ETV Bharat / bharat

శరవేగంగా రోడ్లు, సొరంగాల నిర్మాణం.. చైనా బార్డర్​లో భారత్​ దూకుడు

author img

By

Published : Dec 20, 2022, 2:31 PM IST

indian govt developing infrastructures in lac
నిర్మాణాలు చేపడుతున్న భారత్​ బలగాలు

చైనాతో ముప్పు పొంచి ఉన్న వేళ అరుణాచల్‌ప్రదేశ్‌లో రహదారులు, వంతెనలు, సొరంగ మార్గాలను భారత్‌ యుద్ధ ప్రాతిపదికన నిర్మిస్తోంది. అతి శీతల వాతావరణ పరిస్థితులు ఎదురైనా సరిహద్దులకు వేగంగా సైనిక బలగాలను తరలించేందుకు వీలుగా వీటిని బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ నిర్మిస్తోంది. చైనాతో సరిహద్దు కలిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌లోని గ్రామాలను రహదారులతో అనుసంధానించనున్నారు. ఆ ప్రాంత అభివృద్ధికి ఇది దోహదం చేయనుందని అధికారులు తెలిపారు.

అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ ప్రాంతాన్ని టిబెట్‌లో భాగమని వాదిస్తున్న చైనా పదే పదే చొరబాట్లకు యత్నిస్తున్న వేళ.. భారత్‌ పూర్తిగా అప్రమత్తమైంది. డ్రాగన్‌ ఎలాంటి దుస్సాహసానికి పాల్పడినా ఎదుర్కొనేందుకు వాస్తవాధీన రేఖ వద్ద భారీ ఎత్తున బలగాలను మోహరించిన భారత్‌.. సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని వేగవంతం చేసింది. పర్వతాలతో నిండిన అరుణాచల్‌ప్రదేశ్‌లో అతిశీతల వాతావరణ పరిస్థితులు ఎదురైనా ఏడాది పొడవునా రాకపోకలు సాగేలా రోడ్లు, సొరంగాలు, వంతెనలు నిర్మిస్తోంది. తద్వారా అదనపు బలగాలను శరవేగంగా అక్కడికి తరలించేందుకు వీలవుతుంది.

indian govt developing infrastructures in lac
నిర్మాణాలు చేపడుతున్న భారత్​ బలగాలు

"ఇక్కడి భూభాగం ఇలా చాలా క్లిష్టతరంగా ఉంటుంది. పర్వతాలు ఎక్కువగా ఉంటాయి. సముద్ర మట్టానికి చాలా ఎత్తులో ఇక్కడి భూభాగం ఉంటుంది. పర్వతాలు, వాతావరణ పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉంటాయి. ఇలాంటి కఠిన వాతావరణ పరిస్థితుల్లో రోడ్ల నిర్మాణం కోసం సరిహద్దు రహదారుల సంస్థ నిరంతరం పని చేస్తోంది. ఇక్కడి కొన్ని గ్రామాలు మారుమూల ప్రాంతాల్లో ఉంటాయి. అలాంటి మారుమూల ప్రాంతాలకు కూడా మేము రోడ్లు వేస్తున్నాం. తద్వారా పశ్చిమ అరుణాచల్‌లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి అయ్యేలా చూస్తాం".
--వర్తక్‌ ఛీఫ్‌ ఇంజినీర్‌, బీఆర్‌వో

చైనాతో సరిహద్దు కలిగిన ప్రాంతాల్లో భారీ ఎత్తున మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను భారత్‌ చేపట్టింది. అరుణాచల్‌లోని చైనాతో సరిహద్దు కలిగిన అన్ని గ్రామాలను రోడ్లతో అనుసంధానించాలని కోరుకుంటోంది. శీతాకాలంలో రోడ్లు మంచుతో క‌ప్పుకుపోయే చోట్ల సొరంగ మార్గాలను నిర్మిస్తోంది. కీలకమైన నచిఫు సొరంగ మార్గం త్వరలోనే అందుబాటులోకి రానుంది. సేలా పాస్‌ సొరంగం కూడా వచ్చే ఏడాది జులై కల్లా పూర్తికానుంది. సేలా టన్నెల్‌ ప్రాజెక్టులో భాగంగా రెండు జంట సొరంగ మార్గాలను నిర్మిస్తున్నారు.

indian govt developing infrastructures in lac
సరిహద్దు వద్ద నిర్మాణాలు చేపడుతున్న బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌

"నచిఫు సొరంగ మార్గం దాదాపు పూర్తికావచ్చింది. రహదారి పనులకు తుదిరూపునిస్తున్నాం. నచిపు సొరంగం మరో రెండు నెలల్లో ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. సేలా సొరంగం పొడవైనది. అందులో ఒక సొరంగం 1555 మీటర్ల పొడవు ఉంటుంది. మరో సొరంగం దాదాపు కిలోమీటరు పొడవు ఉంటుంది. శీతల వాతావరణం వల్ల అక్కడ కఠిన పరిస్థితులు ఉంటాయి. సొరంగ మార్గాల్లో 24 గంటలూ పని జరుగుతోంది. ఆరు గంటలకు ఒక షిఫ్ట్‌ చొప్పున నాలుగు షిఫ్టుల్లో పని జరుగుతోంది. మరో నాలుగు నుంచి ఆరు నెలల్లో ఈ సేలా సొరంగాన్ని కూడా మేము ప్రజారవాణా కోసం ప్రారంభిస్తాం".
--వర్తక్‌ ఛీఫ్‌ ఇంజినీర్‌, బీఆర్‌వో

భారత్‌తో సరిహద్దుల్లో చైనా వేగంగా మౌలిక సదుపాయాలను నిర్మిస్తోంది. ఏకంగా కొత్త కొత్త గ్రామాలను అక్కడ ఏర్పాటు చేస్తోంది. సైనిక అవసరాల కోసం వీటిని వినియోగించుకుంటోంది. ఈ నేపథ్యంలో డ్రాగన్‌కు ఏ మాత్రం తగ్గకుండా అరుణాచల్‌లో మౌలిక సదుపాయాలను వేగంగా కల్పిస్తోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.