ETV Bharat / bharat

Chandrababu Quash Petition Hearing on SC: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా వేసిన సుప్రీంకోర్టు

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 3, 2023, 2:09 PM IST

Updated : Oct 3, 2023, 7:32 PM IST

Chandrababu Quash Petition Hearing on SC: స్కిల్‌ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 9కి వాయిదా వేసింది. అప్పటిలోపు.. చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌కు సంబంధించి.. ఏపీ హైకోర్టుకు సీఐడీ సమర్పించిన డాక్యుమెంట్లన్నీ తమ ముందు పెట్టాలని.. ఆంధప్రదేశ్‌ ప్రభుత్వాన్ని ఆదేశించింది. స్కిల్‌ డెవలప్మెంట్ కేసు దర్యాప్తు 2018లోనే ప్రారంభమైనట్లు చెప్పేందుకు తగిన ఆధారాలు హైకోర్టు తీర్పులో లేవన్న సుప్రీంకోర్టు.. అందుకు సంబంధించిన స్పష్టత కావాలని పేర్కొంది. అవినీతి నిరోధక చట్టం 17A వచ్చిన తర్వాతే.. ఈ కేసులో FIR నమోదైందని సర్వోన్నత ధర్మాసనం అభిప్రాయపడింది.

Chandrababu Quash Petition Hearing on SC
Chandrababu Quash Petition Hearing on SC

Chandrababu Quash Petition Hearing on SC: అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A ప్రకారం గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా తనపై స్కిల్ డెవలప్మెంట్ కేసులో నమోదు చేసిన FIRను కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌ పై విచారణను సుప్రీంకోర్టు విచారణ జరిపింది. ఈ కేసుకు సంబంధించి.. హైకోర్టులో దాఖలు చేసిన పత్రాలన్నింటినీ సమర్పించాలని జస్టిస్ అనిరుద్ద బోస్‌, జస్టిస్‌ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణ వాయిదా వేసింది. ఈ కేసులో 2018లో 17A సెక్షన్ అమల్లోకి రాక ముందే విచారణ ప్రారంభమైందని, అందుకు సంబంధించి ఏసీబీ డీజీ మోమో జారీ చేశారని చెబుతూ హైకోర్టులో డాక్యుమెంట్ దాఖలు చేశారా? అని ప్రశ్నించింది. ఆ డాక్యుమెంట్‌ కీలకం కాబట్టి దాంతోపాటు, హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన మొత్తం డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని సుప్రీంకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సందర్భంగా న్యాయమూర్తులు 17A సెక్షన్ అమల్లోకి వచ్చిన తర్వాతే ఈ కేసులో FIRనమోదైనట్లు అభిప్రాయపడ్డారు.

చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఆయన తరఫున హరీష్ సాల్వే మొదట వాదనలు వినిపించారు. ఈ కేసులో 2021 డిసెంబర్ 9న FIR నమోదైందని, అందువల్ల ఇందులో అంతకు ముందే విచారణ ప్రారంభమైందని హైకోర్టు న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొనడం తప్పని వాదించారు. 2021 సెప్టెంబర్ 7న అడిషనల్ డైరెక్టర్ జనరల్‌కు అందిన లేఖ ఆధారంగా FIR నమోదు చేసినట్లు చెప్పారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడి..మోసపూరితంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్‌లో పేర్కొన్నారని, అయితే అధికారంలో ఉన్నవారి కక్ష సాధింపు నుంచి పబ్లిక్ సర్వెంట్లకు రక్షణ కల్పించడానికే..పార్లమెంటు అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17Aని చేర్చిందని వివరించారు. సవరించిన చట్టం ప్రకారం... అధికార విధుల నిర్వహణలో భాగంగా పబ్లిక్ సర్వెంట్లు చేసిన సిఫార్సులు, నిర్ణయాలపై అధీకృత వ్యవస్థ ముందస్తు అనుమతి లేకుండా ఏ పోలీసు అధికారీ విచారణ కానీ, దర్యాప్తు కానీ ప్రారంభించడానికి వీల్లేదని వివరించారు. నేరం ఎప్పుడు జరిగినా.... దానిపై విచారణ చేపట్టేటప్పుడు మాత్రం ముందస్తు అనుమతి లేకుండా చేయడానికి వీల్లేదన్నారు. ఇది అభియోగాలకు సంబంధించిన విషయం కాదని, పూర్తిగా విచారణ ప్రక్రియకు సంబంధించిన నియమం అని పేర్కొన్నారు. కానీ ఈ సెక్షన్ పాత నేరాలకు వర్తించదని హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం సరికాదని, మొత్తం తప్పంతా అందులోనే ఉందన్నారు. ఆధీకృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవడానికి అవసరమైన ప్రొసీజర్ అని, అందువల్ల ఇది నేర విచారణ తేదీతో ముడిపడిన అంశమే తప్ప నేరం జరిగిన తేదీకి సంబంధించిన విషయం కాదన్న హరీష్‌ సాల్వే.. 2018 జులైకి ముందు జరిగిన నేరాలకు 17A వర్తించదని హైకోర్టు న్యాయమూర్తి చెప్పడం సరికాదని వాదించారు. రిమాండ్ రిపోర్టులో పిటిషనర్‌కు వ్యతిరేకంగా పేజీల కొద్దీ ఆరోపణలు చేశారన్న సాల్వే.. అందులో చెప్పినవన్నీ ముఖ్యమంత్రి హోదాలో తీసుకున్న నిర్ణయాలే అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు, అధికారులు సూచించిన విషయాలను పరిగణలోకి తీసుకోకపోవడం, తన ప్రణాళికను అమలు చేయడానికి ఫలానా వ్యక్తిని ఎక్స్‌ అఫిషియో సెక్రెటరీగా నియమించారని రిమాండ్‌లో పొందుపరిచారన్న ఆయన.... ప్రతిదీ ఆయన నిర్ణయం, ఆదేశాలకు సంబంధించినదే అన్నట్లుగా చెప్పారని వివరించారు. విచారణ ఎప్పుడు ప్రారంభమైందో అప్పుడే 17A వర్తిస్తుందా? అని జస్టిస్‌ అనిరుద్ద బోస్‌ ప్రశ్నించగా...అవునని సాల్వే సమాధానం ఇచ్చారు. నేర విచారణ ప్రక్రియను దుర్వినియోగం చేయకుండా అడ్డుకోవడానికే అవినీతి నిరోధక చట్టంలో సంబంధింత సెక్షన్‌ను చేర్చినట్లు ధర్మాసనానికి విన్నవించారు. అందువల్ల నేరం ఎప్పుడు జరిగిందన్న దాంతో సంబంధం లేదన్నారు.

చంద్రబాబు తరుపున వాదనలు వినిపించిన మరో సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.... ఇలాంటి ఫిర్యాదులను వడపోయడానికే చట్టంలో ఈ సెక్షన్‌ తీసుకువచ్చారని వివరించారు. సుప్రీంకోర్టు ఏకాభిప్రాయంతో ఇచ్చిన యశ్వంత్ సిన్హా తీర్పులోని పేరా 118లో ఈ విషయం ఉన్నట్లు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. రఫేల్ కేసులో ఫ్రెంచ్ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందాన్ని కేంద్ర ప్రభుత్వం 2016 ఏప్రిల్‌ల్లో రద్దు చేసుకున్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. అయితే 2018లో అవినీతి నిరోధక చట్టంలో సవరణలు చేసి 17A ని చేర్చారని, అందువల్ల అంతకు ముందు తీసుకున్న నిర్ణయాలపైనా అధీకృత వ్యవస్థ అనుమతి లేకుండా విచారణ చేయడం కానీ, దర్యాప్తు చేపట్టడం కానీ కుదరదని సుప్రీంకోర్టు యశ్వంత్ సిన్హా కేసులో ఇచ్చిన తీర్పులో స్పష్టంగా చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకుంటే ఇప్పుడు చంద్రబాబుపై పెట్టిన కేసు పూర్తి తప్పని స్పష్టమవుతుందన్నారు.

Chandrababu Quash Petition Hearing: చంద్రబాబు పిటిషన్లపై సుప్రీంకోర్టు, హైకోర్టులో విచారణ

ఈ కేసులో నేరం ఎప్పుడు జరిగిందని ఆరోపిస్తున్నారు? అని ధర్మాసనం ప్రశ్నించగా.... 2015, 2016లో జరిగినట్లు చెపుతున్నారని సాల్వే వివరణ ఇచ్చారు. సెక్షన్ 17A విచారణ జరిగే తేదీ నాటికి పోలీసు అధికారులకు ఉన్న అధికారాలను చెబుతోందన్నారు. ఆఫీసర్లు, వారి హోదాలు, దర్యాప్తు సంస్థలు మారి కొత్త దర్యాప్తు సంస్థలు, అధికారులను ప్రవేశపెట్టవచ్చని, అయితే 17ఎ కింద ముందస్తు అనుమతి అవసరం లేదని చెప్పడానికి ఎవ్వరికీ అధికారం లేదని వివరించే సమయంలో... ఇక్కడ FIR ఎప్పుడు నమోదైందని జస్టిస్‌ బోస్‌ ప్రశ్నించాగా..... 2021 డిసెంబర్ 9న నమోదైనట్లు చెప్పారు. 2021 సెప్టెంబర్ 7న అందిన ఫిర్యాదు లేఖ ఆధారంగా దాన్ని నమోదు చేశారని గుర్తుచేశారు. ఇది మొత్తం చట్ట విరుద్ధం అని, తప్పిదమని స్పష్టమవుతోందని సాల్వే ధర్మాసనంకు వివరించారు.

