ETV Bharat / bharat

'సెకండ్‌ వేవ్‌' విలయం: నిమిషానికి 243 కేసులు

author img

By

Published : Apr 26, 2021, 6:41 AM IST

విస్తృత వేగంతో వ్యాపిస్తోన్న కరోనా వైరస్‌ పాజిటివిటీ రేటు దేశవ్యాప్తంగా 16 శాతం దాటింది. కొవిడ్ నిబంధనలను కఠినంగా పాటిస్తేనే వైరస్​ను అదుపులోకి తీసుకురావొచ్చని వైద్యరంగ నిపుణులు చెబుతున్నారు. పాజిటివిటీ రేటు అదుపులోకి తేవాల్సిందేనని అన్నారు. ఈక్రమంలో వైరస్​ పట్ల ఎలాంటి భయాలు, ఆందోళనలు వద్దని సూచిస్తున్నారు.

corona positivity rate
కరోనా వైరస్‌ పాజిటివిటీ రేటు

దేశంలో కరోనా వైరస్‌ మహమ్మారి సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి కొనసాగుతూనే ఉంది. నిత్యం రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా నిమిషానికి 243 పాజిటివ్‌ కేసులు నమోదవుతుండడం ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుత పరిస్థితులు ఆందోళనకరమైనవే అయినప్పటికీ భయపడాల్సిన అవసరం లేదని ఆరోగ్యరంగ నిపుణులు సూచిస్తున్నారు.

సెకండ్‌ వేవ్‌ ధాటికి కొన్ని రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లోనే దేశవ్యాప్తంగా 3లక్షల 49వేల పాజిటివ్‌ కేసులు బయటపడ్డాయి. వరుసగా నాలుగో రోజు 3లక్షలకు పైగా కేసులు నమోదు కావడం కలవరపెట్టే విషయం. ఇలా నిమిషానికి సరాసరి కొత్తగా 243 కేసులు రికార్డవుతున్నాయి. ఇక కొవిడ్‌ మరణాలు కూడా అదే స్థాయిలో నమోదవుతున్నాయి. నిమిషానికి దాదాపు ఇద్దరు కొవిడ్‌ రోగులు ప్రాణాలు కోల్పోతున్నారు.

3 రోజుల్లోనే 10లక్షల కేసులు

దేశవ్యాప్తంగా గడిచిన మూడు రోజుల్లోనే పది లక్షల కేసులు నమోదయ్యాయి. కొన్ని నెలల క్రితం పది లక్షల కేసులు నమోదుకావడానికి దాదాపు రెండు నెలల సమయం పట్టింది. ప్రస్తుతం రోజుకు 3లక్షలకుపైగా కేసులు బయటపడుతున్నాయి. దీంతో దేశంలో క్రియాశీల కేసుల సంఖ్య 26లక్షలకు చేరుకుంది.

corona positivity rate
అత్యధిక రోజువారీ కొత్త కేసులు

పాజిటివిటీ రేటు అదుపులోకి తేవాల్సిందే..

విస్తృత వేగంతో వ్యాపిస్తోన్న కరోనా వైరస్‌ పాజిటివిటీ రేటు రోజురోజుకు పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఇది 16శాతం దాటింది. మహారాష్ట్ర, దిల్లీ, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా పాజిటివిటీ రేటు 30శాతానికి చేరువయ్యింది. ఈ నేపథ్యంలో కొవిడ్‌ పాజిటివిటీని వీలైనంత త్వరగా అదుపులోకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని ఆరోగ్యరంగ నిపుణులు సూచిస్తున్నారు. ముంబయిలో 26శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు ప్రస్తుతం 14శాతానికి తగ్గినట్లు ఎయిమ్స్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ నవీత్‌ విగ్‌ పేర్కొన్నారు. కఠిన నిబంధనలు అమలు పరచడం వల్లే ఇది సాధ్యమైందని గుర్తుచేశారు. ఇలా జిల్లా స్థాయిలో కొవిడ్‌ పాజిటివిటీ రేటు 5శాతానికి తక్కువగా ఉండేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

రెమ్‌డెసివిర్‌ మంత్రదండం కాదు..

కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోన్న వేళ.. రెమ్‌డెసివిర్‌ ఔషధానికి తీవ్ర డిమాండ్‌ పెరిగింది. ఈ నేపథ్యంలో ఈ ఔషధం మ్యాజిక్‌ బుల్లెట్‌ కాదని.. కేవలం ఆసుపత్రుల్లో చేరి చికిత్స పొందుతున్న వారికే ఇది అవసరమవుతుందని ఎయిమ్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ రణ్‌దీప్‌ గులేరియా స్పష్టం చేశారు. అనవసర భయాలకు లోనుకావద్దని.. అదే సమయంలో ఆక్సిజన్‌, రెమ్‌డెసివిర్‌లను వృథా చేయకూడదని డాక్టర్‌ గులేరియా సూచించారు. కొవిడ్‌ నిబంధనలు కఠినంగా పాటించడం వల్ల వచ్చే మూడు వారాల్లోనే వైరస్‌ను అదుపులోకి తేవచ్చని ఆయన సూచించారు.

ఇదీ చూడండి: పాజిటివిటీ 10% దాటిన రాష్ట్రాల్లో మినీ లాక్‌డౌన్‌లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.