ETV Bharat / bharat

భాజపా వ్యూహాత్మక అడుగులు- మహారాజ్ జీ మాయ కొనసాగేనా?

author img

By

Published : Feb 1, 2022, 8:51 AM IST

Fielding Yogi from Gorakhpur
మహారాజ్ జీ మాయ కొనసాగేనా

up election 2022: రోజులు దగ్గర పడుతున్న కొద్దీ ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికలు మరింత రసవత్తరంగా మారుతున్నాయి. బలమైన నేతలు పార్టీలు మారుతుండడం కొంతమేరకు నేతలను కలవరపాటుకు గురి చేస్తుంది. ఇదిలా ఉంటే భాజపాకు కీలకమైన గోరఖ్‌పుర్‌ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రధానంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభపైనే ఆశలు పెట్టుకుంది ఆ పార్టీ. అందుకే వ్యూహాత్మకంగా ఆయన్ను రంగంలోకి దింపింది. ఇది ఎంతవరకు కలసి వస్తుంది అనేది తెలుసుకుందాం.

up election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్న కమలదళం.. గోరఖ్‌పుర్‌ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయించేందుకు ప్రధానంగా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ ప్రభపైనే ఆశలు పెట్టుకుంది. అందుకే వ్యూహాత్మకంగా ఆయన్ను స్థానిక గోరఖ్‌పుర్‌ అర్బన్‌ స్థానం నుంచి ఈ దఫా ఎన్నికల బరిలో దించింది. ఆయన పోటీతో.. ప్రాంతీయంగా ఇతర సీట్లలోనూ పార్టీకి లబ్ధి చేకూరుతుందని ఆశిస్తోంది. మరోవైపు- స్థానికంగా బలమైన నేతలుగా పేరున్న తాజా మాజీ మంత్రులు స్వామిప్రసాద్‌ మౌర్య, దారాసింగ్‌ చౌహాన్‌ వంటివారి చేరికతో సమాజ్‌వాదీ పార్టీకి (ఎస్పీ) కూడా ఇక్కడ పట్టు పెరిగింది.

సగానికిపైగా ఓబీసీలే

ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీ వ్యవస్థాగత నిర్మాణాన్ని భాజపా ఆరు భాగాలుగా విభజించింది. అవి- పశ్చిమ జోన్‌, బ్రజ్‌ ప్రాంతం, కాన్పుర్‌-బుందేల్‌ఖండ్‌, అవధ్‌, గోరఖ్‌పుర్‌, కాశీ. గోరఖ్‌పుర్‌ ప్రాంతంలో- గోరఖ్‌పుర్‌, మహారాజ్‌గంజ్‌, దేవరియా, కుశినగర్‌, బస్తీ, సంత్‌ కబీర్‌నగర్‌, సిద్ధార్థ్‌నగర్‌, ఆజంగఢ్‌, బలియా, మవూ జిల్లాలున్నాయి. ఈ ప్రాంత ఓటర్లలో సగానికి పైగా ఓబీసీలే. ఇందులో ప్రధానంగా మౌర్య, కుశ్వాహా, నొనియా-చౌహాన్‌ వర్గాల ప్రజలు ఎక్కువ. ఇక్కడ ఎస్సీలు 20% ఉంటారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, కాయస్థుల వంటి అగ్రవర్ణాలవారు కూడా చెప్పుకోదగిన సంఖ్యలో ఉన్నారు. ఆజంగఢ్‌, మవూ, పడ్రౌనా సహా దాదాపు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటర్లూ ప్రభావశీల స్థాయిలో ఉన్నారు.

నాడు యోగి అండతో..

