ETV Bharat / bharat

'విజయన్​ సీటు'కు ఎందుకంత క్రేజ్​?

author img

By

Published : Mar 19, 2021, 2:14 PM IST

కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రస్తుతం ముఖ్యమంత్రి విజయన్​ బరిలో నిలుస్తున్న ధర్మదామ్​ నియోజకవర్గం దేశవ్యాప్తంగా చర్చనీయాశమైంది. విజయన్​కు పోటీగా అభ్యర్థులను నిలపటంలో విపక్షాలు ఇబ్బందులు ఎదుర్కోవటం ఒక ఎత్తు అయితే.. 2017లో సంచలనం సృష్టించిన వలయార్​ హత్యాచారం కేసులో బాలికల తల్లి పోటీలో నిలవటం మరో ఎత్తు. మరి అలాంటి నియోజకవర్గంలో గెలుపెవరిది?

Dharmadom
కేరళ ఎన్నికల్లో 'విజయన్​ సీటు'కు ఎందుకంత క్రేజ్​?

ధర్మదామ్... కేరళ కన్నూర్​ జిల్లాలోని ఓ నియోజకవర్గం. అధికార వామపక్ష పార్టీకి కంచుకోట. ముఖ్యమంత్రి పినరయి విజయన్​ వరుసగా రెండోసారి పోటీ చేస్తోంది ఈ స్థానం నుంచే. ప్రస్తుతం ఈ నియోజకవర్గం దేశవ్యాప్తంగా హాట్​ టాపిక్​గా మారింది. ఎందుకిలా? విజయన్​కు ప్రత్యర్థులు ఎవరు? ప్రధాన పార్టీల అభ్యర్థుల విజయావకాశాలు ఎలా ఉన్నాయి? ఓసారి పరిశీలిద్దాం.

ధర్మదామ్​ నియోజకవర్గం 2008లో ఏర్పడింది. తొలిసారి 2011లో ఎన్నికలు జరిగాయి. అప్పటి నుంచి లెఫ్ట్​ పార్టీకి కంచుకోటగా మారింది. తొలి ఎన్నికల్లో ఎల్​డీఎఫ్​ అభ్యర్థి కేకే నారయణన్​ విజయం సాధించారు. 2016లో విజయన్​ 36 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో యూడీఎఫ్​ అభ్యర్థిపై గెలిచి సీఎం పీఠాన్ని అధిరోహించారు.

ఈ నియోజకవర్గంలోని 8 పంచాయతీల్లో ఏడు లెఫ్ట్​ పార్టీ చేతిలోనే ఉన్నాయి. గత చరిత్ర కూడా ఎల్​డీఎఫ్​కే అనుకూలంగా ఉంది. అందుకే మరోసారి ఈ నియోజకవర్గం నుంచే బరిలో దిగుతున్నారు విజయన్​.

Dharmadom
విజయన్​కు పోటీగా యూడీఎఫ్​, ఎన్డీఏ అభ్యర్థుల ఖరారు

యూడీఎఫ్​కు ఈసారైనా విజయం దక్కేనా?

ధర్మదామ్​ నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లో యూడీఎఫ్​ విజయం సాధించలేకపోయింది. అందుకే ఈసారి సరైన అభ్యర్థి ఎంపిక కోసం విస్తృత కసరత్తు చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలు, గత చరిత్రను చూసుకుంటే యూడీఎఫ్​కు ప్రతికూలంగానే ఉన్నాయి. అయితే.. శబరిమల, ఇతర కీలక అంశాల్లో ప్రభుత్వంపై వ్యతిరేకతపైనే యూడీఎఫ్​ నమ్మకం పెట్టుకుంది. 2019 పార్లమెంట్​ ఎన్నికలు, కదంబుర్​ పంచాయతీ ఎన్నికల్లో మంచి ప్రదర్శన కనబరచటం కాస్త సానుకూల అంశం.

