ETV Bharat / bharat

హిమాచల్ ప్రదేశ్​ ఎన్నికల తేదీ ప్రకటన.. గుజరాత్​ విషయంలో ఈసీ ట్విస్ట్

author img

By

Published : Oct 14, 2022, 3:39 PM IST

Updated : Oct 14, 2022, 6:15 PM IST

himachal pradesh election schedule announced
himachal pradesh election schedule announced

దేశంలో ఎన్నికల నగారా మోగింది. హిమాచల్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను ప్రకటించింది ఎన్నికల సంఘం. పోలింగ్​, కౌంటింగ్​ తదితర తేదీలను వెల్లడించింది. అయితే.. గుజరాత్​ శాసనసభ ఎన్నికల విషయంలో మాత్రం ఈసీ ఎలాంటి ప్రకటన చేయలేదు.

Himachal Pradesh Elections Date : హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ఆ రాష్ట్ర శాసనసభ ఎన్నికల షెడ్యూల్​ను కేంద్ర ఎన్నికల సంఘం శుక్రవారం మధ్యాహ్నం ప్రకటించింది. ఒకే దశలో హిమాచల్ ప్రదేశ్​ ఎన్నికలు జరగనున్నాయి. నవంబర్​ 12న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 8న ఫలితం వెలువడనుంది.

  • ఎన్నికల నోటిఫికేషన్​ విడుదల తేదీ: అక్టోబర్ 17
  • నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ: అక్టోబర్ 25
  • నామినేషన్ల పరిశీలన: అక్టోబర్ 27
  • నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ: అక్టోబర్​ 29
  • పోలింగ్ తేదీ: నవంబర్ 12
  • ఓట్ల లెక్కింపు తేదీ: డిసెంబర్ 8

హిమాచల్‌ప్రదేశ్‌లోనూ భాజపా అధికారంలో ఉంది. ఆ రాష్ట్ర అసెంబ్లీ గడువు వచ్చే ఏడాది జనవరితో పూర్తి కానుంది. హిమాచల్​లో 68 అసెంబ్లీ స్థానాలున్నాయి. 55 లక్షల మందికిపైగా ఓటర్లు ఉన్నారు. 2017లో జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 43 స్థానాల్లో విజయం సాధించగా.. కాంగ్రెస్‌ పార్టీ 22 స్థానాలు దక్కించుకుంది. అయితే ఆమ్​ఆద్మీ పార్టీ.. హిమాచల్​ ప్రదేశ్​లోనూ బరిలోకి దిగనుంది.

గుజరాత్​ సంగతేంటో?
గుజరాత్ శాసనసభ ఎన్నికల తేదీల్నీ శుక్రవారమే ఈసీ ప్రకటిస్తుందని తొలుత అంతా భావించారు. అయితే.. హిమాచల్ ప్రదేశ్​కే పరిమితమైంది ఎన్నికల సంఘం. గుజరాత్ అసెంబ్లీ గడువు 2023 ఫిబ్రవరి 18 వరకు ఉంది.

గుజరాత్​ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన ఆలస్యంపై వివరణ ఇచ్చారు ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. "హిమాచల్ ప్రదేశ్, గుజరాత్​ శాసనసభల గడువు ముగియడానికి 40 రోజులు తేడా ఉంది. హిమాచల్ ప్రదేశ్​లో వాతావరణం కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పర్వత ప్రాంతాల్లో హిమపాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే గత సంప్రదాయాల్నే ఈసీ ఈసారి కూడా కొనసాగించింది" అని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి: హిందూ మఠానికి 1600 కిలోల పంట దానం.. ముస్లిం దాతృత్వం

అసోం సీఎంకు 'జెడ్ ప్లస్'​ సెక్యూరిటీ.. కారణం అదేనా?

Last Updated :Oct 14, 2022, 6:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.