గోరఖ్‌పుర్‌ ప్రాంత ప్రజలు యోగిని 'మహా రాజ్‌ జీ' అని పిలుస్తుంటారు. ఆయన స్థానిక గోరఖ్‌నాథ్‌ మఠాధిపతి కావడమే అందుకు కారణం. 1998 నుంచి యోగి గోరఖ్‌పుర్‌ స్థానంలో ఐదుసార్లు లోక్‌సభ ఎంపీగా గెలుపొందారు. ఆయన స్థాపించిన 'హిందూ యువ వాహిని' ప్రాబల్యం స్థానికంగా ఎక్కువే. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయానికి యోగి ఎంపీగా ఉన్నారు. అప్పట్లో ఆయన దాదాపుగా రాష్ట్రమంతటా పర్యటించినా.. ప్రధానంగా గోరఖ్‌పుర్‌ ప్రాంతంలో పార్టీ తరఫున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఫలితంగా గోరఖ్‌పుర్‌ ప్రాంతంలో మొత్తం 62 అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 44 భాజపా వశమయ్యాయి. ఎస్పీ, బీఎస్పీ ఇక్కడ చెరో ఏడు సీట్లతో సరిపెట్టుకున్నాయి. ప్రస్తుతం గోరఖ్‌పుర్‌ ప్రాంత అభ్యర్థుల ఎంపికలో యోగి తనదైన ముద్ర వేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

పెరిగిన ఎస్పీ బలం

సీఎం పదవిలో ఉన్నప్పటికీ యోగి గోరఖ్‌పుర్‌ ప్రాంత అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారన్న ఆరోపణలున్నాయి. ఇక్కడ యువతలో నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది. మరోవైపు- ప్రాంతీయంగా బలమైన ఓబీసీ నేతలుగా పేరున్న స్వామిప్రసాద్‌ మౌర్య, దారాసింగ్‌ చౌహాన్‌, ఓంప్రకాశ్‌ రాజ్‌భర్‌ తదితరులు పార్టీని వీడటం కమలనాథులకు ఎదురుదెబ్బే. 2017 ఎన్నికల్లో స్థానికంగా కమలదళం మెజార్టీ సీట్లు సాధించడంలో వీరిదీ కీలక పాత్రే. ఈ దఫా వారి గైర్హాజరీ కచ్చితంగా ప్రభావం చూపుతుందన్న విశ్లేషణలు వస్తున్నాయి. అయితే- కాంగ్రెస్‌ నుంచి కేంద్ర మాజీ మంత్రి ఆర్‌పీఎన్‌ సింగ్‌ను చేర్చుకోవడం కాషాయ పార్టీకి సానుకూలాంశంగా మారే అవకాశముంది. యూపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజయ్‌కుమార్‌ లల్లూ, బీఎస్పీ ముఖ్య నాయకుల్లో ఒకరైన ఉమాశంకర్‌ సింగ్‌ గోరఖ్‌పుర్‌ ప్రాంతవాసులే. మరోవైపు- స్వామిప్రసాద్‌, దారాసింగ్‌ల రాకతో ఇక్కడ ఎస్పీ బలం పెరిగింది. ఆ పార్టీ కీలక నేతల్లో ఒకరైన రామ్‌గోవింద్‌ చౌధరీ (అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు) కూడా ఈ ప్రాంతానికి చెందినవారే. దీంతో- ఈ దఫా యోగి మాయను కమ్మేసి గోరఖ్‌ఫుర్‌ ప్రాంతంలో మెజార్టీ సీట్లు సాధిస్తామని ఎస్పీ విశ్వాసం వ్యక్తం చేస్తోంది. మార్చి 3 (ఆరో విడత), మార్చి 7 (ఏడో విడత) తేదీల్లో ఇక్కడి స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.

రంగంలోకి హిందూ యువ వాహిని

హిందూ యువ వాహిని- యోగి మానసపుత్రిక. యువతలో జాతీయవాదాన్ని పెంపొందించాలన్న లక్ష్యంతో 2002లో ఆయన దీన్ని స్థాపించారు. ప్రస్తుతం గోరఖ్‌పుర్‌ అర్బన్‌ స్థానంలో ఆయన తరఫు ప్రచార బాధ్యతల్ని ఈ సంస్థే భుజాలకెత్తుకుంది. బూత్‌ స్థాయిలో ముఖ్యమంత్రికి భారీస్థాయిలో మద్దతు కూడగట్టేందుకు ప్రయత్నిస్తోంది. భాజపాతో సమన్వయంతో పనిచేస్తోంది.

గోరఖ్‌పుర్‌ ప్రాంతంలోని జిల్లాల సంఖ్య 10

ఇక్కడి అసెంబ్లీ సీట్ల సంఖ్య 62

.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: '30 ఏళ్ల తర్వాత అన్ని స్థానాల్లో పోటీ.. జైలుకు వెళ్లేందుకైనా సిద్ధం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.