ETV Bharat / bharat

చైనా, అమెరికా విదేశాంగ మంత్రులతో జైశంకర్ చర్చ

author img

By

Published : May 1, 2021, 5:21 AM IST

JAI SHANKAR
చైనా, అమెరికా విదేశాంగ మంత్రులతో జైశంకర్ చర్చ

చైనా, అమెరికా విదేశాంగ మంత్రులతో శుక్రవారం ఫోన్​లో సంభాషించారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. భారత్​కు వచ్చే కార్గో విమానాలను అనుమతించాలని చైనాను కోరారు. తూర్పు లద్దాఖ్ సమస్యపైనా చర్చించారు. మరోవైపు, కరోనా కట్టడిపై అమెరికా విదేశాంగ మంత్రితో మాట్లాడారు జైశంకర్.

భారత్​కు వచ్చే కార్గో విమానాలను అనుమతించడం సహా.. రవాణా మార్గాలను తెరిచే ఉంచాలని చైనాకు విజ్ఞప్తి చేశారు విదేశాంగ మంత్రి జైశంకర్. చైనా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి వాంగ్ యీతో శుక్రవారం ఫోన్​లో మాట్లాడిన ఆయన.. భారత్​లోని సంస్థలు అక్కడి తయారీదారుల నుంచి కీలక ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నారని తెలిపారు.

అమెరికా సంస్థలు తమ ఔషధ వనరులను చైనా నుంచి భారత్​కు పంపించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. చైనాకు చెందిన సిచువాన్ ఎయిర్​లైన్స్.. విమానాలను రద్దు చేయడం వల్ల ఈ ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో సమస్యను వాంగ్​ యీ దృష్టికి తీసుకెళ్లారు జైశంకర్. సప్లై చైన్ ప్రాముఖ్యతను గుర్తు చేసినట్లు జైశంకర్ తెలిపారు. ఇటువంటి పరిస్థితుల్లో రవాణా విమానాల రాకపోకలను కొనసాగించాలని పేర్కొన్నారు. దీనిపై వాంగ్​ యీ సానుకూలంగా స్పందించారని చెప్పారు.

కరోనా మహమ్మారిని ఎదుర్కొనే విషయంలో అవసరమయ్యే చర్యలు చేపట్టేందుకు భారత్ పూర్తిగా కట్టుబడి ఉందని జైశంకర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారని విదేశాంగ శాఖ తెలిపింది. కరోనాపై పోరాడుతున్న భారత్​కు సంఘీభావం తెలుపుతామన్న చైనా అభ్యర్థన మేరకు ఈ ఫోన్​ కాల్ ఏర్పాట్లు చేసినట్లు వివరించింది. ప్రధాని మోదీకి చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ లేఖ రాసిన కొద్దిగంటలకే విదేశాంగ మంత్రుల మధ్య సంభాషణ జరగడం గమనార్హం.

తూర్పు లద్దాఖ్ అంశం

ఫోన్​ కాల్ సందర్భంగా సరిహద్దు సమస్య చర్చకు వచ్చింది. తూర్పు లద్దాఖ్​లో వీలైనంత త్వరగా బలగాల ఉపసంహరణ పూర్తి చేయాలని జైశంకర్.. వాంగ్​ యీకి పిలుపునిచ్చారు. మాస్కో ఒప్పందానికి కట్టుబడి ఉండాలని కోరారు. పూర్తిస్థాయిలో ఈ ఒప్పందాన్ని అమలు చేయడంపై చర్చించినట్లు జైశంకర్ తెలిపారు.

అమెరికాతోనూ

మరోవైపు, అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్​తోనూ జైశంకర్ మాట్లాడారు. కరోనాపై సమర్థవంతంగా పోరాటం సాగించేందుకు భారత్​కు అవసరమయ్యే వనరుల చర్చించినట్లు తెలిపారు. అమెరికా నుంచి వైద్య పరికరాల సరఫరా సహా ఆక్సిజన్ సప్లై పెంపు, వ్యాక్సిన్ ఉత్పత్తి విస్తృతి వంటి విషయాలపై చర్చించినట్లు చెప్పారు.

ఇదీ చదవండి- భారత్​కు సాయం చేసేందుకు సిద్ధం: ఐరాస

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.