ETV Bharat / bharat

TSPSC Paper Leak case: పేపర్ లీక్ కేసులో కీలక మలుపు.. ఏకంగా ఆ ఇద్దర్ని విచారించిన ఈడీ

author img

By

Published : May 2, 2023, 8:59 AM IST

TSPSC
TSPSC

ED Inquiry in TSPSC Paper Leakage case: టీఎస్​పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. కేసుకు సంబంధించి నిధుల మళ్లింపు కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ అధికారులు.. ఏకంగా టీఎస్​పీఎస్సీ కమిషన్‌ ఛైర్మన్‌ జనార్దన్‌రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌ను దాదాపు 12 గంటల పాటు విచారించారు.

ED Inquiry in TSPSC Paper Leakage case: టీఎస్‌పీఎస్సీ పేపర్ లీకేజ్‌ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాన నిందితులైన ప్రవీణ్‌ కుమార్‌, రాజశేఖర్ రెడ్డిలను కోర్టు అనుమతితో చంచల్​గూడ జైలులో రెండు రోజుల పాటు విచారించింది. ఇటీవల కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ సూపరింటెండెంట్‌ శంకర్​లక్ష్మీ, ఏఎస్‌ఓ అడ్మిన్‌ సత్యనారాయణను ఈడీ తన కార్యాలయంలో ప్రశ్నించింది. తాజాగా టీఎస్​పీఎస్సీ ఛైర్మన్‌ జనార్దన్​రెడ్డి, కార్యదర్శి అనితా రామచంద్రన్‌లపై ఈడీ అధికారులు ప్రశ్నలు కురిపించారు.

TSPSC Paper Leakage case Update: వారం రోజుల కిందట విచారణకు హాజరుకావాల్సిందిగా వారికి నోటీసులు ఇచ్చినట్లు తెలిసింది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం 10 గంటలకు ఛైర్మన్‌, కార్యదర్శి బషీర్‌ బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. రాత్రి 11 గంటల వరకు ఈ విచారణ కొనసాగింది. సుమారు 12 గంటల పాటు ఇద్దరిని ఈడీ విచారించింది. ఇద్దరు సీనియర్‌ ఐఏఎస్‌ అధికారులను ఇన్ని గంటల పాటు విచారించడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. టీఎస్​పీఎస్సీ కాన్ఫిడెన్సియల్‌ సెక్షన్‌ నుంచి పేపర్‌ లీక్‌ అయిన అంశాన్ని ఈడీ అధికారులు వారిని అడిగినట్లు సమాచారం.

TSPSC పేపర్ లీక్‌ కేసు.. వారి ఇద్దరిని విడివిడిగా ప్రశ్నించిన ఈడీ: సెక్షన్‌లో పని చేసే అధికారులు, సిబ్బంది, కార్యదర్శి పీఏగా ఉన్న ప్రవీణ్‌ కుమార్​ల వ్యవహారంపై ఈడీ ప్రశ్నించినట్లు సమాచారం. ప్రశ్నాపత్రాలు లీక్‌ చేసిన తర్వాత వాటిని ఎవరెవరికి విక్రయించారు? వాటి ద్వారా ఎంత లబ్ధి పొందారనే అంశాలపై ఆరా తీసినట్లు తెలిసింది. అసలు టీఎస్​పీఎస్సీ పరీక్ష నిర్వహించేందుకు ఎలాంటి ప్రక్రియ అమలు చేస్తున్నారని ఛైర్మన్‌ సహా కార్యదర్శిని వివరాలు అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ఇద్దరిని విడివిడిగా ప్రశ్నించిన ఈడీ అధికారులు వారి స్టేట్​మెంట్స్‌ను రికార్డు చేశారు.

మనీలాండరింగ్ కోణంలో విచారిస్తున్నఈడీ: ఇద్దరి విచారణను జాయింట్ డైరెక్టర్‌ రోహిత్‌ ఆనంద్‌ పర్యవేక్షించారు. భోజన విరామం అనంతరం.. అనితా రామచంద్రన్‌ను పేపర్‌ లీకేజ్‌ వ్యవహారం, ప్రవీణ్‌ కుమార్‌కు సంబంధించిన పలు వివరాలు అడిగినట్లు తెలిసింది. కార్యదర్శి అనితా రామచంద్రన్​ను డిప్యూటీ డైరెక్టర్‌ రాహుల్‌ సింగానియా విచారించగా ఆమె ఇచ్చిన కొంత సమాచారంతో ఛైర్మన్‌ను ప్రశ్నించినట్లు సమాచారం. మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడీ ఈ కేసును విచారిస్తోంది. కాబట్టి ఛైర్మన్‌, కార్యదర్శి బ్యాంకు స్టేట్​మెంట్స్‌ను కూడా పరిశీలించినట్లు తెలుస్తోంది.

మళ్లీ విచారణకు రావాలని చెప్పారా?: సుదీర్ఘ విచారణ తర్వాత కార్యాలయం నుంచి ఇద్దరు వేరువేరుగా రాత్రి 11 గంటలకు వెళ్లిపోయారు. నేడు మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు చెప్పారా..? అన్న ప్రశ్నకు ఛైర్మన్‌ తనకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని వెల్లడించారు. కాగా టీఎస్​పీఎస్సీ లీకేజీ కేసులో ఇప్పటికే ఏర్పాటైన సిట్‌ 20 మందిపై కేసులు నమోదు చేయగా.. 19 మందిని ఇప్పటి వరకు అరెస్టు చేసింది. సిట్‌ అధికారులు చేసిన దర్యాప్తు నుంచి కొంత సమాచారాన్ని ఈడీ అధికారులు తీసుకుని ముందుకు వెళ్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.