ETV Bharat / bharat

'శృంగారానికి నిరాకరించడం నేరం కాదు.. భర్తపై క్రిమినల్ చర్యలు తీసుకోలేం'

author img

By

Published : Jun 20, 2023, 5:34 PM IST

Updated : Jun 21, 2023, 6:21 AM IST

denying sex mental cruelty
denying sex mental cruelty

Denying sex mental cruelty : పెళ్లి తర్వాత భార్యతో శృంగారానికి నిరాకరించడం నేరం కాదని కర్ణాటక హైకోర్టు పేర్కొంది. హిందూ వివాహ చట్టం ప్రకారం శారీరక సంబంధానికి నిరాకరించడం క్రూరమే అయినప్పటికీ.. ఐపీసీ సెక్షన్ ప్రకారం ఇది నేరం కాదని స్పష్టం చేసింది. మరోవైపు, ప్రియుడితో సహజీవనం చేసేందుకు ఓ వివాహితకు అనుమతి ఇచ్చింది న్యాయస్థానం.

Denying sex mental cruelty : భార్యతో శారీరక సంబంధానికి భర్త నిరాకరించడం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరమే అయినప్పటికీ.. భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ) సెక్షన్ 498ఏ ప్రకారం నేరం కాదని కర్ణాటక హైకోర్టు స్పష్టం చేసింది. శారీరక సంబంధానికి నిరాకరించడం వల్ల తన వివాహం పరిపూర్ణం కాలేదని పేర్కొంటూ ఓ మహిళ ఈ పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు తన భర్త, అత్తామామలపై మహిళ పెట్టిన క్రిమినల్ కేసును హైకోర్టు కొట్టివేసింది.

కేసు వివరాలు ఇలా..
Denying sex to spouse high court : న్యాయస్థానంలో ఫిర్యాదు చేసిన మహిళకు 2019 డిసెంబర్ 18న వివాహం జరిగింది. ఆమె భర్త ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించేవాడు. ఈ నేపథ్యంలో మహిళతో శారీరక బంధాన్ని ఏర్పరచుకునేందుకు అతడు నిరాకరించాడు. దీంతో ఆ మహిళ 28 రోజులు మాత్రమే అత్తింట్లో ఉండి.. పుట్టింటికి వచ్చేసింది. ఐపీసీ సెక్షన్ 498ఏ, వరకట్న నిరోధక చట్టం కింద.. తన భర్త, అత్తామామలపై 2020 ఫిబ్రవరిలో కేసు పెట్టింది. దీంతో పాటు తన వివాహ బంధం పరిపూర్ణం కాలేదని పేర్కొంటూ హిందూ వివాహ చట్టం ప్రకారం కేసు పెట్టింది. తన వివాహాన్ని రద్దు చేయాలని కోరుతూ కుటుంబ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

మహిళ పిటిషన్​పై విచారణ జరిపిన కుటుంబ న్యాయస్థానం 2022 నవంబర్​లో వీరి పెళ్లిని రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే.. భర్త, అత్తామామలపై పెట్టిన క్రిమినల్ కేసును మాత్రం ఆ మహిళ వెనక్కి తీసుకోలేదు. దీంతో మహిళ భర్త కర్ణాటక హైకోర్టును ఆశ్రయించాడు. తనపై, తన తల్లిదండ్రులపై నమోదైన ఛార్జ్​షీట్​ను ఆయన సవాల్ చేశాడు. దీనిపై ఇటీవల విచారణ జరిపిన కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. శారీరక బంధాన్ని కాదనడం హిందూ వివాహ చట్టం ప్రకారమే క్రూరత్వం కిందకు వస్తుందని, ఐపీసీ ప్రకారం కాదని తీర్పు చెప్పింది.

"ప్రేమ అంటే మనసులకు సంబంధించింది మాత్రమేనని భర్త విశ్వసించాడు. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న ఆయన.. శారీరక బంధమే ప్రేమ కాదని అనుకున్నాడు. ఈ కేసులో భర్తపై ఉన్న ఆరోపణ అదొక్కటే. అయితే, వివాహం అయిన తర్వాత భార్యతో శారీరక బంధాన్ని నిరాకరించడం హిందూ వివాహ చట్టం ప్రకారం క్రూరత్వమే. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఐపీసీ సెక్షన్ 498 ఏ ప్రకారం ఇది నేరం కాదు. ఈ కేసులో భర్తపై క్రిమినల్ చర్యలు చేపట్టడం సరికాదు. అలా చేస్తే.. అది వేధింపుల కిందకే వస్తుంది. అందువల్ల అతడిపై ఉన్న క్రిమినల్ కేసును కొట్టేస్తున్నాం."
-కర్ణాటక హైకోర్టు

ఇదీ చదవండి : సెక్స్​కు గ్యాప్ ఇస్తే ఆ వ్యాధులు వచ్చే ప్రమాదం.. ఇలా చేస్తే అంతా సెట్!

మరోవైపు, తనకు నచ్చిన వ్యక్తితో సహజీవనం చేసేందుకు వివాహితకు ఉత్తరాఖండ్​ హైకోర్టు అనుమతించింది. 2022 ఆగస్టు నుంచి కనిపించకుండా పోయిందని పేర్కొంటూ ఆమె భర్త కోర్టును ఆశ్రయించగా.. పోలీసులు ఆ మహిళను వెతికి తీసుకొచ్చారు. అయితే, తాను తన భర్తతో కలిసి ఉండలేనని, గతేడాది ఆగస్టు నుంచి వేరే వ్యక్తితో సహజీవనం చేస్తున్నానని మహిళ తెలిపింది. తన భర్త రోజూ కొట్టేవాడని, అతడి ప్రవర్తన సరిగా ఉండేది కాదని న్యాయస్థానానికి విన్నవించింది. మహిళ వాదనలు విన్న న్యాయస్థానం.. నచ్చిన వ్యక్తితో ఉండేందుకు ఆమెకు అనుమతి ఇచ్చింది. భర్తకు దూరంగా ఉన్న ఆ మహిళకు పదేళ్ల కుమారుడు, ఆరేళ్ల కుమార్తె ఉన్నారు.

Last Updated :Jun 21, 2023, 6:21 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.