ETV Bharat / bharat

Delta Plus: కరోనాలో కొత్త వేరియంట్​!

author img

By

Published : Jun 15, 2021, 6:37 AM IST

కొవిడ్‌-19 కారక సార్స్‌-కోవ్‌-2 వైరస్‌కు సంబంధించిన డెల్టా వేరియంట్‌ కొత్త అవతారమెత్తింది. ఇది మరోసారి ఉత్పరివర్తన చెంది, 'డెల్టా ప్లస్‌' పేరుతో కొత్త రూపాన్ని సంతరించుకుంది. దీనిపై ప్రస్తుతానికి ఆందోళన అవసరం లేదని శాస్త్రవేత్తలు భరోసా ఇచ్చారు. భారత్‌లో దీని ఉనికి చాలా తక్కువగానే ఉందని తెలిపారు.

delta plus
డెల్టా ప్లస్‌

కరోనా నుంచి బి.1.617.2 అనే రకం తొలుత భారత్‌లో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. దీన్ని 'డెల్టా'(Delta variant) రకంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) పిలుస్తోంది. దేశంలో ప్రస్తుతం సాగుతున్న కొవిడ్‌ రెండో విజృంభణకు ఇదే ప్రధాన కారణం. 'డెల్టా'లో కె417ఎన్‌ అనే ఉత్పరివర్తన కారణంగా కొత్త వేరియంట్‌(Delta plus variant covid) పుట్టుకొచ్చింది. దీన్ని బి.1.617.2.1 అని కూడా పిలుస్తున్నారు. వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌లో ఈ ఉత్పరివర్తన వచ్చిందని దిల్లీలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ జీనోమిక్స్‌ అండ్‌ ఇంటిగ్రేటివ్‌ బయాలజీ (ఐజీఐబీ) శాస్త్రవేత్త వినోద్‌ స్కారియా చెప్పారు. మానవ కణాల్లోకి ప్రవేశించడానికి ఈ ప్రొటీన్‌నే వైరస్‌ ఉపయోగించుకుంటుంది.

అందుబాటులో లేని డేటా..

ప్రపంచవ్యాప్తంగా 62 మంది కొవిడ్‌ బాధితుల నమూనాల్లో 'డెల్టా ప్లస్‌' వెలుగు చూసిందని 'పబ్లిక్‌ హెల్త్‌ ఇంగ్లండ్‌' సంస్థ తెలిపింది. ఈ నెల 7 నాటికి భారత్‌కు చెందిన ఏడు నమూనాల్లో ఇది కనిపించిందని పేర్కొంది. "ప్రస్తుతం ఇది భారత్‌లో పెద్దగా కనిపించడంలేదు. ఐరోపా, ఆసియా, అమెరికాల్లో ఎక్కువగా వెలుగుచూసింది" అని వినోద్‌ చెప్పారు. తొలిసారిగా ఈ ఏడాది మార్చిలో ఇది ఐరోపాలో కనిపించిందన్నారు. దీని తీరుతెన్నులపై నిర్దిష్ట అంచనాలకు రావడానికి ఈ వేరియంట్‌కు సంబంధించిన 'ప్రయాణ చరిత్ర' ఇంకా అందుబాటులోకి రాలేదని తెలిపారు. అయితే కాసిరివిమాబ్‌, ఇమ్డెవిమాబ్‌ మోనోక్లోనల్‌ యాంటీబాడీలను ఇది తట్టుకుంటోందనడానికి ఆధారాలు ఉన్నాయని, ఈ అంశంపై ఎక్కువగా దృష్టిసారించాలని కోరారు. ఈ కాక్‌టెయిల్‌కు ఇటీవల కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ ఆమోదం తెలిపింది. ఒక్కో డోసు ధర దాదాపు రూ.60వేలుగా ఉంది. ఈ మోనోక్లోనల్‌ యాంటీబాడీలను కృత్రిమంగా ల్యాబ్‌లో తయారుచేస్తారు. వైరస్‌ నుంచి శరీరాన్ని రక్షించడానికి ఉత్పత్తయ్యే సహజసిద్ధ యాంటీ బాడీలను ఇవి పోలి ఉంటాయి. కరోనా వైరస్‌లోని స్పైక్‌ ప్రొటీన్‌ను లక్ష్యంగా చేసుకొనేలా వీటిని తీర్చిదిద్దారు. మరోవైపు మన రోగనిరోధక స్పందన నుంచి తప్పించుకోవడానికి వైరస్‌లో ఉండే ఒక వ్యవస్థతో ఈ ఉత్పరివర్తనకు సంబంధం ఉండొచ్చని స్కారియా అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: 'ఆల్ఫాతో పోలిస్తే డెల్టా వేరియంట్​తో అధిక ముప్పు'

ఇదీ చదవండి: ఆ రకం వైరస్​తో మూడో దశ ముప్పు!

భయాలు వద్దు

డెల్టా ప్లస్‌పై వ్యక్తమవుతున్న భయాలను ప్రముఖ ఇమ్యునాలజిస్టు వినీతా బాల్‌ కొట్టిపారేశారు. అయితే యాంటీబాడీ కాక్‌టెయిల్‌ను ఎదుర్కొనే సామర్థ్యం దీనికి ఉండటం కొంత ఇబ్బందికరమేనని చెప్పారు. దీని ఆధారంగా ఈ వేరియంట్‌ ఉద్ధృతంగా వ్యాపిస్తుందని గానీ, తీవ్ర వ్యాధి కలిగిస్తుందని గానీ నిర్ధరించలేమన్నారు. ఇది సోకినవారిలో వెలువడే యాంటీబాడీలు.. పరిమాణం, నాణ్యతపరంగా ఏ మాత్రం తక్కువగా ఉండబోవని చెప్పారు. అందువల్ల డెల్టా ప్లస్‌ బారినపడినవారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇది గణనీయ స్థాయిలో మన రోగనిరోధక వ్యవస్థను తప్పించుకుంటుందా అన్నది తేల్చేందుకు.. పూర్తిస్థాయిలో టీకా పొందిన వ్యక్తుల నుంచి ప్లాస్మాను సేకరించి, పరీక్షించాల్సి ఉంటుందని మరో శాస్త్రవేత్త అనురాగ్‌ అగర్వాల్‌ చెప్పారు.

ఇవీ చదవండి: ఐరోపాకు 'డెల్టా వేరియంట్' ముప్పు

చైనాలో డెల్టా వేరియంట్​- డ్రోన్లతో ప్రజల కట్టడి

'భారత్​లో కరోనా డెల్టా వేరియంట్ వ్యాప్తి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.