ETV Bharat / bharat

Differences in YSRCP: విశాఖ వైసీపీలో ఆధిపత్య పోరు.. నువ్వా నేనా అంటూ పంతం పట్టిన నేతలు

author img

By

Published : May 13, 2023, 10:31 AM IST

Differences Between YSRCP Leaders in Vizag
Differences Between YSRCP Leaders in Vizag

Differences Between YSRCP Leaders in Vizag: అధికార వైసీపీలో విబేధాల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా విశాఖలో ఇద్దరు నాయకుల మధ్య ఆధిపత్య పోరు రగులుతోంది. తాజాగా జరిగిన జోనల్‌ ఇన్‌ఛార్జుల నియామకమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. పూర్తి వివరాల్లోకెళ్తే..

Differences Between Visakha YSRCP Leaders: విశాఖలో అధికార వైఎస్సార్​ కాంగ్రెస్​ పార్టీలో ఆధిపత్య పోరు రగులుతోంది. ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జి వైవీ సుబ్బారెడ్డి, మాజీ ఇన్‌ఛార్జ్​, రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి మధ్య పోటీ తారస్థాయికి చేరింది. తాజాగా జరిగిన జోనల్‌ ఇన్‌ఛార్జుల నియామకమే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తోంది. పార్టీ నేతలతో వైవీ సుబ్బారెడ్డి చర్చించి నిర్ణయించిన వారిని నియమిస్తూ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసిన ఒక్క రోజులోనే... ఆ పేర్లను మార్చి వేరే వారికి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఎంపీ విజయ సాయిరెడ్డి ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. విజయ సాయిరెడ్డి ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో పార్టీ అనుబంధ విభాగాల ( విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలు) జోనల్‌ ఇన్‌ఛార్జుల నియామకంపై కసరత్తు చేశారు.

యువజన విభాగం ఇన్‌ఛార్జిగా సునీల్‌ కుమార్‌, మహిళా విభాగం ఇన్‌ఛార్జిగా విశాఖ నగర మహిళా విభాగ మాజీ అధ్యక్షురాలు గరికన గౌరి పేర్లు తెరపైకి తెచ్చారు. అప్పట్లో వీరి ఎంపికపై పార్టీలోని కొందరి నుంచి వ్యతిరేకత రావడంతో జోనల్‌ ఇన్‌ఛార్జుల నియామకాన్ని కొన్ని రోజుల పాటు పక్కనపెట్టారు. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇన్‌ఛార్జ్​గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి.. యువజన విభాగానికి భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమారుడు ముత్తంశెట్టి వెంకట శివసాయి సందీప్‌, మహిళా విభాగానికి విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు పీలా వెంకటలక్ష్మిల పేర్లు ఖరారు చేశారు. ఈ పేర్లను పార్టీ కేంద్ర కార్యాలయం ఈ నెల 10న తాడేపల్లి నుంచి ప్రకటించింది.

సవాల్‌ చేసి.. మరీ మార్పు!: ఈ నెల 6న విశాఖ విమానాశ్రయానికి విజయ సాయిరెడ్డి వచ్చినప్పుడు జోనల్‌ ఇన్‌ఛార్జుల పేర్లు మార్చుతున్నారనే అంశాన్ని కొందరు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ‘నేను సూచించిన వారికి కాకుండా వేరే వారికి ఎలా వస్తాయో చూస్తా’ అంటూ విజయసాయి పార్టీ నాయకుల వద్ద సవాల్‌ చేసినట్లు సమాచారం. సుబ్బారెడ్డి నిర్ణయించిన పేర్లతో లేఖ విడుదల కావడాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఎంపీ విజయ సాయిరెడ్డి నేరుగా రంగంలోకి దిగారు. 10న ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నామని, వారి స్థానంలో సునీల్‌ కుమార్‌, గరికన గౌరిలను నియమించినట్లు పార్టీ అనుబంధ విభాగాల సమన్వయకర్తగా ఆయనే ప్రకటన చేశారు. ఎంపీ పంతం నెగ్గించుకోవడంతో పార్టీ కార్యకర్తలు సందిగ్ధంలో పడ్డారని సమాచారం. భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు కుమారుణ్ని యువజన విభాగం ఇన్‌ఛార్జిగా నియమించినా.. ఒక్క రోజుకే తొలగించడాన్ని ఆయన వర్గీయులు తీవ్ర అవమానంగా భావిస్తున్నారు. అయితే దీనిపై పార్టీ అధిష్ఠానం స్పందించి.. వైవీ సుబ్బారెడ్డి ప్రకటించిన వాళ్లను కొనసాగిస్తుందా లేకపోతే ఎంపీ విజయసాయి రెడ్డి నియమించిన వారిని కొనసాగిస్తుందా అనేది ఉత్కంఠ రేపుతోంది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.