ETV Bharat / bharat

యువతిని కారు ఈడ్చుకెళ్లిన కేసు.. మద్యం మత్తులో నిందితులు.. హోటల్ వద్ద గొడవ!

author img

By

Published : Jan 3, 2023, 12:24 PM IST

Updated : Jan 3, 2023, 12:50 PM IST

DELHI SCOOTY GIRL DEATH CASE
దిల్లీ స్కూటీ యువతి కేసు

దిల్లీలో యువతిని కారుతో ఢీకొట్టి ఈడ్చుకెళ్లిన ఘటనలో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ప్రమాద సమయంలో యువతి ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనంపై మరో యువతి ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటనపై దర్యాప్తును ముమ్మరం చేసిన దిల్లీ పోలీసులు... ఆరోజు రాత్రి ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీలను జల్లెడ పడుతున్నారు. మరోవైపు, ప్రమాద సమయంలో మద్యం సేవించినట్లు నిందితులు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు.

కొత్త ఏడాది రోజు తెల్లవారుజామున దిల్లీలో జరిగిన అమానవీయ ఘటనలో పోలీసులు శరవేగంగా దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాద సమయంలో ద్విచక్రవాహనంపై.. చనిపోయిన యువతితోపాటు మరో యువతి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. కారు ఢీకొట్టిన ఘటనలో ఆమెకు స్వల్ప గాయాలు కాగా అక్కడి నుంచి వెళ్లిపోయి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి ఆప్రాంతంలోని సీసీటీవీలను పరిశీలిస్తుండగా... ఈ విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆ యువతిని వెతికేపనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఘటనకు ముందు వారిద్దరూ స్కూటీపై వెళ్తున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డయ్యాయి. ఆ ఘటనపై ఆమెను ప్రశ్నిస్తే కేసులో పురోగతి సాధించేందుకు పోలీసులకు కీలక విషయాలు వెల్లడి కానున్నాయి.

ఆదివారం రోజున తెల్లవారుజామున స్కూటీపై వెళ్తున్న యువతిని ఢీకొట్టిన కారు.. దాదాపు 13 కిలోమీటర్లు ఆమెను ఈడ్చుకెళ్లింది. కారు టైరులో యువతి కాలు ఇరుక్కుపోవడంతో ఆమెను లాక్కెళ్లినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటన సమయంలో మద్యం సేవించి ఉన్నట్లు నిందితులు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. మహిళను ఢీకొట్టిన తర్వాత భయంతో పారిపోయినట్లు చెప్పారని తెలిపారు. కారు టైరులో ఏదో ఇరుక్కుపోయినట్లు నిందితుల్లో ఒకరు మిగితా వారికి చెప్పగా... వారు దాన్ని పట్టించుకోలేదని విచారణలో వెల్లడైంది. కాంజావాలా ప్రాంతంలో కారు మలుపు తీసుకుంటుండగా... యువతి చేయి కనిపించినట్లు తెలిపిన నిందితులు... కారును ఆపినట్లు తెలిపారు. తర్వాత కారు నుంచి యువతి మృతదేహం వేరు కాగానే అక్కడి నుంచి పరారైనట్లు పోలీసులకు వివరించారు.

కాగా, స్కూటీపై వెళ్లే ముందు యువతులు ఇద్దరూ వాదించుకున్నారని హోటల్ యజమాని తెలిపాడు. ఘటనకు ముందు ఇదే హోటల్ నుంచి ఇరువురూ బయల్దేరారు. ఘర్షణ పడొద్దని తాము వారించామని యజమాని చెప్పుకొచ్చాడు. అయినప్పటికీ ఇద్దరూ వారించుకున్నారని పేర్కొన్నాడు.

ఈ ఘటనకు సంబంధించి మెుత్తం ఐదుగురు నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. వారిపై నిర్లక్ష్యం, ర్యాష్‌ డ్రైవింగ్ కింద కేసులు నమోదు చేశారు. మరోవైపు, యువతి శవపరీక్ష నివేదిక ఇంకా రావాల్సి ఉంది. అటు... యువతిపై అత్యాచారం జరిగి ఉంటుందని ఆమె కుటుంబసభ్యులు ఆరోపించగా... అలాంటి ఆధారాలేవీ లభించలేదని పోలీసులు స్పష్టం చేశారు.

ఇవీ చదవండి:

జనవరి 31 నుంచి బడ్జెట్‌ సమావేశాలు.. తొలిరోజే రాష్ట్రపతి ప్రసంగం!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరు వాహనాలు ఢీ.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి

Last Updated :Jan 3, 2023, 12:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.