ETV Bharat / bharat

'8 రోజుల్లోనే 6.3 రెట్లు పెరిగిన కరోనా కేసులు'

author img

By

Published : Jan 5, 2022, 4:56 PM IST

Updated : Jan 5, 2022, 5:40 PM IST

covid
కరోనా వైరస్​

Rise in Covid cases: దేశంలో గత 8 రోజుల్లో కరోనా కేసులు 6.3 రెట్లు పెరిగినట్లు ప్రభుత్వం తెలిపింది. డిసెంబర్‌ 29న 0.79 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు జనవరి 5 నాటికి 5.03 శాతానికి పెరిగినట్లు వివరించింది. 28 జిల్లాల్లో కొవిడ్‌ పాజిటివిటీ 10 శాతానికిపైగా, 43 జిల్లాల్లో 5 నుంచి 10 శాతం మధ్యలో ఉన్నట్లు పేర్కొంది.

Rise in Covid cases: దేశంలో కరోనా వ్యాప్తి​ వారంలోనే గణనీయంగా పెరిగిందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. గడిచిన 8 రోజుల్లోనే 6.3 రెట్లు వైరస్​ కేసులు పెరిగినట్లు పేర్కొంది. డిసెంబర్​ 29 నాటికి 0.79 శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు.. ప్రస్తుతం 5.03 శాతానికి పై ఎగబాకినట్లు వివరించింది.

ప్రధానంగా మహారాష్ట్ర, బంగాల్​, దిల్లీ, కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఝార్ఖండ్, గుజరాత్​లో కేసుల సంఖ్య భారీగా పెరిగినట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా 28 జిల్లాల్లో ఏడు రోజుల్లో పాజిటివిటీ రేటు 10 శాతానికి పైగా పెరిగినట్లు పేర్కొన్నారు.

జనవరి 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా సుమారు 25.2 లక్షల కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. కరోనా వైరస్​ ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అత్యధికమని గుర్తు చేసింది. ఈ కేసుల్లో దాదాపు 65 శాతం కేసులు అమెరికా, బ్రిటన్​, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్‌ దేశాల్లోనే నమోదు అయినట్లు స్పష్టం చేసింది. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 108 మంది ఒమిక్రాన్​తో చనిపోయినట్లు వెల్లడించింది కేంద్ర ఆరోగ్య శాఖ.

ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటూ, కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్రజలకు ప్రభుత్వం సూచించింది. భయాందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, కరోనా మహమ్మారి ప్రస్తుత దశను కూడా ఎదుర్కొందామని తెలిపింది.

ప్రికాషన్ డోసు అదే...

ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు, వృద్ధులకు ముందు జాగ్రత్త డోసు కింద.. గతంలో వారు ఏ టీకా తీసుకుంటే ఆ టీకానే ఇవ్వనున్నట్లు నీతి ఆయోగ్‌ ఆరోగ్య సభ్యుడు వీకే పాల్‌ వెల్లడించారు.

ఒమిక్రాన్‌ను గుర్తించే ఆర్​టీపీసీఆర్​ కిట్‌లను టాటా ఎండీ, ఐసీఎంఆర్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేసినట్లు ఐసీఎంఆర్ డెరెక్టర్​ బలరాం భార్గవ తెలిపారు. ఈ కిట్‌ ద్వారా కేవలం 4 గంటల్లోనే ఫలితం తెలుసుకోవచ్చని అన్నారు. దేశంలో కొత్త వేరియంట్​ వ్యాప్తిని అడ్డుకోవాలంటే దేశంలోని ప్రధాన నగరాల్లో భారీ బహిరంగ సభలను నిర్వహించకుండా ఉండాలని అభిప్రాయపడ్డారు.

omicron deaths in india

దేశంలో తొలి ఒమిక్రాన్​ మరణం..!

కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​కు సంబంధించి తొలి మరణం నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. రాజస్థాన్​లోని ఉదయ్​పుర్​లో మరణించిన వ్యక్తి నమూనాలలో ఒమిక్రాన్ వేరియంట్‌ ఉందని పేర్కొంది. ఆ 73 ఏళ్ల వ్యక్తికి జీనోమ్ సీక్వెన్సింగ్‌లో పరీక్షలు నిర్వహించగా ఒమిక్రాన్​ ఆనవాళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ముందుగా రెండుసార్లు పరీక్షలు నిర్వహించగా (డిసెంబర్​ 21, 25) నెగెటివ్ వచ్చినట్లు పేర్కొన్నారు. అతను డిసెంబర్​ 31న చనిపోయినట్లు వివరించారు. అయితే ఈ మరణాన్ని ఒమిక్రాన్​తో చనిపోయినట్లు పరిగణించాల్సి ఉంటుందని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్​ సెక్రెటరీ లవ్​ అగర్వాల్​ తెలిపారు.

చనిపోయిన వ్యక్తి పోస్ట్-కొవిడ్ నిమోనియాతో బాధపడుతున్నాడని ఉదయపుర్​ సీఎంహెచ్​ఓ డాక్టర్ దినేష్ ఖాద్రీ ఇటీవల స్పషం చేశారు. డయాబెటిస్ మెల్లిటస్, హైపర్‌టెన్షన్​ తో పాటు హైపో థైరాయిడిజంతో బాధపడుతున్నట్లు పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'కరోనా మృతుల కుటుంబాలకు పరిహారం రూ.4 లక్షలు!'

Last Updated :Jan 5, 2022, 5:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.