ETV Bharat / bharat

'మీ తప్పులు అంగీకరించకుండా.. నెహ్రూను బాధ్యుల్ని చేస్తారా?'

author img

By

Published : Feb 17, 2022, 2:17 PM IST

Manmohan Singh criticizes Modi: పంజాబ్ ఎన్నికల నేపథ్యంలో దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. భాజపా లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. భాజపా తన తప్పులను అంగీకరించకుండా ప్రజా సమస్యలకు నెహ్రూనే బాధ్యులను చేస్తోందని ధ్వజమెత్తారు. అన్ని విషయాల్లో మోదీ ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.

Manmohan Singh criticizes Modi
Manmohan Singh criticizes Modi

Manmohan Singh criticizes Modi: పంజాబ్ ఎన్నికలకు మూడు రోజులే ఉన్న వేళ దేశ మాజీ, ఏకైక సిక్కు ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్.. ఆ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. భాజపాను, కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకొని విమర్శలకు దిగారు. ఏడేళ్లకు పైగా అధికారంలో ఉన్న భాజపా... తన తప్పులను అంగీకరించకుండా ప్రజా సమస్యలకు ఇప్పటికీ నెహ్రూను బాధ్యులను చేస్తోందని మండిపడ్డారు. భాజపా జాతీయవాదం బ్రిటిష్ విభజనవాదంపై ఏర్పాటైందని విమర్శించారు. విదేశాంగ విధానం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, రైతుల నిరసనలు వంటి అంశాలను ప్రస్తావిస్తూ భాజపా వైఫల్యాలను మన్మోహన్ ఎండగట్టారు. పంజాబీలో ఆయన మాట్లాడిన వీడియోను కాంగ్రెస్ పార్టీ.. ఆ రాష్ట్రంలో నిర్వహించిన ప్రెస్ ​కాన్ఫరెన్స్​లో ప్రదర్శించింది.

Manmohan Singh Punjab Election

"విదేశాంగ విధానంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఏడాది కాలంగా చైనా సైన్యం మన దేశ పవిత్ర భూభాగాన్ని ఆక్రమించుకుంటోంది. కానీ ప్రభుత్వ చర్యలన్నీ ఈ సమస్యను కప్పి ఉంచేందుకే ఉన్నాయి. పొరుగు దేశాలతో మన సంబంధాలు క్షీణిస్తున్నాయి. దేశ రాజ్యాంగంపై ప్రభుత్వానికి విశ్వాసం లేదు. ప్రజాస్వామ్య సంస్థలన్నింటినీ బలహీనం చేస్తోంది.

మరోవైపు, ప్రజలు ధరల పెరుగుదల, నిరుద్యోగం వంటి అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం తమ తప్పులను అంగీకరించకుండా దేశ ప్రప్రథమ ప్రధాని జవహార్​లాల్ నెహ్రూపై బాధ్యత నెట్టివేస్తోంది. ప్రజల సమస్యలకు ఇప్పటికీ ఆయన్నే బాధ్యులను చేస్తోంది."

-మన్మోహన్ సింగ్, మాజీ ప్రధానమంత్రి

Manmohan singh on BJP

ఇటీవల ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో తలెత్తిన భద్రతా లోపంపై మన్మోహన్ మాట్లాడారు. అదంతా.. పంజాబ్ ప్రభుత్వానికి అపకీర్తి తెచ్చేందుకు చేసిన ప్రయత్నమేనని ఆరోపించారు. 'అన్నదాతల ఆందోళన సమయంలోనూ పంజాబ్​ను, పంజాబీలను అవమానించే ప్రయత్నాలు జరిగాయి. పంజాబీల ధైర్యం, దేశభక్తిని ప్రపంచమే మెచ్చుకుంటుంది. మోదీ సర్కారు మాత్రం దీని గురించి మాట్లాడదు. పంజాబ్​ నుంచి వచ్చిన నిజమైన భారతీయుడిగా ఈ విషయాలన్నీ నన్ను తీవ్రంగా బాధిస్తున్నాయి. పంజాబ్ ప్రజల ముందు చాలా సమస్యలు ఉన్నాయి. పంజాబ్ అభివృద్ధి, వ్యవసాయం, నిరుద్యోగం వంటి సమస్యలను పరిష్కరించుకోవాలి. ఈ పని కాంగ్రెస్ మాత్రమే చేయగలదు' అని మన్మోహన్ అన్నారు.

రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని విభజిస్తున్నారని మన్మోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. 'నిజాన్ని దాచాలని మేమెప్పుడూ ప్రయత్నించలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం దేశాన్ని విభజించలేదు. దేశ ప్రతిష్ఠను దిగజార్చలేదు. నేను పదేళ్లు ప్రధానమంత్రిగా పనిచేశా. నేను చేపట్టిన కార్యక్రమాలే మాట్లాడాలని భావించా. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం, భారతీయుల గౌరవాన్ని పెంచాం. కాంగ్రెస్-యూపీఏ హయాంలో జరిగిన మంచి పనులను ప్రజలు గుర్తుంచుకోవాలి' అని మన్మోహన్ చెప్పారు.

ఇదీ చదవండి: 'రైతులను మోసం చేసిన చరిత్ర కాంగ్రెస్​ది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.