ETV Bharat / bharat

Chhattisgarh Assembly Election 2023 : ఛత్తీస్​గఢ్​లో మళ్లీ కాంగ్రెస్​ వైపే గాలి! బీజేపీ అద్భుతం చేస్తుందా?

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 12:55 PM IST

Updated : Oct 9, 2023, 3:02 PM IST

Chhattisgarh Assembly Election 2023 : ఛత్తీస్​గఢ్​ అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ ఏడాది నవంబర్ 7, 17 తేదీల్లో రెండు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడుతాయి.

chhattisgarh assembly election 2023
chhattisgarh assembly election 2023

Chhattisgarh Assembly Election 2023 : దేశంలో సార్వత్రిక ఎన్నికల సెమీ ఫైనల్​కు నగారా మోగింది. తర్వలో జరగనున్న ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. ఛత్తీస్​గఢ్​లో ఈ ఏడాది నవంబర్​ 7, 17 తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్​ 3న ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో 15 ఏళ్లు ప్రతిపక్షంలో ఉండి సాధించుకున్న అధికారాన్ని మరోసారి నిలబెట్టుకోడానికి కాంగ్రెస్ ఊవిళ్లూరుతోంది. మరోవైపు అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. అయితే ఈసారి కాంగ్రెస్ పట్టు నిలబెట్టుకుంటుందా? బీజేపీ గాడిన పడుతుందా? ఛత్తీస్​గఢ్​లో రాజకీయ పరిస్థితేంటి? 2018 ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లు గెలిచారు వంటి వివరాలు మీకోసం.

ఛత్తీస్​గఢ్ ఎన్నికల షెడ్యూల్

  • తొలి విడత పోలింగ్ తేదీ : నవంబర్ 7
  • రెండో విడత పోలింగ్ తేదీ : నవంబర్ 17
  • ఫలితాల తేదీ: డిసెంబర్ 3
  • మొత్తం ఓటర్లు: 2.03 కోట్లు

2018 ఛత్తీస్​గఢ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (90 సీట్లు)

  • ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (INC) - 68
  • భారతీయ జనతా పార్టీ (BJP) - 15
  • జనతా కాంగ్రెస్ ఛత్తీస్‌గఢ్ (JCC) - 5
  • బహుజన్ సమాజ్ పార్టీ (BSP) - 2

2018లో జరిగిన ఛత్తీస్​గఢ్​ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘటన విజయం సాధించింది. 90 సీట్లుకు గాను 68 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రతిపక్షాల్లో బీజేపీ 15, బీఎస్​పీ 2, జనతా కాంగ్రెస్ 5 చొప్పున గెలుచుకున్నాయి. ప్రస్తుత భూపేశ్​ బఘేల్ ప్రభుత్వం 2024 జనవరి 3 వరకు కొనసాగనుంది.

Chhattisgarh Assembly Election 2023
ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్

