ETV Bharat / bharat

జూన్‌ నాటికి రోజుకు 2,320 కరోనా మరణాలు!

author img

By

Published : Apr 16, 2021, 2:55 PM IST

భారత్​లో కరోనా 2.0 శరవేగంగా విజృంభిస్తోంది. గత మూడు రోజులుగా రోజుకు సగటున వెయ్యి మందినిపైగా కొవిడ్​ బలితీసుకుంటోంది. అయితే.. రాబోయే రోజుల్లో ఇది మరింత ఉద్ధృతమయ్యే అవకాశముందని లాన్సెట్​ కొవిడ్​-19 కమిషన్​ తెలిపింది. ఈ మేరకు కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు పాటించాల్సిన చర్యలను అందులో పొందుపర్చింది.

Covid-19 deaths
కరోనా మరణాలు మరింత ఉద్ధృతమయ్యే అవకాశం

దేశంలో కరోనా వైరస్ ఉద్ధృతి తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మూడు రోజులుగా వెయ్యికి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ రెండో దశలో రోజుకు 1,750 మంది మృతి చెందే ప్రమాదం పొంచి ఉందని, జూన్ మొదటి వారం నాటికి ఆ సంఖ్య 2,320కి చేరుకోవచ్చని లాన్సెట్ కొవిడ్-19 కమిషన్ వెల్లడించింది. 'మేనేజింగ్ ఇండియాస్ కొవిడ్-19 వేవ్: అర్జెంట్ స్టెప్స్' శీర్షికన ఓ నివేదిక వెలువడింది. కరోనా విస్తృతికి అడ్డుకట్ట వేసే చర్యలను అందులో ప్రస్తావించింది.

కొవిడ్ రెండో దశ.. కొన్ని ప్రాంతాలకే పరిమితం

కరోనా రెండు దశల్లో కూడా భౌగోళికంగా సామీప్యతను కలిగి ఉన్నప్పటికీ.. టైర్‌ 2, టైర్‌ 3 నగరాల్లోనే తీవ్రత అధికంగా ఉందని ఆ నివేదిక ప్రాథమికంగా విశ్లేషించింది. అలాగే కొవిడ్ విజృంభించిన మొదటి 50 శాతం జిల్లాల సంఖ్య గతేడాది 40కి పైగా ఉండగా.. ఇప్పుడు 20కి పడిపోయాయి. కరోనా కేసుల పరంగా 75 శాతం వాటా ఉన్న జిల్లాల సంఖ్య కూడా 60-100 నుంచి 20-40కి పడిపోయినట్లు వెల్లడించింది.

వేగంగా విస్తరిస్తున్న రెండో దశ..

రెండో దశలో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ ప్రారంభానికి (దాదాపు 40 రోజుల్లో) రోజువారీ కొత్తకేసులు పదివేల నుంచి 80 వేలకు పెరిగాయి. అదే గతేడాది దీనికి 83 రోజులు పట్టింది. అయితే, ఈ దశలో కొవిడ్ బారిన పడిన వారిలో లక్షణాలు లేకపోవడం లేదా స్వల్ప స్థాయి లక్షణాలు ఉండటం కనిపిస్తోందని తెలిపింది. దాంతో ఆసుపత్రిలో చేరేవారి సంఖ్య, మరణాలు తక్కువగా ఉన్నాయని విశ్లేషించింది.

ఇదీ చదవండి: కరోనాతో ముందే ముగియనున్న కుంభమేళా!

పెరగనున్న మరణాలు!

గతేడాది మార్చిలో కరోనా విజృంభణ ప్రారంభమైంది. ఆ దశలో మరణాల రేటు 1.3 శాతంగా ఉంది. రెండో దశలో మాత్రం అది 0.87 శాతంగానే ఉండటం సానుకూలాంశం. ఏప్రిల్ 10 నాటికి మరణాల వారం రోజుల సగటు 664గా ఉంది. భారీగా నమోదవుతున్న కేసుల కారణంగా సాధారణ వైద్య సేవలకు ఆటంకం కలుగుతోంది. ఇవి మరిన్ని తీవ్ర పరిణామాలకు దారితీసే ప్రమాదం ఉంది. అలాగే పరీక్షలు, వైద్య సేవల నిమిత్తం దేశంపై ఆర్థికంగా భారం పడుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి పరీక్షల కోసం 7.8, వైద్య సదుపాయాల కోసం 1.7 బిలియన్‌ డాలర్లు వ్యయమవుతాయని ఆ నివేదిక లెక్కగట్టింది.

వీటిని పాటిస్తే..

  • ఏప్రిల్ 11, 2021 నాటికి 45 ఏళ్లు పైబడిన 29.6 శాతం మందికి కేంద్రం టీకా డోసులు పంపిణీ చేసిందని నివేదిక పేర్కొంది. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న 45 ఏళ్ల లోపువారికి కూడా టీకాలు అందించాలని సూచించింది.
  • ప్రస్తుతం దేశవ్యాప్తంగా నడుస్తున్న టీకా కార్యక్రమం కింద కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలను మాత్రమే వాడుతున్నారు. తక్కువ సమయంలో మరింత మందికి టీకాలు అందించేందుకు విదేశాల్లో ఇప్పటికే వినియోగంలో ఉన్న మోడెర్నా, ఫైజర్, జాన్సన్‌ అండ్ జాన్సన్ టీకాలను ఆమోదించాలని సూచించింది. అలాగే టీకా తయారీని పెంచాలని తెలిపింది.

ఇదీ చదవండి: కరోనా భయాలు- ఆ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.