ETV Bharat / bharat

జూన్‌లో కరోనా నాలుగో దశ- నిపుణులు ఏమన్నారంటే..?

author img

By

Published : Mar 6, 2022, 4:01 AM IST

Corona Fourth Wave: కరోనా నాలుగో దశపై ఐఐటీ కాన్పూర్‌కి చెందిన పరిశోధకుల అంచనాలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. నాలుగో వేవ్​ జూన్​ ప్రారంభమై అక్టోబర్‌లో ముగుస్తుందని ప్రకటించారు. గతంలో ఈ పరిశోధక బృందం అంచనాలు దాదాపు నిజం కావడం వల్ల మరో వేవ్​ వస్తుందన్న భయాలు నెలకొన్నాయి. అయితే వీటిని కొందరు నిపుణులు తోసిపుచ్చారు.

Corona fourth wave
Corona fourth wave

Corona Fourth Wave: దేశంలో కరోనా కేసులు దాదాపు పూర్తిగా తగ్గుముఖం పట్టాయి. కేసుల సంఖ్య లక్షల స్థాయి నుంచి 10 వేలకు దిగువకు చేరింది. దీంతో మూడో వేవ్‌ ప్రభావం పూర్తిగా తగ్గిపోయిందని అనుకుంటున్న వేళ.. ఐఐటీ కాన్పూర్‌కి చెందిన పరిశోధకులు నాలుగో వేవ్‌ అంచనాలను వెల్లడించారు. జూన్‌లో నాలుగో వేవ్‌ ప్రారంభమై అక్టోబర్‌లో ముగుస్తుందంటూ కొన్ని తేదీలనూ ప్రకటించారు. గతంలో ఈ పరిశోధక బృందం అంచనాలు దాదాపు నిజం కావడంతో జూన్‌లో మరో వేవ్‌ విరుచుకుపడుతుందన్న భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొందరు నిపుణులు.. ఐఐటీ-కాన్పూర్ అంచనాలను తోసిపుచ్చారు. ఇలాంటి దీర్ఘకాలిక అంచనాలు నిజమయ్యే అవకాశాలు తక్కువేనని పేర్కొన్నారు. దేశంలో ఇప్పటికే చాలా మంది పౌరులకు రెండు డోసుల వ్యాక్సిన్లు పూర్తవ్వడం, కొవిడ్‌ సోకడం ద్వారా సంక్రమించిన రోగ నిరోధక శక్తి వల్ల.. రాబోయే మూడు నెలల్లో మరో వేవ్‌ సంభవించడం కష్టమేనని వారు అభిప్రాయపడ్డారు. ఏదైనా కొత్త వేరియంట్‌ పుట్టుకొస్తే తప్ప మరో వేవ్‌ సంభవించడానికి అవకాశం లేదంటూ ఐఐటీ పరిశోధనను తోసిపుచ్చారు.

దేశంలో యాక్టివ్‌ కేసులు సంఖ్య వేగంగా తగ్గుతోందని చెన్నై ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేథమెటికల్‌ సైన్సెస్‌ ప్రొఫెసర్‌ సితబ్రా సిన్హా అన్నారు. ఇప్పటి ట్రెండ్‌ను బట్టి భవిష్యత్‌లో కొత్త వేవ్‌ గురించి కచ్చితంగా ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం ‘ఆర్‌’ వాల్యూ 2020 మార్చి తర్వాత కనిష్ఠ స్థాయికి చేరిందని చెప్పారు. దేశంలో కొవిడ్‌ ప్రారంభం నుంచి కేసుల సంఖ్యను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న మరో నిపుణులు గౌతమ్‌ మేనన్‌ ఐఐటీ కాన్పూర్‌ అంచనాలను తప్పుబట్టారు. ఈ పరిశోధన వాస్తవానికి దగ్గరలేదని పేర్కొన్నారు. హరియాణాలోని అశోక యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న మేనన్‌.. కచ్చితమైన తేదీలతో కూడిన ఇలాంటి పరిశోధనలను తాను విశ్వసించబోనని పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఏ వేరియంట్‌ వస్తుందో ఇప్పుడే చెప్పలేమనన్నారు.

కొవిడ్‌ వేవ్‌ల విషయంలో 2-4 వారాల ముందుగా వేసే అంచనాలు నిజమవుతాయోమోగానీ, కొన్ని నెలల ముందే వేసిన ఇలాంటి అంచనాలు ఏమాత్రం నిజమయ్యే అవకాశం లేదని ప్రజారోగ్య నిపుణులు బర్మార్‌ ముఖర్జీ పేర్కొన్నారు. ఐఐటీ కాన్పూర్‌ డేటా సైన్స్‌ అనిపించుకోదని, డేటా ఆస్ట్రాలజీ అనిపించుకుంటుందని తప్పుబట్టారు. దీపావళి సమయంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ వస్తుందని ఎవరైనా ఊహించారా? అని ప్రశ్నించారు. కాన్పూర్‌ పరిశోధనను ఊహాజనిత నివేదికగా పేర్కొన్నారు. కాన్పూర్‌ అంచనాలకు స్పష్టమైన ఆధారాలు లేవని ప్రముఖ ఎపిడమాలజిస్ట్‌ రామనన్‌ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. భవిష్యత్‌లో చిన్నపాటి వేవ్‌లు ఉండే అవకాశం మాత్రం కొట్టిపారేయలేదు. అదే సమయంలో దేశంలో వ్యాక్సినేషన్‌, హైబ్రిడ్‌ ఇమ్యూనిటీ వల్ల ఒమిక్రాన్‌ వేరియంట్‌ పెద్దగా ప్రభావం చూపలేదన్న విషయాన్నీ గుర్తుచేశారు.

అయితే, ఐఐటీ కాన్పూర్‌ పరిశోధకులు మాత్రం తమ అంచనాలను సమర్థించుకున్నారు. కొన్ని గణాంక పద్ధతులు, శాస్త్రీయ నమూనాల ఆధారంగా తాము అంచనాలు వెలువరించినట్లు తెలిపారు. అంచనాలను పలు అంశాలు ప్రభావితం చేయొచ్చన్నారు. అయితే, తాము చెప్పినట్లుగా తర్వాతి వేవ్‌ జూన్‌ 22న ప్రారంభమవ్వడానికి కొన్ని రోజులు అటూ, ఇటూ ఉండొచ్చని పేర్కొన్నారు. అంతకుముందు ఈ బృందం.. భారత్‌లో నాలుగో దశ జూన్‌ 22న మొదలై.. ఆగస్టు 23 పీక్‌ స్టేజ్‌కి చేరుకొని.. అక్టోబర్‌ 24న ముగియనుందని పేర్కొంది.

ఇదీ చూడండి: స్వదేశానికి మరో 15విమానాలు- కొత్త అడ్వైజరీతో విద్యార్థుల్లో అయోమయం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.