మళ్లీ కాంగ్రెస్​ వైపే గాలి!.. బీజేపీలో అద్భుతం జరగాలి!
ఇక్కడ ప్రస్తుతం కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ బలమైన నేతగా ఉన్నారు. ఒకవైపు అధిష్ఠానానికి విశ్వాసంగా ఉంటూనే మరోవైపు స్థానికంగా పార్టీని బలంగా నిలబెట్టుకొని, ప్రాంతీయ పార్టీ నేత తరహాలో పని చేసుకుంటూ వెళ్తున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలు, రైతులపై దృష్టిపెట్టి పనిచేయడం ద్వారా మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కర్ణాటక ఫలితాలు ఇక్కడ పార్టీ నాయకత్వానికి మంచి ఊపునిచ్చాయనడంలో సందేహం లేదు. ఇటీవల ఛత్తీస్‌గడ్‌ బీజేపీ ముఖ్యనేత, ఎస్టీల్లో పేరెన్నికగన్న మాజీ ఎంపీ నందకుమార్‌సాయిని కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారు. తద్వారా ఎస్టీ సామాజికవర్గంలో పార్టీని బలంగా తీసుకొళ్లే వ్యూహం అమలు చేశారు. అయితే కాంగ్రెస్​ ఈ సారి అధికారం నిలబెట్టుకున్నా.. సీట్లు తగ్గే అవకాశముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు 15 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన రమణ్‌ సింగ్‌ను వచ్చే ఎన్నికల్లో సీఎం అభ్యర్థిగా ప్రకటించాలా వద్దా అనే సంశయంలో బీజేపీ ఉంది. ఎన్నికల ముందు భూపేశ్ బఘేల్‌ను ఢీకొనే కొత్త నాయకత్వం తయారు చేసుకోవడం బీజేపీ నాయకత్వానికి పెద్ద సవాల్‌గా మారింది. ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్థిగా బీజేపీ.. రమణ్​ సింగ్​ను ప్రకటించినా.. కాంగ్రెస్ తరఫున సీఎం రేసులో బఘేల్ ముందున్నారని నిపుణులు అంచనా వేస్తున్నారు. బీజేపీ గెలవాలంటే ఏదైనా అద్భుతం జరగాలని అభిప్రాయపడుతున్నారు. అయితే బీజేపీ మాత్రం అధికారం కోసం గట్టిగా ప్రయత్నిస్తోంది. ఇప్పటికే 21 మంది అభ్యర్థులతో తొలి జాబితాను ప్రకటించింది.

తాము అమలు చేసిన ప్రభుత్వ పథకాల ద్వారా మళ్లీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్​ ప్రయత్నిస్తోంది. మరో వైపు అవినీతి ఆరోపణలు, మత మార్పిడులు, హామీలు నెరవేర్చకపోవడం వంటి అస్త్రాలను సంధిస్తూ కాంగ్రెస్​ను గద్దె దించాలని బీజేపీ బావిస్తోంది. ఛత్తీస్​గఢ్ ఎన్నికలను ప్రభావితం చేయనున్న అంశాలు ఇవే..

