ETV Bharat / bharat

పెన్ను పడితే పేపర్​పై ముత్యాలే.. ఆ ప్రభుత్వ విద్యార్థుల చేతి రాత అదుర్స్!

author img

By

Published : Mar 25, 2023, 7:46 PM IST

ఆ విద్యార్థులు రాసిన అక్షరాలు చూస్తే.. మన కళ్లే మనల్ని మోసం చేస్తున్నాయా అని అనిపిస్తుంది. అది నిజమైన చేతి రాతేనా? లేక కంప్యూటర్ ప్రింటా? అనే అనుమానం కలుగుతుంది. అంత అద్భుతంగా ముత్యాల్లాంటి అక్షరాలు రాస్తున్నారు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు. స్పెషల్ క్లాసులు వింటూ, నిరంతరం ప్రాక్టీస్ చేస్తూ.. క్యాలిగ్రఫీలో మెరుగవుతున్నారు. మరి ఆ స్కూల్ విద్యార్థుల గురించి తెలుసుకుందామా?

Beautiful Handwriting
Beautiful Handwriting

పెన్ను పడితే పేపర్​పై ముత్యాలే.. ఆ ప్రభుత్వ విద్యార్థుల చేతి రాత అదుర్స్!

విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ ముత్యాల్లా ఉంటే ఎంతో చూడముచ్చటగా ఉంటుంది. కానీ.. కంప్యూటర్లు, టచ్ స్క్రీన్​లకు అలవాటైన ప్రస్తుత తరం చిన్నారులు.. అందమైన అక్షరాలు రాసేందుకు ఇబ్బంది పడుతున్నారు. ఉత్తరాఖండ్​ బాగేశ్వర్​ జిల్లా, కరౌలీ గ్రామంలోని పాఠశాల విద్యార్థులు మాత్రం ఇందుకు భిన్నం. వారు పెన్ను పట్టారంటే.. పేపర్​పై ముత్యాలు రాలాల్సిందే. అంత అద్భుతంగా అక్షరాలు రాస్తున్నారు.

కరౌలీ జూనియర్ హైస్కూల్​లో విద్యార్థుల కోసం ప్రత్యేక క్యాలిగ్రఫీ కోర్సు నిర్వహిస్తున్నారు. టీచర్ల ప్రోత్సాహంతో విద్యార్థులు.. చేతి రాతలో నైపుణ్యం సంపాదిస్తున్నారు. రోజువారీ తరగతులకు హాజరవుతునే.. క్యాలిగ్రఫీ కోసం స్పెషల్ క్లాసులు వింటున్నారు. ప్రతి నిత్యం ప్రాక్టీస్ చేస్తూ చేతి రాతను మెరుగుపర్చుకుంటున్నారు. క్యాలిగ్రఫీలో కొత్త కొత్త మెళకువలు సైతం నేర్చుకుంటున్నారు. హిందీతో పాటు ఇంగ్లిష్ అక్షరాలు సైతం చక్కగా రాసేస్తున్నారు. ఇది చేతిరాతా..? లేదంటే కంప్యూటర్ ద్వారా ప్రింట్ చేశారా? అని అనుమానం వచ్చేంత అద్భుతంగా అక్షరాలు రాస్తున్నారు అక్కడి విద్యార్థులు. ఈ పాఠశాలలో పనిచేసే నరేంద్ర గోస్వామి అనే ఉపాధ్యాయుడికి.. క్యాలిగ్రఫీ శిక్షణలో సుదీర్ఘ అనుభవం ఉంది. ఆయనే.. విద్యార్థులకు క్యాలిగ్రఫీలో ట్రైనింగ్ ఇచ్చారు. తొలుత విద్యార్థులకు ఇలా అందంగా రాయడం కష్టమైనప్పటికీ.. రెగ్యులర్​గా ప్రాక్టీస్ చేసి నైపుణ్యం సంపాదించారని ఆయన చెబుతున్నారు.

