ETV Bharat / bharat

'మరో రెండేళ్ల వరకైనా ఉద్యమం చేసేందుకు సిద్ధం'

author img

By

Published : Feb 27, 2021, 3:57 PM IST

సాగు చట్టాల రద్దు కోసం రెండేళ్ల వరకైనా ఉద్యమం కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నామని తెలిపారు భారతీయ కిసాన్ ‌యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేశ్​ టికాయిత్​. ప్రభుత్వం.. చట్టాలను రద్దు చేయాల్సిందేనని పునరుద్ఘాటించారు. తమ ఉద్యమం దేశంలోని ప్రతి గ్రామానికి చేరుకుందని, దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోందని గుర్తు చేశారు.

Rakesh tikait
భారతీయ కిసాన్ ‌యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేశ్​ టికాయిత్​

కేంద్రం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేయాలని కోరుతూ దిల్లీ సరిహద్దుల్లో 3 నెలలకుపైగా ఆందోళన చేస్తున్నారు రైతులు. ఇందులో భాగంగా రాజస్థాన్​, శ్రీగంగానగర్​లోని పదమ్​పుర్​లో కిసాన్​ మహాపంచాయత్​ నిర్వహించారు. సంయుక్త కిసాన్​ మోర్చా నేతలు రాకేశ్​ టికాయిత్​, గుర్నామ్​ సింగ్​, జోగిందర్​ సింగ్​ పాల్గొన్నారు. ప్రభుత్వం సాగు చట్టాలను రద్దు చేయాల్సిందేనన్నారు భారతీయ కిసాన్ ‌యూనియన్‌ (బీకేయూ) నాయకుడు రాకేశ్​ టికాయిత్​. చట్టాలు రద్దయ్యేవరకు రైతుల ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

వ్యవసాయ చట్టాలను రద్దు చేయటమే తమ డిమాండ్​ అని, వచ్చే 2 సంవత్సరాల వరకైనా ఉద్యమాన్ని కొనసాగించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు టికాయిత్​. రైతు ఉద్యమం పంజాబ్​లో ప్రారంభమైనప్పటికీ.. దేశవ్యాప్తంగా వ్యాపించిందని గుర్తు చేశారు. గతంలో ఈ ఉద్యమాన్ని మే వరకు కొనసాగిస్తామని రైతు నేతలు ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబర్​కు పెంచారు. ప్రస్తుతం ఆ సమయాన్ని రెండేళ్లకు పొడిగించారు.

పారిశ్రామికవేత్తలకు మేలు చేసేందుకే..

దేశవ్యాప్తంగా రైతుల ఉద్యమానికి మద్దతు లభిస్తోందన్నారు కర్షక నేతలు. ప్రతి గ్రామానికి చేరిందని తెలిపారు. పార్లమెంట్​ వరకు ట్రాక్టర్​ ర్యాలీ అనేది కిసాన్​ మోర్చా స్థాయిలోనే తీసుకుంటారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ మూడు చట్టాల ద్వారా సన్నిహితులైన పారిశ్రామికవేత్తలకు మేలు చేసేందుకే ప్రయత్నిస్తోందని ఆరోపించారు.

చర్చలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు..

రైతులతో చర్చలు చేపట్టేందుకు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్నారు కర్షక నేతలు. ఇప్పటి వరకు 10 దఫాలుగా చర్చలు జరిగాయని, ఒక్కసారి కూడా చట్టాల రద్దుకు ప్రభుత్వం అంగీకరించినట్లు కనిపించలేదన్నారు. ఇప్పటికీ మరో దఫా చర్చలకు తేదీలను ఖరారు చేయలేదని గుర్తు చేశారు. ప్రభుత్వం ఫోన్​కాల్​ దూరంలో ఉందని ప్రధాని మోదీ చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఫోన్​ నంబర్​ వెల్లడించలేదని ఎద్దేవా చేశారు. కనీస మద్దతు ధరపై ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నా చట్టం చేసేందుకు సుముఖంగా లేదని ఆరోపించారు. ఎంఎస్​పీ చట్టం తీసుకొస్తే వ్యాపారులు మోసాలకు పాల్పడే అవకాశం ఉందని గుర్తు చేశారు.

ఇదీ చూడండి: 'ఆ చట్టాలు రద్దు చేయకుంటే పార్లమెంట్​ చుట్టుముడతాం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.