  1. అవినీతి ఆరోపణలు :
    బొగ్గు గునులు, ఆవు పేడ సేకరణ పథకం, డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్, పబ్లిక్ సర్వీస్​ కమిషన్​లో అవినీతికి పాల్పడిందని ఆరోపణలు ఎదుర్కొంటోంది కాంగ్రెస్ ప్రభుత్వం. వీటికి సంబంధించిన కేసుల్లో ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్​ దర్యాప్తు చేస్తోంది. ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, అమిత్​ షా వంటి బీజేపీ అగ్రనేతలు ఈ అస్త్రాలను ఎక్కుపెట్టి భగేల్​ సర్కార్​ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఛత్తీస్​గఢ్​కు కాంగ్రెస్​కు ఏటీఎంగా మారిందని ఆరోపించారు. దీనికి దీటుగా.. కేంద్ర ప్రభుత్వం తన ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపించారు.
  2. రైతు పథకాలు :
    కాంగ్రెస్ సర్కార్​ రైతుల కోసం రాజీవ్​ గాంధీ కిసాన్ న్యాయ్​ యోజన, గోధన్ న్యాయ యోజన (ఆవు-పేడ సేకరణ పథకం), రాజీవ్ గాంధీ గ్రామీణ భూమిహిన్ కృషి మజ్దూర్ కృషి న్యాయ్ యోజన పథకాలను తీసుకొచ్చింది. ఈ పథకాల ద్వారా కాంగ్రెస్​కు ఉన్న సానుకూలత.. బీజేపీకి సవాలుగా మారనుంది.
  3. ఉప జాతీయవాదం :
    ఈ ఐదేళ్ల కాలంలో ఉపజాతీయవాద భావాన్ని సీఎం భూపేశ్​ భగేల్​ ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందులో భాగంగా ఛత్తీస్​గఢ్​ ప్రాంతీయ సాంస్కృతిక, సంప్రదాయాలను పెంపొందించడానికి కృషి చేశారు. దీనివల్ల ప్రజల్లో పెరిగిన ప్రాంతీయ భావం కాంగ్రెస్​కు ఉపయోగపడవచ్చు.
  4. మత మార్పిడి :
    గత రెండేళ్లలో గిరిజనులు అధికంగా ఉండే ప్రాంతాలు, ముఖ్యంగా బస్తర్ డివిజన్ నుంచి మత మార్పిడిపై అనేక ఘర్షణలు జరిగాయి. క్రైస్తవ మతంలోకి మారిన గిరిజనులు, మారని వారి మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. అయితే మత మార్పిడులకు పాల్పడిన వారిని ప్రభుత్వం కాపాడుతోందని బీజేపీ ఆరోపించింది. ఇది కాంగ్రెస్​కు కొంత ప్రతికూల అంశమే.
  5. మత హింస :
    2021లో కబీర్‌ధామ్ జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్‌లో బెమెతర జిల్లాలో మత హింస జరిగింది. దీనిపై అధికార ప్రతిపక్షాలు ఆరోపించుకున్నాయి. అయితే ఈ ఘటనలు ఓటర్లను ప్రభావితం చేయవచ్చు.
  6. మద్య నిషేధం :
    మద్యాన్ని నిషేధిస్తామనే కీలక ఎన్నికల వాగ్దానాన్ని నెరవేర్చని భగేల్ ప్రభుత్వాన్ని బీజేపీ లక్ష్యంగా చేసుకుంది. 2018లో కాంగ్రెస్‌కు మహిళా ఓట్లు రావడానికి ఈ హామీ దోహదపడిందని భావిస్తున్నారు.
  7. ఉద్యోగుల క్రమబద్ధీకరణ :
    గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చి మరో కీలక హామీ కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ. ఇది దాదాపు 1.5 లక్షల మంది ఉద్యోగులను ప్రభావితం చేసింది. దీన్ని కూడా బీజేపీ అస్త్రంగా మార్చుకుంది.
  8. OBC రిజర్వేషన్ :
    రాష్ట్ర జనాభాలో 52 శాతం ఉన్న ఇతర వెనుకబడిన తరగతులు (OBCలు) 27 శాతం రిజర్వేషన్ కోటా డిమాండ్ చేస్తున్నారు. సాహు, కుర్మీ, యాదవ్ అనే మూడు ప్రముఖ OBC కమ్యూనిటీలు 2018 ఎన్నికలలో ఎక్కువగా కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాయి. ఈ కోటాను 58 శాతానికి పెంచుతూ బీజేపీ ప్రభుత్వం 2012లో జారీ చేసిన ఉత్తర్వులను ఛత్తీస్‌గఢ్ హైకోర్టు గత ఏడాది పక్కన పెట్టింది. ప్రస్తుతం ఈ కాంగ్రెస్​కు ఆందోళనకరంగా మారింది
  9. మౌలిక సదుపాయాలు :
    గత ఐదేళ్లలో రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఆగిపోయిందని, రోడ్ల పరిస్థితి దారుణంగా ఉందని బీజేపీ ఆరోపిస్తోంది.
  10. కేంద్ర పథకాలు :
    కేంద్రంలోని ప్రధాన మంత్రి ఆవాస్ యోజనను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, జల్ జీవన్ మిషన్‌ను సక్రమంగా అమలు చేయడం లేదని బీజేపీ ఆరోపనలు చేసింది.

'శాసనసభ ఎన్నికల్లో బీఎస్​పీ ఒంటరి పోరు!'

'బజరంగ్​ దళ్​ నిషేధంపై వెనక్కి తగ్గేదే లే.. ఛత్తీస్​గఢ్​లో కూడా..'

Last Updated : Oct 9, 2023, 3:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.