ETV Bharat / bharat

నేవీ కోసం రఫేల్ జెట్లు.. రూ.90వేల కోట్లతో ఫ్రాన్స్​తో డీల్! మోదీ టూర్​లో ఖరారు!

author img

By

Published : Jul 11, 2023, 7:32 AM IST

Rafale Navy India : ఫ్రాన్స్ నుంచి మరో 26 అత్యాధునిక రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు చేసేందుకు భారత్ సిద్ధమైంది! మూడు స్కార్పెన్ తరగతికి చెందిన సబ్​మెరైన్లు సైతం కొనుగోలు చేయనున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటనలో ఈ ఒప్పందం ఖరారు ఖానున్నట్లు సమాచారం.

rafale navy india
rafale navy india

Rafale Navy India : భారత నౌకాదళం కోసం 26 అత్యాధునిక రఫేల్ యుద్ధవిమానాలతో పాటు మూడు స్కార్పెన్ తరగతికి చెందిన జలాంతర్గాముల కొనుగోలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నెల 13, 14 తేదీల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన సందర్భంగా ఇందుకు సంబంధించిన ఒప్పంద ప్రకటన వెలువడనున్నట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. వీటికి సంబంధించి రక్షణ బలగాలు ఇప్పటికే మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. గతంలో 36 రఫేల్ యుద్ధ విమానాలు కొనుగోలు సమయంలో అనుసరించిన విధంగా ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని భారత్ , ఫ్రాన్స్ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ కొనుగోలు ప్రతిపాదనలపై ఇప్పటికే రక్షణశాఖ ఉన్నతాధికారులు చర్చించారని, త్వరలోనే రక్షణ పరికరాల కొనుగోలు మండలి ఆమోదం తెలుపుతుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

తాజా ప్రతిపాదనల ప్రకారం ఒకే సీటు కలిగిన 22 రఫేల్ మెరైన్ విమానాలు భారత నౌకాదళానికి అందుతాయి. దీంతో పాటు నాలుగు శిక్షణా విమానాలు సైతం అందుతాయి. ఒప్పందం విలువ రూ.90 వేల కోట్లుగా ఉండవచ్చని అంచనా. అయితే, కచ్చితమైన విలువ మాత్రం ఒప్పందం ఖరారైన తర్వాతే తెలిసే అవకాశం ఉంది. ఇక భారత్ వద్ద ప్రస్తుతం 36 రఫేల్ విమానాలు ఉన్నాయి. ఒప్పందం ప్రకారం విడతలవారీగా ఈ యుద్ధ విమానాలను దసో ఏవియేషన్.. భారత్​కు సరఫరా చేసింది. యుద్ధ విమానాల్లో చివరిదైన 36వ రఫేల్ జెట్ గతేడాది డిసెంబర్​లో భారత్​కు చేరుకుంది.

ఇంజిన్ల టెక్నాలజీ ట్రాన్స్​ఫర్!
టెక్నాలజీ, రక్షణ అంశాల చుట్టూనే ప్రధానంగా మోదీ పర్యటన అజెండా ఉండనుంది. ఆయన వెంట టాప్ సీఈఓలు, వ్యాపారవేత్తలు సైతం ఫ్రాన్స్ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. భారత్​కు చెందిన అడ్వాన్స్​డ్ లైట్ హెలికాప్టర్లలో ఉపయోగించే శక్తి ఇంజిన్ల కోసం టెక్నాలజీ ట్రాన్స్​ఫర్ అంశం పర్యటనలో కీలకమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేస్తున్న ఈ ఇంజిన్లకు సాంకేతికత బదిలీ వల్ల.. భారత రక్షణ పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.