయూఈటీ నిర్వహిస్తే విద్యార్థులకు వెసులుబాటు ఉంటుందని భావిస్తున్నాం. ఇలా చేసినప్పుడు నీట్‌లో ప్రవేశాలు కల్పించే విద్యాసంస్థలు కేవలం ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, బయాలజీ సబ్జెక్టుల్లో విద్యార్థులకు వచ్చిన మార్కులు తీసుకొని సీటు ఇస్తాయి.

  • ఇంజినీరింగ్‌ విద్యా సంస్థలు మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్ట్‌ మార్కులను పరిగణనలోకి తీసుకుంటాయి.
  • ఇంజినీరింగ్‌, మెడిసిన్‌లలో సీట్లు దొరకని విద్యార్థులు ఇదే ప్రవేశపరీక్ష స్కోర్‌తో ఇతర సాధారణ యూనివర్సిటీల్లో తమకు నచ్చిన కోర్సుల్లో చేరొచ్చు.

విలీన విధాన ఆలోచన ఎలా వచ్చింది?
సీయూఈటీ(సెంట్రల్‌ యూనివర్సిటీస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌) ప్రవేశపెట్టిన తర్వాత దేశంలో నీట్‌, జేఈఈ మెయిన్‌తో కలిపి మూడు ప్రధాన పరీక్షలు నడుస్తున్నాయి. చాలా మంది ఈ మూడూ రాస్తారు. అప్పుడే ఒకే విద్యార్థి మూడు పరీక్షలు రాయాల్సిన అవసరం ఏముంది అన్న ఆలోచన వచ్చింది.

దీనివల్ల ప్రయోజనాలు ఏముంటాయి? ప్రవేశపరీక్ష ఒకటి కావడమేనా?
బహుళ పరీక్షల బాధ నుంచి విద్యార్థులకు విముక్తి లభిస్తుంది. అదే పెద్ద ప్రయోజనం. ఒక పరీక్షపై దృష్టిపెడితే సరిపోతుంది. అదికూడా 12వ తరగతిలో చదివిన అంశాలపై దృష్టిపెడితే చాలు. మల్టిపుల్‌ఛాయిస్‌ క్వశ్చన్స్‌లో నాలుగురకాల పరీక్ష ఉంటుంది. కొన్ని.. విద్యార్థుల జ్ఞాపకశక్తికి పరీక్షపెడతాయి. ఇంకొన్ని.. ఇచ్చిన జవాబుల్లో ఎంచుకున్న ప్రకారం వారి విశ్లేషణ శక్తిని పరీక్షిస్తాయి. మరికొన్ని సింపుల్‌కాన్సెప్ట్‌ ఆధారంగా ఉంటాయి. అలాగే ఒక పేరా ఇచ్చి దాని ఆధారంగా ప్రశ్నలుంటాయి.

సాధారణ కేంద్ర విశ్వవిద్యాలయాల పరీక్షలతో పోలిస్తే నీట్‌, జేఈఈ చాలా కఠినంగా ఉంటాయి కదా? ఇప్పుడు వాటిని మిగతా వాటితో కలిపేస్తే వాటి నాణ్యతపై ప్రభావం చూపదా?
మన విద్యార్థుల ప్రతిభా సామర్థ్యాలను వాళ్లు 12వ తరగతిలో ఏం చదివారన్నదాని ఆధారంగా పరీక్షించాలి. అంతే తప్ప హైస్టాండర్డ్స్‌ పేరుతో వారికి తెలియనివి, చదవనివి ప్రవేశపరీక్షల్లో ఇచ్చి, వాటిని అర్థం చేసుకొనేందుకు పిల్లలు కోచింగ్‌ సెంటర్లకు వెళ్లేలా చేయకూడదు. అలా ఉంటే అక్కడ కోచింగ్‌కు గిరాకీ పెరుగుతుంది. పిల్లలపై అనవసరమైన భారాన్ని మోపడం మంచిదికాదు. సీయూఈటీ ప్రశ్న పత్రంపట్ల విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్లస్‌టూలో వాళ్లు ఏం చదివారన్నదానిపై ఆధారపడి ప్రశ్నలుంటాయి. ప్రవేశపరీక్షలు అలాగే ఉండాలి.

ప్రవేశపరీక్షల విలీన అధ్యయన కమిటీ ఎప్పటిలోపు ఏర్పాటు చేస్తారు?
నెల, రెండు నెలల్లో కమిటీ ఏర్పాటుచేయొచ్చు. అది ఆరునెలల్లో సంబంధిత భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహిస్తుంది. ఇప్పుడు జరుగుతున్న ప్రవేశపరీక్షలను అధ్యయనం చేస్తుంది. ఒకే ప్రవేశపరీక్ష ఎలా పెట్టవచ్చో సిఫార్సులు చేస్తుంది. ఆ సిఫార్సులను యూజీసీ, కేంద్ర విద్యాశాఖ, ఎన్టీయేలు కలిసి కూర్చొని చర్చించి పరీక్ష విధానాన్ని రూపొందిస్తాయి. అయితే అంతకుముందే విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర భాగస్వాములను మానసికంగా సిద్ధంచేయడానికి ఇప్పటి నుంచే చర్చ మొదలుపెట్టాం. దానివల్ల లాభనష్టాలు తెలిసి వచ్చి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవడానికి వీలవుతుంది.

ఇప్పుడు నీట్‌, జేఈఈ ర్యాంకులు ఇస్తున్నారు. సీయూఈటీలోనూ ర్యాంకులు ప్రకటిస్తారా?
ఆ విషయం కమిటీ నిర్ణయిస్తుంది. అయితే కొందరు మాత్రం మూడు వేర్వేరు పరీక్షలు రాసినప్పుడు మాకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి కదా? ఒకటే చేస్తే అవి తగ్గిపోవా అనే సందేహం వ్యక్తంచేస్తున్నారు. వాటిని పరిగణనలోకి తీసుకునే భవిష్యత్తులో సీయూఈటీని సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించాలని భావిస్తున్నాం. మే, డిసెంబరులలో రెండుసార్లు పరీక్ష రాయొచ్చు. ఒకసారి కాకపోయినా మరోసారి అవకాశం చేజిక్కించుకోవడానికి వీలవుతుంది.

కొంత ఆలస్యమైనా కొత్త విధానం రావడం తథ్యమా?
అవును. వీలైతే వచ్చే సంవత్సరమే దీన్ని అమల్లోకి తేవాలన్నది మా లక్ష్యం. ఒకవేళ చేయలేకపోతే 2024-25 సంవత్సరంలో తప్పకుండా తీసుకువస్తాం. ఇలాంటి నిర్ణయాలు తొందరపడి తీసుకోకూడదు. అన్నికోణాల్లో ఆలోచించి, భాగస్వాములందరి అభిప్రాయాలు స్వీకరించి ముందుకు వెళ్లాలన్నదే మా ఉద్దేశం. అందుకే దీనిపై మేం చర్చను కోరుతున్నాం.

Last Updated :Aug 13, 2022, 11:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.