ETV Bharat / bharat

'మూడంచెల చైనా 'ప్రణాళిక'తో భారత్‌కే నష్టం'

author img

By

Published : Nov 11, 2020, 10:02 PM IST

China 3-step plan
'చైనా 3-దశల ప్రణాళిక.. అంగీకరిస్తే భారత్‌కే నష్టం'

భారత్‌-చైనాల మధ్య సరిహద్దు వివాదాలు.. చర్చల దశలోనే అనేక మలుపులు తిరుగుతున్నాయి. ఈ దశలో తూర్పు లద్దాఖ్‌లో బలగాల ఉపసంహరణకు చైనా.. 3 కొత్త ప్రతిపాదనలతో ముందుకొచ్చింది. ఈ ప్రతిపాదనలు ఆమోదించినట్లైతే భారత్‌కు వ్యూహాత్మక ప్రతికూలతగా మారుతుందని.. చైనీయులకు కలిసొచ్చే అవకాశం ఉంటుందంటున్నారు విశ్లేషకులు.

సరిహద్దులో ఉద్రిక్తతలు తగ్గించే నెపంతో చైనా కొత్త కుయుక్తులు పన్నుతోంది. ఈ నేపథ్యంలోనే బలగాల ఉపసంహరణకు మూడంచెల ప్రణాళికలను ప్రతిపాదించింది. ఇరుదేశాల మధ్య చుషుల్‌ సెక్టార్‌లో నవంబర్‌ 6న జరిగిన.. ఎనిమిదవ రౌండ్‌ చర్చల్లో తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనలతో భారత్‌కే ఎక్కువ నష్టం జరగనుంది. అయితే, భారత్‌ వీటిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.

మొదటి దశ

మొదటి దశలో భాగంగా.. ఒక్క రోజులోనే కీలక స్థానాల్లో మోహరించిన బలగాలను, ట్యాంకులను వెనక్కి రప్పించాల్సి ఉంటుంది. వీటిలో సరిహద్దులో కీలకంగా ఉన్న గల్వాన్‌ లోయ, పాంగాంగ్‌ సరస్సు దక్షిణ ప్రాంతం, స్పాంగుర్‌ గ్యాప్‌ వంటి ప్రాంతాలున్నాయి. ఈ ప్రదేశాల్లో భారత్‌ బలగాలు టీ-72, టీ-90 ట్యాంకులు ఉన్నాయి. అలాగే, బీఎంపీ పదాతిదళాలు మోహరించాయి. చైనావైపు టైప్-15 ట్యాంకులు, డొంగ్‌ఫెంగ్‌ వాహనాలు సిద్ధంగా ఉంచారు.

చైనా ప్రతిపాదన ప్రకారం భారత్‌ బలగాలను గల్వాన్‌ లోయ నుంచి వెనక్కి పిలిపిస్తే.. అనేక ఇబ్బందులు తలెత్తే ప్రమాదముంది. ఎందుకంటే చైనా అక్కడ ఎటువంటి చర్యలకు పాల్పడ్డా భారత బలగాలను తిరిగి మోహరించటం ఇబ్బందిగా మారుతుంది. అదే చైనావైపు వాహనాల రాకపోకలకు మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నాయి. జూన్‌ 15 ఘర్షణల తర్వాత గల్వాన్‌ లోయలో ఇప్పటికీ పరిస్థితులు గంభీరంగానే ఉన్నాయి.

మరోవైపు పాంగాంగ్‌ సరస్సు దక్షణ ప్రాంతం, స్పాంగుర్‌ గ్యాప్‌లలో... చైనాపై భారత్‌ పైచేయి సాధించింది. కీలక పర్వతాలు స్వాధీనం చేసుకుని పట్టు సాధించింది. చైనా తిరిగి ఈ ప్రాంతంపై పట్టు సాధించాలని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. మరోవైపు భారీగా మోహరించిన యుద్ధ సామగ్రిని ఒక్క రోజులో వెనక్కి తీసుకురావటం అంత సులభం కాదు.

