ETV Bharat / bharat

టీమ్​ఇండియా ఓటమి బాధ- గుండెపోటుతో ఆర్​టీసీ డ్రైవర్​, వృద్ధుడు మృతి- ఇద్దరు యువకులు ఆత్మహత్య

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 21, 2023, 7:59 AM IST

India Defeat Fans Death : ఆదివారం జరిగిన ప్రపంచకప్​ ఫైనల్​ మ్యాచ్​లో భారత్​ ఓడిపోవడాన్ని తట్టుకోలేకపోయాడు ఓ ఆర్​టీసీ డ్రైవర్​. టీమ్​ఇండియా ఓటమిని చూసి అతడు గుండెపోటుతో మరణించాడు. హిమాచల్​ ప్రదేశ్​లో జరిగిందీ ఘటన. మరోవైపు లఖ్​నవూలోనూ ఓ వృద్ధుడు ఓటమిని జీర్ణించుకోలేక ప్రాణాలు కోల్పోయాడు. బంగాల్, ఒడిశాలో ఇద్దరు యువకులు బాధతో ఆత్మహత్య చేసుకున్నారు.

Indias Defeat Fan Dies Of Heart Attack
India Defeat Fans Death

India Defeat Fans Death : సొంతగడ్డపై​ జరిగిన వన్డే ప్రపంచకప్​ ఫైనల్​లో భారత్​ ఓడిపోవడాన్ని తట్టుకోలేక ఇద్దరు అభిమానులు గుండెపోటుతో మరణించారు. మరో ఇద్దరు యువకులు ఆత్మహత్య చేసుకున్నారు. హిమాచల్​ప్రదేశ్ సిర్మౌర్ జిల్లాకు చెందిన ఓ ఆర్​టీసీ డ్రైవర్.. ఆదివారం(నవంబర్​ 19న) జరిగిన ఫైనల్​ మ్యాచ్​ను చూస్తూ.. గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయాడు.

ఇదీ జరిగింది..
సిర్మౌర్ జిల్లాకు చెందిన 30 ఏళ్ల సూరజ్ కుమార్​ నాలుగేళ్ల క్రితమే హిమాచల్​ ప్రదేశ్​ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో బస్సు డ్రైవర్​గా ఉద్యోగం సంపాదించాడు. ఎప్పటిలాగే ఆదివారం కూడా విధులు ముగించుకొని రాత్రి ఇంటికి చేరుకున్నాడు. అనంతరం తన మొబైల్​లో లైవ్​ మ్యాచ్​ను పెట్టుకొని చూడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఇంటి యజమాని కూతుర్ని టీ పెట్టుకొని తీసుకురావాల్సిందిగా కోరాడు. దీంతో ఆమె సూరజ్​ ఉన్న గదిలోకి ఛాయ్​ తీసుకొని వచ్చింది. అప్పటివరకు ఫోన్​లో మ్యాచ్​ చూస్తున్న సూరజ్​ ఒక్కసారిగా మంచంపై చలనం లేకుండా అపస్మారక స్థితిలో పడిపోయి ఉండడాన్ని చూసిన సదరు యువతి అతడిని లేపే ప్రయత్నం చేసింది. ఎంతకీ అతడు స్పందించకపోవడం వల్ల ఆమె తన కుటుంబ సభ్యుల సాయంతో సూరజ్​ను దగ్గర్లోని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే సూరజ్​ చనిపోయినట్లుగా వైద్యులు వెల్లడించారు.

అయితే ప్రాథమికంగా సూరజ్​ గుండెపోటుతోనే మరణించాడని చెబుతున్నా పోస్ట్​ మార్టం పరీక్ష నివేదిక వచ్చాకే మరణానికి అసలు కారణం తెలుస్తుందని వైద్యులు, పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సోమవారం యమునా నది ఒడ్డున సూరజ్ అంత్యక్రియలు జరిగాయి. మృతుడు సూరజ్​ తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు. నాలుగేళ్ల క్రితమే వివాహమైన అతడికి రెండున్నరేళ్ల కుమారుడు, ఆరు నెలల కుమార్తె ఉన్నారు.

మ్యాచ్​ చూస్తూ వృద్ధుడు..
Indias Defeat Fan Dies Of Heart Attack : మరోవైపు, ఉత్తర్​ప్రదేశ్​లోని లఖ్​నవూకు చెందిన శ్రీరామ్ గుప్తా అనే వృద్ధుడు కూడా ఓటమి దిశగా సాగుతున్న భారత్​ను చూసి గుండెపోటుకు గురై మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రహీమాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాహ్తా గ్రామంలో ఈ ఘటన జరిగింది. కుటుంబ సభ్యులు వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. తొలుత ఓ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అక్కడి వైద్యులు మరో హాస్పిటల్​కు రిఫర్ చేశారు. ఆ ఆస్పత్రికి తీసుకెళ్తుండగా.. మార్గమధ్యలోనే వృద్ధుడు ప్రాణాలు కోల్పోయాడు. అప్పటివరకు తన తండ్రి బాగానే ఉన్నాడని, టీమ్ఇండియా ఓటమిదిశగా సాగుతున్న సమయంలోనే షాక్​ గురయ్యాడని మృతుడి కుమారుడు, బీజేపీ కిసాన్ మోర్చా మండల్ ప్రెసిడెంట్ సరోజ్ గుప్తా తెలిపారు.

ఓటమి భరించలేక ఆత్మహత్య..
ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌ ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేక ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. బంగాల్​ బంకురా​కు చెందిన 23 ఏళ్ల రాహుల్​ అనే యువకుడు ​ఆదివారం రాత్రి 11 గంటల ప్రాంతంలో గదిలో ఉరివేసుకొని బలన్మరణానికి పాల్పడ్డాడు. మరోవైపు, ఒడిశాలోని జాజ్‌పుర్‌కు చెందిన 23 ఏళ్ల దేవ్​ రంజన్​ దాస్​ కూడా టీమ్​ఇండియా ఓటమిని తట్టుకోలేక ఇంటి టెర్రస్​పైకి వెళ్లి ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మృతదేహాన్ని శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

సొరంగంలోకి DRDO రోబోలు- వెంటిలేషన్​ సహా కూలీలకు ఆహారం అందజేత!

సోదరుడి కోసం పెట్రోల్​ బంకులో యువతి ఎదురుచూపులు- అందరూ చూస్తుండగానే పట్టపగలే కిడ్నాప్​!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.