ETV Bharat / bharat

ఎన్నికల ఖర్చులో తగ్గేదేలే.. 5 రాష్ట్రాల్లో రూ.3500 కోట్ల వ్యయం!

author img

By

Published : Jan 24, 2022, 7:27 AM IST

election expenses
2022 ఎన్నికలు

Election Expenses: అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపుర్‌ అసెంబ్లీలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో నగదు.. ఏరులై పారే అవకాశం ఉంది. ప్రధాన పార్టీలు, కూటముల అభ్యర్థులే ఏకంగా రూ.3,500 కోట్ల వరకు ఖర్చు పెట్టే అవకాశమున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాష్ట్రాలవారీగా సంబంధిత అంచనాలను పరిశీలిస్తే..

Election Expenses: 'ఎన్నికలు' అనే పదానికి 'ధనప్రవాహం' దాదాపు పర్యాయపదంగా మారిన రోజులివి! పదవి దక్కాలన్న ఆశతో అభ్యర్థులు, ఐదేళ్లు అధికారంలో కొనసాగడమే లక్ష్యంగా రాజకీయ పార్టీలు ఎన్నికల వేళ డబ్బును విచ్చలవిడిగా ఖర్చు చేస్తుండటం చూస్తున్నాం. తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఈ తంతు విస్తృతంగా సాగుతోంది. అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఉత్తర్‌ప్రదేశ్‌తో పాటు ఉత్తరాఖండ్‌, పంజాబ్‌, గోవా, మణిపుర్‌ అసెంబ్లీలకు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ప్రధాన పార్టీలు, కూటముల అభ్యర్థులే ఏకంగా రూ.3,500 కోట్ల వరకు ఖర్చు పెట్టే అవకాశమున్నట్లు విశ్లేషణలు వెలువడుతున్నాయి. రాష్ట్రాలవారీగా సంబంధిత అంచనాలను పరిశీలిస్తే..

ఆ రెండు రాష్ట్రాల్లో..

Goa Election 2022: మణిపుర్‌లో 60, గోవాలో 40 అసెంబ్లీ సీట్లున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ ప్రతి నియోజకవర్గంలో కనీసం ముగ్గురు బలమైన అభ్యర్థుల మధ్య పోటీ ఉంది. ఈ లెక్కన చూస్తే అధికారిక లెక్కల ప్రకారం (ఒక్కో అభ్యర్థి గరిష్ఠ వ్యయ పరిమితి- రూ.28 లక్షలు) మణిపుర్‌, గోవాల్లో కలిపి రూ.84 కోట్లు ఖర్చవుతాయి! రెండు రాష్ట్రాల్లో కలిపి అభ్యర్థులు లెక్కల్లో చూపకుండా కనీసం మరో రూ.84 కోట్లు వ్యయం చేసే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు. అంటే- మొత్తంగా వీటిలో దాదాపు రూ.168 కోట్లు ఖర్చవుతాయని అంచనా.

పంజాబ్‌: బహుముఖ పోరుతో..

Punjab Elections 2022: పంజాబ్‌లో 117 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఇక్కడ దాదాపుగా ప్రతి నియోజకవర్గంలోనూ కాంగ్రెస్‌, ఆప్‌, శిరోమణి అకాలీదళ్‌, భాజపా కూటమి, సంయుక్త సమాజ్‌ మోర్చా కూటమి అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఈ ఐదు పక్షాల అభ్యర్థుల దగ్గరా డబ్బుకు కొదవలేదు! ఒక్కో అభ్యర్థి రూ.40 లక్షల వరకు ఖర్చు పెట్టొచ్చు కాబట్టి.. అధికారికంగానే రూ.234 కోట్ల లెక్క వస్తుంది. ప్రతి స్థానంలోనూ సగటున ముగ్గురు అభ్యర్థులు విజయకాంక్షతో కనీసం రూ.కోటి చొప్పున, మరో ఇద్దరు రూ.50 లక్షల చొప్పున (అధికారిక లెక్కల్లో చూపేది కాకుండా) వ్యయం చేస్తారని అంచనా. అదనంగా చేసే ఈ ఖర్చు (రూ.468 కోట్లు)తో కలిపితే.. మొత్తంగా రాష్ట్రంలో రూ.702 కోట్ల లెక్క తేలుతుంది.

ఉత్తరాఖండ్‌: ద్విముఖ పోటీయే

Uttarakhand Elections 2022: ఉత్తరాఖండ్‌లో దాదాపుగా అన్ని నియోజకవర్గాల్లోనూ (70) భాజపా, కాంగ్రెస్‌ మధ్యే గట్టి పోటీ ఉంది. ఈ పార్టీల అభ్యర్థులు తమకున్న గరిష్ఠ పరిమితి (రూ.40 లక్షలు) దాటి.. అదనంగా మరో రూ.50 లక్షల చొప్పున ఖర్చు చేసే అవకాశముందన్నది విశ్లేషకుల మాట. ఈ లెక్కన రాష్ట్రంలో అధికారికంగా కనీసం రూ.56 కోట్లు, అనధికారికంగా మరో 70 కోట్లు.. అంటే మొత్తంగా రూ.126 కోట్లు వ్యయం చేసే అవకాశముంది.

ఉత్తర్‌ప్రదేశ్‌: 'విరాళాల' భారం

Up Elections 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో పరిస్థితి చాలా భిన్నం. ఇక్కడ తమ టికెట్‌ దక్కించుకున్న అభ్యర్థుల నుంచి సగటున బీఎస్పీ రూ.60 లక్షలు, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) నేతృత్వంలోని కూటమి రూ.50 లక్షలు, భాజపా రూ.40 లక్షలు, కాంగ్రెస్‌ రూ.6 లక్షల చొప్పున 'విరాళం'గా స్వీకరిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి! ఈ లెక్కన టికెట్ల కోసమే అభ్యర్థులు మొత్తంగా రూ.630 కోట్లు సమర్పించుకోవాల్సి వస్తోంది! రాష్ట్రంలో ఒక్కో అభ్యర్థి గరిష్ఠ వ్యయ పరిమితి రూ.40 లక్షలు. ఇక ఇక్కడ సగటున ప్రతిస్థానంలోనూ అదనంగా భాజపా, ఎస్పీ కూటమి, బీఎస్పీ అభ్యర్థులు రూ.40 లక్షలు, కాంగ్రెస్‌ అభ్యర్థులు రూ.30 లక్షల చొప్పున ఖర్చు చేసే అవకాశముందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఈ లెక్కన ప్రధాన పార్టీల తరఫునే మొత్తంగా సుమారు రూ.2,500 కోట్ల వరకు వ్యయం కనిపిస్తుందన్నమాట!

  • అభ్యర్థుల గరిష్ఠ వ్యయ పరిమితిని ఎన్నికల కమిషన్‌ (ఈసీ) ఇటీవల పెంచింది. తాజా నిబంధనల ప్రకారం అసెంబ్లీ ఎన్నికల కోసం.. మణిపుర్‌, గోవాల్లో ఒక్కో అభ్యర్థి రూ.28 లక్షల వరకు ఖర్చు చేయొచ్చు. గతంలో ఈ పరిమితి రూ.20 లక్షలుగా ఉండేది. ఉత్తర్‌ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, పంజాబ్‌ల్లో గతంలో ఒక్కో అభ్యర్థి గరిష్ఠంగా రూ.28 లక్షలు వ్యయం చేసేందుకు వీలుండగా.. దాన్ని రూ.40 లక్షలకు పెంచింది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చదవండి: పిల్లలపై మంత్రి కుమారుడి కాల్పులు.. అనేక మందికి గాయాలు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.