రెండవ దశ

ఇక ప్రతిపాదనలో భాగంగా రెండొవ దశలో.. పాంగాంగ్‌ సరస్సు ఉత్తర భాగంలో ఏకకాలంలో ఇరుదేశాలు రోజుకు 30శాతం చొప్పును 3రోజుల పాటు బలగాలను వెనక్కి రప్పించాలని ప్రతిపాదించింది చైనా. ఈ ప్రతిపాదన ప్రకారం భారత్ బలగాలు ఫింగర్‌ 3,4 పర్వతాల వద్దనున్న ధన్‌సింగ్‌ థాపా పోస్ట్‌ వద్దకు చేరుకుంటాయి. అదే సమయంలో చైనా బలగాలు ఫింగర్‌ 8 పర్వతం వెనక్కి వెళ్లాలి.

ఇది గస్తీపై ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే, ఫింగర్‌ 8వరకూ భారత సైన్యం కాలినడకతోనే గస్తీ కాస్తోంది. మరోవైపు చైనా ఫింగర్‌ 4వరకూ వాహనాల్లో పహారా కాస్తుంటుంది. పరస్పర అంగీకారంతో బలగాల ఉపసంహరణ చేపడితే.. ఫింగర్‌4 నుంచి 8 వరకూ బలగాలు ఉండకూడదు. అయితే, భారత వాదన ప్రకారం ఏప్రిల్‌-మేలలో ఈ ప్రాంతం భారత్‌ అధీనంలోనే ఉంది. భారత్‌ ఇందుకు అంగీకరిస్తే.. తాజాగా పట్టు సాధించిన ఫింగర్‌ 4 పర్వతాన్ని కోల్పోతుంది.

మూడవ దశ

ఇక మూడవ దశ ప్రతిపాదనలో భాగంగా.. పాంగాంగ్‌ సరస్సు దక్షిణ ప్రాంతంలో భారత్‌ వెనక్కి తగ్గాలని చైనా చెబుతోంది. ఈ ప్రాంతంలో భారత్‌కు చుషుల్‌, రేజాంగ్‌ లా ప్రదేశాలు కీలకంగా ఉన్నాయి.

అగస్టు 29-30ల మధ్య చాకచక్యంగా వ్యవహరించి భారత్‌ ఈ ప్రాంతాలపై పట్టు సాధించింది. స్పెషల్‌ ఫ్రాంటియర్‌ ఫోర్స్‌ విభాగం తెగించి.. చైనా పీఎల్‌ఏ ఆలోచనలకు కూడా అందని రీతిలో వీటిని స్వాధీనం చేసుకుంది. వ్యూహాత్మకంగా కీలకంగా ఉండే ఈ స్థానాలు తిరిగి అప్పజెప్పటం సరికాదు.

మొత్తంగా భారత్​-చైనా మధ్య గత 6నెలలుగా చర్చలు జరుగుతునే ఉన్నాయి. అయితే, ఉపసంహరణ చర్చలు ఫలప్రదం కావట్లేదు. భారత్‌-చైనా సరిహద్దు వివాదాలు అనేక చిక్కుముడుల మధ్య ఉండటం వల్ల పరిష్కారం అంత సులభంగా లభించట్లేదు. ఇప్పటికే చాలా దశల్లో, స్థాయిల్లో చర్చలు జరిగాయి. తాజా ప్రతిపాదనల ఆధారంగా కొన్ని ఒప్పందాలు కుదిరినట్లయితే ఇరుపక్షాలు కాస్త వెనక్కితగ్గే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే వీటి అమలు ఎంతవరకూ చేస్తారనేది ఎవరూ చెప్పలేని పరిస్థితి. తూర్పు లద్దాఖ్‌లో సైన్యాన్ని వెనక్కి రప్పించటం అంతసులభం కాకపోవచ్చు.

ప్రస్తుతానికి, ఇరుదేశాల మధ్య నమ్మకం లేకపోవటమే.. భారత్‌-చైనా సంబంధాలకు అతిపెద్ద అడ్డంకిగా ఉంది. ఏప్రిల్-మేల నుంచి ఈ అగాధం మరింత విస్తరిస్తూనే ఉంది.

-సంజీవ్‌ బారువా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.