Beautiful Handwriting
చిన్నారుల చేతిరాత

"అందమైన చేతి రాత అనేది ప్రాచీణ కళ. ప్రస్తుత కంప్యూటర్ యుగంలో ఈ కళకు ప్రాభవం తగ్గుతూ వస్తోంది. ఈ కళను సంరక్షిస్తూ భవిష్యత్ తరాలకు అందించే ఉద్దేశంతో.. విద్యార్థులతో కలిసి ఈ కార్యక్రమం ప్రారంభించాం. ప్రస్తుతం విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ చూసి అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక్కడి విద్యార్థినీ, విద్యార్థులు అందమైన చేతి రాత విషయంలో చాలా మెరుగ్గా ఉన్నారు."

-నరేంద్ర గోస్వామి, కరౌలి జూనియర్ హైస్కూల్ ఉపాధ్యాయుడు

గోస్వామి చేసిన కృషితో.. పాఠశాలలోని దాదాపు అన్ని తరగతుల విద్యార్థుల చేతి రాత అందంగా మారింది. ఇందుకు విద్యార్థులు సైతం చాలా కష్టపడ్డారని గోస్వామి చెబుతున్నారు. క్యాలిగ్రఫీ పోటీల్లో బహుమతులు సైతం తీసుకొస్తున్నారని వెల్లడించారు.

Beautiful Handwriting
చిన్నారుల చేతిరాత

క్యాలిగ్రఫీపై మరింత అవగాహన పెంచాలన్న ఉద్దేశంతో ఇక్కడి విద్యార్థులంతా వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ సహా మంత్రులు, ఉన్నతాధికారులకు తమ చేతిరాతతో సందేశాలు పంపుతున్నారు. చేతి రాత అందంగా మార్చుకునేలా ఇతర విద్యార్థులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్న ఉద్దేశంతో.. లేఖలు పంపిస్తున్నారు. పుస్తకాలపైనా సందేశాలు రాసి.. ఇతర పాఠశాలలకు అందిస్తున్నారు.

"గతేడాది ఈ అంశం నా దృష్టికి వచ్చినప్పుడే మేం ఓ నిర్ణయం తీసుకున్నాం. ఏ సందేశం పంపించినా.. అది విద్యార్థుల పేరు మీదుగానే వెళ్తుంది. మేం పంపించే పుస్తకాల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ సందేశం వెళ్తుంది. వాటిని చూసిన ఇతర విద్యార్థులు ప్రేరణ పొందుతారు. సందేశం రాసే విద్యార్థుల పేర్లను పుస్తకాలపై ముద్రిస్తున్నాం. తద్వారా అందంగా రాస్తున్న విద్యార్థులను ప్రోత్సహించినట్లు అవుతుంది."

-బంశీధర్ తివారీ, ఉత్తరాఖండ్ విద్యా శాఖ డైరెక్టర్

కరౌలీలోని పాఠశాల విద్యార్థుల ముత్యాల రాత.. బాగేశ్వర్ జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మన్ననలు పొందుతోంది. కరౌలీ హైస్కూల్.. ఇతర ప్రభుత్వ పాఠశాలలకే కాకుండా.. ప్రైవేట్ స్కూళ్లకు సైతం స్ఫూర్తిగా నిలుస్తోంది.

Beautiful Handwriting
చిన్నారుల చేతిరాత
Beautiful Handwriting
చిన్నారుల చేతిరాత

ఇవీ చదవండి : 80 శాతం వైకల్యం.. అంతర్జాతీయ మెడల్స్ దాసోహం.. 'పవర్'ఫుల్ బాడీ బిల్డర్ కథ ఇది!

15 కిలోల వెండితో ప్రధాని మోదీకి ప్రత్యేక కానుక.. అయోధ్య గుడి, శ్రీరామ ప్రతిమలతో..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.