'సైరస్ మిస్త్రీ రోడ్డు ప్రమాదానికి కారణాలు అవే'.. గడ్కరీ కీలక వ్యాఖ్యలు

author img

By

Published : Sep 6, 2022, 8:35 AM IST

Cyrus Mistry car accident

Cyrus Mistry Car Accident: ప్రముఖ పారిశ్రామిక వేత్త​ సైరస్​ మిస్త్రీ.. కారు రోడ్డు ప్రమాదానికి గురవ్వడానికి మితిమీరిన వేగం, డ్రైవర్ నిర్ణయ లోపమే కారణమని పోలీసులు తెలిపారు. దుర్ఘటన జరిగే సమయంలో వెనుక సీట్లో ఉన్న మిస్త్రీ, జహంగీర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదని పేర్కొన్నారు. మరోవైపు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. నైపుణ్యంలేని డ్రైవర్లు అధునాతన కార్లు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు.

Cyrus Mistry Car Accident: టాటా సన్స్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీని బలిగొన్న రోడ్డు ప్రమాదానికి మితిమీరిన వేగం, వాహన చోదకురాలి నిర్ణయ లోపమే కారణమని ప్రాథమికంగా వెల్లడైనట్లు పోలీసులు సోమవారం తెలిపారు. దుర్ఘటన జరిగే సమయంలో వెనుక సీట్లో ఉన్న మిస్త్రీ, జహంగీర్‌ సీటు బెల్టు పెట్టుకోలేదని పేర్కొన్నారు. సైరస్‌, ప్రముఖ గైనకాలజిస్టు అనాహితా పండోల్‌, ఆమె భర్త డేరియస్‌ పండోల్‌, ఆయన సోదరుడు జహంగీర్‌ పండోల్‌లు ఆదివారం కారులో అహ్మదాబాద్‌ నుంచి ముంబయి వస్తున్న సమయంలో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అప్పుడు కారును అనాహితా నడుపుతున్నారు. మధ్యాహ్నం 2.21 గంటలకు ఈ వాహనం చరోటి చెక్‌పోస్ట్‌ను దాటిందని సీసీటీవీ కెమెరాలను పరిశీలించిన పోలీసులు తెలిపారు. అక్కడి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న వంతెన వద్దకు 9 నిమిషాల్లోనే దూసుకెళ్లిందని పేర్కొన్నారు.

ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అనాహితా (55), ఆమె భర్త డేరియస్‌ (60)లను సోమవారం ఉదయం ముంబయిలోని సర్‌ హెచ్‌.ఎన్‌.రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఆసుపత్రికి తరలించారు. ఆమె తుంటి, దవడ ఎముకలు విరిగాయని డాక్టర్లు తెలిపారు. సైరస్‌, జహంగీర్‌ల మృతదేహాలకు సోమవారం తెల్లవారుజామున ముంబయిలోని జె.జె.ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించారు. సైరస్‌ తలకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఆయన పార్థివ దేహానికి మంగళవారం ఉదయం 11 గంటలకు వర్లీలో అంత్యక్రియలు జరుగుతాయి.

కొన్ని రోడ్డు ప్రమాదాలకు తప్పుడు ప్రణాళికలే కారణం: గడ్కరీ
సైరస్‌ మిస్త్రీని రోడ్డు ప్రమాదం బలిగొన్న నేపథ్యంలో కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని రోడ్డు ప్రమాదాలకు ఆయా సంస్థలు రూపొందించే తప్పుడు ప్రాజెక్టు నివేదికలే కారణమన్నారు. హైవేలు, ఇతర రోడ్ల నిర్మాణానికి సంబంధించిన సవివర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్‌)లు తయారు చేసేందుకు వీలుగా కంపెనీలకు శిక్షణ అవసరమన్నారు. నైపుణ్యంలేని డ్రైవర్‌ చేతిలో అధునాతన కార్లు కూడా సమస్యలు సృష్టిస్తాయని తెలిపారు. కొన్ని రాష్ట్రాల్లో రోడ్ల నిర్మాణంలో నాణ్యత పాటించడం లేదన్నారు.

ఇవీ చదవండి: హాయిగా నిద్రపోయి రూ.5 లక్షలు సంపాదించిన మహిళ

'నన్ను ఇరికించాలని చూశారు.. ఆ ఒత్తిడితోనే సీబీఐ అధికారి సూసైడ్​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.