ETV Bharat / bharat

అఫ్గాన్​పై 'దిల్లీ డిక్లరేషన్​'- ఉగ్రవాదాన్ని తరిమికొట్టాలని పిలుపు

author img

By

Published : Nov 11, 2021, 6:56 AM IST

అఫ్గానిస్థాన్ సంక్షోభంపై చర్చించేందుకు దిల్లీ వేదికగా జరిగిన (India meeting on Afghanistan) సమావేశం అంచనాలకు మించి జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి హాజరైన వివిధ దేశాల భద్రతాధికారులు సుస్థిర, శాంతియుతమైన అఫ్గానిస్థాన్​కు మద్దతు ప్రకటించినట్లు పేర్కొన్నాయి. అఫ్గాన్​లో ఉగ్రకార్యకలాపాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చినట్లు వెల్లడించాయి.

Delhi Regional Security Dialogue on Afghanistan exceeded expectations: Sources
దిల్లీ వేదికగా మక్త కంఠంతో అఫ్గాన్​లో శాంతి స్థాపనకు పిలుపు

ఉగ్రవాద కార్యకలాపాలకు అఫ్గానిస్థాన్‌ స్థావరంగా మారకూడదని భారత్‌ సహా ఎనిమిది దేశాలు బుధవారం సంయుక్తంగా వెలువరించిన 'దిల్లీ డిక్లరేషన్‌' స్పష్టం చేసింది. అఫ్గాన్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటవ్వాలని, అందులో మైనార్టీ తెగలకు ప్రాతినిధ్యం కల్పించాలని పేర్కొంది. మాదక ద్రవ్యాల రవాణాను అడ్డుకోవాలని పిలుపునిచ్చింది.

అఫ్గాన్‌ ప్రస్తుత పరిస్థితులపై భారత్‌ అధ్యక్షతన బుధవారం దిల్లీలో జాతీయ భద్రతా సలహాదారుల ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఇందులో రష్యా, ఇరాన్‌, మధ్యాసియా దేశాలైన తజకిస్థాన్‌, తుర్క్‌మెనిస్థాన్‌, కజకస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ పాల్గొన్నాయి. పాకిస్థాన్‌, చైనాలనూ భారత్‌ ఆహ్వానించింది. కానీ ఆ రెండు దేశాలు హాజరుకాకూడదని నిర్ణయించుకున్నాయి. సమావేశానికి భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ అధ్యక్షత వహించారు. ప్రారంభోపన్యాసంలో డోభాల్‌.. అఫ్గాన్‌ సుస్థిరత ఈ ప్రాంతానికి చాలా కీలకమని పేర్కొన్నారు. తర్వాత ఇతర ప్రతినిధులు మాట్లాడారు. సమావేశానంతరం డోభాల్‌తో పాటు ఏడు దేశాల ప్రతినిధులు.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిశారు. ఈ సందర్భంగా ప్రధాని నాలుగు సూచనలు చేశారు. కాబుల్‌లో సమ్మిళిత ప్రభుత్వం ఏర్పాటు చేయాలని, ఆ దేశ భూభాగాన్ని తీవ్రవాదులు ఉపయోగించుకోకుండా చూడాలన్నారు. డ్రగ్స్‌, అక్రమ ఆయుధాల సరఫరాను నిరోధించే వ్యూహాన్ని రూపొందించాలని తెలిపారు. అదే సమయంలో అఫ్గాన్‌లో నెలకొన్న మానవతా సంక్షోభంపైనా దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.

డిక్లరేషన్‌ ఏం చెప్పిందంటే..

  • ఉగ్ర కార్యకలాపాలకు అఫ్గాన్‌ కేంద్రం కాకూడదు. ఉగ్ర శిక్షణ, ఆశ్రయం కల్పించడం, దాడులకు కుట్రలు, ఆర్థిక సహాయం సహా ఎలాంటి కార్యకలాపాలు అక్కడ చేపట్టకూడదు.
  • శాంతియుత, సురక్షిత, సుస్థిర అఫ్గాన్‌కు మద్దతు ఇస్తాం. ఆ దేశ సార్వభౌమత్వం, సమగ్రతను గౌరవిస్తాం. ఆ దేశ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోం.
  • ఈ సంక్షోభ పరిష్కారంలో ఐరాసది కీలక పాత్ర. అఫ్గాన్‌లో ఐరాస విభాగాలు తమ కార్యకలాపాలు కొనసాగించేలా చూడాలి.
  • అఫ్గాన్‌ ప్రజలకు వివక్ష లేకుండా మానవతా సహాయాన్ని అందించాలి.
  • కుందుజ్‌, కాందహార్‌, కాబుల్‌లో ఉగ్రదాడులను ఖండిస్తున్నాం. మహిళలు, చిన్నారులు, మైనార్టీ తెగల ప్రాథమిక హక్కులను కాపాడాలి.

భారత్‌తో ఇలా.. పాక్‌తో అలా! చైనా రెండు నాల్కల ధోరణి

అఫ్గాన్‌పై 2018 నుంచి జాతీయ భద్రతా సలహాదారుల స్థాయిలో సమావేశాలు జరుగుతున్నాయి. తొలి రెండు సమావేశాలకు ఇరాన్‌ ఆతిథ్యమిచ్చింది. వీటిలో పాకిస్థాన్‌ పాల్గొనలేదు. చైనా మాత్రం హాజరవుతూ వచ్చింది. ఈ సారి భారత్‌లో జరిగిన సమావేశానికి మాత్రం చైనా కుంటి సాకుతో తప్పించుకుంది. షెడ్యూలింగ్‌ సమస్యలతోనే హాజరుకావడం లేదని పేర్కొంది. అయితే పాక్‌కు మద్దతుగానే చైనా ఈ నిర్ణయం తీసుకుందని.. అఫ్గాన్‌ ప్రజలకు అండగా నిలుస్తున్న భారత్‌ను అడ్డుకోవాలన్నదే ఈ రెండు దేశాల వ్యూహమని నిపుణులు చెబుతున్నారు. అదే సమయంలో అఫ్గాన్‌పై అమెరికా, రష్యాలతో పాకిస్థాన్‌ గురువారం ఏర్పాటు చేస్తున్న సమావేశానికి మాత్రం చైనా పచ్చజెండా ఊపింది. ఆ సమావేశానికి హాజరుకానున్నట్లు చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్‌ వెన్‌బిన్‌ పేర్కొన్నారు.

ఇదీ చూడండి: 'సుస్థిర అఫ్గాన్​కు మద్దతిస్తాం.. ఉగ్ర కార్యకలాపాలను సహించం!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.