ETV Bharat / bharat

సీఎం సభలో ఉద్రిక్తత- కాంగ్రెస్ పనే అన్న ఖట్టర్

author img

By

Published : Jan 10, 2021, 8:44 PM IST

సాగు చట్టాల వల్ల కలిగే లాభాలను వివరించేందుకు హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ తలపెట్టిన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. సీఎం హాజరు కావాల్సిన సభా ప్రాంగణాన్ని రైతులు ధ్వంసం చేశారు. దీంతో ముఖ్యమంత్రి తన సభను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడిన ఖట్టర్.. నిరసనల వెనక కాంగ్రెస్, వామపక్షాల హస్తం ఉందని ఈ ఘటనతో స్పష్టమైందని అన్నారు.

Haryana CM's Kisan Mahapanchayat called off after farmers vandalise venue
సీఎం సభలో ఉద్రిక్తత- కాంగ్రెస్ పనే అన్న ఖట్టర్

వ్యవసాయ చట్టాల వల్ల లాభాలను వివరించేందుకు తలెపెట్టిన కార్యక్రమంలో ఉద్రిక్తతలపై హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ స్పందించారు. రైతులతో తమ ప్రభుత్వం ఒకరోజు ముందుగానే చర్చించిందని, శాంతియుత ప్రదర్శన చేపట్టేందుకు మాత్రమే అనుమతించిందని పేర్కొన్నారు. కానీ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారని, కొంత మంది యువకులు తమ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారని అన్నారు.

ఏం జరిగిందంటే?

కర్నాల్​ జిల్లా కైమ్లా గ్రామంలో ఖట్టర్ పాల్గొనాల్సిన కిసాన్ మహాపంచాయత్​ కార్యక్రమానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. సభకు వ్యతిరేకంగా నల్లజెండాలతో నినాదాలు చేస్తూ ఆందోళన చేశారు. సభవైపు వెళ్తున్న రైతులపై పోలీసులు బాష్పవాయువును, నీటి ఫిరంగులను ప్రయోగించారు. అయినా వెనక్కి తగ్గని రైతులు భద్రతా దళాలను ఛేదించుకొని వెళ్లి.. స్టేజీని ధ్వంసం చేశారు. కుర్చీలు, టేబుళ్లను విరగ్గొట్టారు. అనంతరం సీఎం హెలికాప్టర్ దిగాల్సిన ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. హెలీప్యాడ్ ఏర్పాటు చేసిన స్థలంలో బైఠాయించారు. దీంతో ముఖ్యమంత్రి తన సభను రద్దు చేసుకోవాల్సి వచ్చింది.

Haryana CM's Kisan Mahapanchayat called off after farmers vandalise venue
సభాస్థలికి చేరుకుంటున్న రైతులు
Haryana CM's Kisan Mahapanchayat called off after farmers vandalise venue
హెలీప్యాడ్ వద్ద నిరసనకారులు

కాంగ్రెస్ హస్తం: ఖట్టర్

ఈ నేపథ్యంలో సాయంత్రం మీడియా సమావేశం నిర్వహించిన సీఎం ఖట్టర్.. ఈ పరిణామాలపై మాట్లాడారు. రైతులు, రైతు నేతలుగా చెప్పుకునే వారి అభిప్రాయాలను తాము ఎన్నడూ అడ్డు చెప్పలేదని ఖట్టర్ పేర్కొన్నారు. కరోనా సమయంలోనూ వారి నిరసనలు కొనసాగేలా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. ఈ ఉద్రిక్తతల వల్ల ప్రజలకు స్పష్టమైన సందేశం చేరిందని అన్నారు. నిరసనల వెనక కాంగ్రెస్, వామపక్షాల హస్తం ఉందని ఆరోపించారు.

"మాట్లాడాలనుకునే వారిని అడ్డుకోవడం సరైనది కాదు. మన దేశంలో బలమైన ప్రజాస్వామ్యం ఉంది. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు ఉంది. ఇలాంటి ఘటనలు రైతుల గౌరవానికి భంగం కలిగిస్తాయి. రైతులది అలాంటి స్వభావం కాదు. నిరసనకారుల స్వభావం బయటపడింది. ఆందోళనకారులను గుర్నామ్ సింగ్ చదునీ(భారతీయ కిసాన్ యూనియన్ చీఫ్) ప్రేరేపించినట్లు వీడియోలు ప్రచారమవుతున్నాయి. ఈ నిరసనల వెనక కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలదే ప్రధాన పాత్ర అని నా అభిప్రాయం."

-మనోహర్​లాల్ ఖట్టర్, హరియాణా ముఖ్యమంత్రి

కాగా, ఖట్టర్ పర్యటనపై పలువురు నిరసనకారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రైతుల గాయాలపై కారం చల్లేందుకే సీఎం.. ఈ కార్యక్రమం నిర్వహించాలనుకున్నారని ఆరోపించారు.

మరోవైపు, విపక్షాలు సైతం ఖట్టర్ లక్ష్యంగా విమర్శలు కురిపించాయి. రైతులతో ఘర్షణకు దిగడం మానుకోవాలని విపక్ష నేత భూపిందర్ సింగ్ హూడా హితవు పలికారు. ఖట్టర్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోయిందని అన్నారు. ఖట్టర్​పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ యోచిస్తోందని చెప్పారు.

Haryana CM's Kisan Mahapanchayat called off after farmers vandalise venue
రైతులపై జల బాష్పవాయు గోళాల ప్రయోగం

రైతులపై జల ఫిరంగులు ప్రయోగించడాన్ని కాంగ్రెస్‌ ప్రతినిధి రణ్‌దీప్‌ సుర్జేవాలా తప్పుబట్టారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఇదీ చదవండి: బర్డ్ ఫ్లూ కలకలం- 'జూ'లకు కేంద్రం ఆదేశాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.