ETV Bharat / bharat

ఆన్‌లైన్‌లో డబ్బు పోగొట్టి.. అమ్మ తిట్టిందని ఆత్మహత్య!

author img

By

Published : Jul 31, 2021, 11:27 PM IST

ఆన్​లైన్​లో గేమ్స్​ ఆడి రూ.40 వేలు పోగోట్టాడు ఓ 13 ఏళ్ల బాలుడు. దీనిపై తల్లి మందలించగా మనస్తాపం చెందిన అతడు ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు.

online gaming addiction
ఆన్‌లైన్‌ గేమ్‌

మొబైల్‌ గేమ్‌ సరదా ఓ బాలుడి ప్రాణాలు తీసింది. తల్లిదండ్రులకు తెలియకుండా ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడి రూ.40 వేలు పోగొట్టడం వల్ల అమ్మ తిట్టిందని 13 ఏళ్ల బాలుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది.

ఇదీ జరిగింది..

ఛత్తర్‌పుర్‌కు చెందిన ఓ బాలుడు తన తల్లిదండ్రులకు తెలియకుండా వారి బ్యాంకు ఖాతాలోని సొమ్ముతో ఆన్‌లైన్‌లో గేమ్స్‌ ఆడుతుండేవాడు. అలా ఓ రోజు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.1500 ఖర్చయినట్లు అతడి తల్లి మొబైల్‌కు సందేశం వచ్చింది. దీంతో ఆమె తన కుమారుడికి ఫోన్‌ చేసి ఆ ఖర్చుపై ప్రశ్నించింది. ఆ డబ్బును ఆన్‌లైన్‌లో గేమ్‌ ఆడేందుకు తానే వినియోగించినట్లు బాలుడు చెప్పగా, ఆమె కుమారుడిని మందలించింది. దాంతో మనస్తాపానికి గురైన ఆ బాలుడు తన గదిలోకి వెళ్లి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

బాలుడి ఆత్మహత్యపై సమాచారం అందుకుని దర్యాప్తు చేసిన పోలీసులుకు అతడి గదిలో సూసైడ్‌ నోట్‌ లభించింది. అందులో వారికి మరిన్ని వాస్తవాలు తెలిశాయి. తన తల్లి బ్యాంకు ఖాతా నుంచి అంతకుముందు రూ.40 వేలు నగదు తీసి ఆన్‌లైన్‌లో మొబైల్‌ గేమ్‌ ఆడేందుకు వినియోగించినట్టు బాలుడు ఆ లేఖలో రాశాడు.

కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం చేసిన అనంతరం బాలుడి మృత దేహాన్ని అతడి తల్లిదండ్రులకు అప్పగించారు. అయితే ఆ గేమ్‌లో బాలుడు తనకు తానుగా డబ్బు పెట్టాడా.. లేదా సొమ్ము కోసం ఎవరైనా అతడిని బెదిరించారా.. అనే కోణంలో పోలీసులు దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

ఇదీ చూడండి: ఎంతసేపు మొబైల్‌ వాడారో చెప్పేస్తుందట!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.