బరిలో రఘునాథ్​

ముఖ్యమంత్రి విజయన్​ను ఎదుర్కొనేందుకు తగిన అభ్యర్థిని ఎంపిక చేయటంలో తలమునకలైన యూడీఎఫ్​.. నామినేషన్​ దాఖలు గడువు ముగింపునకు ఒకరోజు ముందు నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్​ సీనియర్​ నేత, జిల్లా కాంగ్రెస్​ కమిటీ ప్రధాన కార్యదర్శి సి.రఘునాథ్​ నామినేషన్​ దాఖలు చేశారు.

Dharmadom
నామినేషన్​ దాఖలు చేస్తున్న అభ్యర్థి

తెరపైకి పలువురి పేర్లు..

నిజానికి ధర్మదామ్ నియోజకవర్గ అభ్యర్థి ఎంపిక కాంగ్రెస్​కు పెద్ద సవాల్​గా మారింది. ముందుగా జాతీయ ప్రధాన కార్యదర్శి జి.దేవరాజన్​ పేరు తెరపైకి వచ్చింది. అయితే.. పోటీకి ఆయన నిరాకరించారు. ఈ క్రమంలో వలయార్​ బాలికల తల్లి కాంగ్రెస్​ తరఫున విజయన్​ను ఎదుర్కొనేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కానీ, కాంగ్రెస్​ స్థానిక నేతలు అందుకు అంగీకరించకపోగా.. ఆ ప్రతిపాదనను విరమించుకుంది నాయకత్వం. ఆ తర్వాత కె.సుధాకరన్​ పేరును ప్రతిపాదించగా.. ఆయనా తిరస్కరించారు. రఘునాథ్​ పేరును సూచించారు.

ఎన్​డీఏ పుంజుకునేనా?

కేరళలో భాజపా నేతృత్వంలోని ఎన్​డీఏ ఇప్పటికీ మూడో స్థానానికే పరిమితమైంది. ముఖ్యంగా ధర్మదామ్ నియోజకవర్గంలో ఈ కూటమికి చెప్పుకోదగిన బలం లేదనే తెలుస్తోంది. ఈ స్థానంలో గెలువటం కంటే ఓటింగ్​ శాతాన్ని పెంచుకుని తమకూ మంచి ఆదరణ ఉందని నిరూపించకోవటంపైనే కమలదళం దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.

బరిలో భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు

ఎన్​డీఏ తరఫున భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ​ కమిటీ సభ్యుడు సీకే పద్మనాభన్​ బరిలో నిలిచారు. కేరళ భాజపాలో సీకేపీ అత్యంత సీనియర్​, కీలక నేత. 1969లో భారతీయ జన సంఘ్​ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు పద్మనాభన్​. 1980లో భాజపా ఏర్పాటు తర్వాత కోజికోడ్​ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారు.

స్వతంత్ర అభ్యర్థిగా 'ఆమె'

వలయార్​ అక్కాచెల్లెళ్ల అనుమానాస్పద మృతి 2017లో కేరళలో సంచలనం సృష్టించింది. ఆ కేసులో తమకు న్యాయం చేయటంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని పోరాటం చేస్తోన్న బాధితురాళ్ల తల్లి.. ముఖ్యమంత్రి విజయన్​పై పోటీ చేసేందుకు నిర్ణయించుకున్నారు. ధర్మదామ్​ నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తానని గత మంగళవారం ప్రకటించారు.

" నా కూతుళ్ల మరణానికి న్యాయం కావాలి. నేను తిరువనంతపురంలో సీఎం విజయన్​ను కలిసి దుండగులను కఠినంగా శిక్షించాలని వేడుకున్నా. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే విజయన్​పై స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నా. సంఘ్​ పరివార్​ మినహా అందరి మద్దతు కూడగడతాం. "

- వలయార్​ బాధితుల తల్లి

ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం ధర్మదామ్​ నియోజకవర్గంలో 87,467 మంది పురుషులు, 1,01,697 మంది మహిళలు, ఇద్దరు ట్రాన్స్​జెండర్​ ఓటర్లు ఉన్నారు.

కేరళలోని 140 స్థానాలకు ఏప్రిల్​ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెలువడనున్నాయి.

ఇదీ చూడండి: కేరళ ఆనవాయితీ మారేనా? సర్వేలన్నీ వామపక్షాల వైపే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.