17A అవినీతి నిరోధక చట్టంలోని కేసులకు వర్తిస్తుందంటున్నారు. అలాంటప్పుడు ఇతర ఐపీసీ సెక్షన్ల కింద నమోదైన కేసుల సంగతేంటి? అని జస్టిస్‌ బేలా ఎం త్రివేది ప్రశ్నించగా.....అన్ని నేరాలకూ అది వర్తిస్తుందని హరీష్‌ సాల్వే బదులిచ్చారు. ఆ సమయంలో జస్టిస్ బోస్ జోక్యం చేసుకుంటూ అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి వచ్చే ఏ నేరాన్నీ ముందస్తు అనుమతి లేకుండా పోలీసు అధికారి విచారించకూడదని మాత్రమే ఆ సెక్షన్ చెబుతోంది కదా? అని ప్రశ్నించాగా... 2021 డిసెంబర్‌ 9న నమోదు చేసిన FIR ప్రకారం... అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెపుతున్నందున.. నమోదు చేసిన కేసులన్నీ అవినీతి నిరోధక చట్టం పరిధిలోకే వస్తాయని అభిషేక్‌ సింఘ్వీ చెప్పారు. 17A కింద చెప్పిన ఎంక్వయిరీ, ఇంకవ్వరీ, ఇన్వెస్టిగేషన్‌ అన్ని చట్ట సవరణ జరిగిన మూడేళ్ల తర్వాత చేపట్టారన్నది ఈ FIR ద్వారా స్పష్టత వచ్చిందని వివరించారు. అవినీతి నిరోధక చట్టం కింద పేర్కొన్న నేరాల విచారణలు ప్రత్యేక కోర్టుకు వెళతాయని, అందువల్ల ఆ కోర్టు అవినీతి నిరోధక కేసులు, IPC కేసుల విడివిడిగా చూడదని తెలిపారు. ఇక్కడ కూడా.. అరెస్టు చేసిన తర్వాత రిమాండ్‌ చేసింది ప్రత్యేక కోర్టులోనే అని, ఆ చట్టం కింద కేసు పెట్టారు కాబట్టే.. అందుకు సంబంధించిన కోర్టులో హాజరు పరిచారన్న విషయం గమనించాలని కోరారు. ప్రత్యేక కోర్టు కూడా అవినీతి నిరోధక చట్టం ప్రకారమే కేసు నమోదైంది కాబట్టే... రిమాండ్‌కు పంపిందని వివరించారు.

రిమాండ్‌ రిపోర్ట్‌లో మంత్రివర్గ నిర్ణయం అని పేర్కొన్నారని చెప్పారు. దీనికి తాము మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని జస్టిస్‌ త్రివేది వ్యాఖ్యానించగా... తాను కూడా మెరిట్స్‌లోకి పోవడం లేదని, పిటిషనర్‌ తన అధికారుల విధుల నిర్వహణకు సంబంధించిన విషయంలో కేసు పెట్టినట్లుగానే వివరిస్తున్నట్లు చెప్పారు. అదే సందర్బంలో.. న్యాయాధికారి 17A సెక్షన్‌ పాత తేదీలకు వర్తించదని చెప్పారని, కాని ఆ సెక్షన్‌ వర్తిస్తుందని తాము చెపుతున్నట్లు పేర్కొన్నారు. ఆ సెక్షన్‌ వచ్చిన..మూడేళ్ల తర్వాతే ఈ కేసులో అన్ని రకాల విచారణలు, దర్యాప్తులు మొదలయ్యాయని, ఈ కేసు A.C.Bప్రత్యేక కోర్టు విచారించినందున... ఇది అవినీతి కేసు కిందకే వస్తుందన్నారు. క్యాబినెట్‌ తీసుకున్న నిర్ణయం అని న్యాయమూర్తికి తెలుసని, దాని ప్రకారం ఇది అధికార విధుల నిర్వహణ కిందకే వస్తుందని ప్రాథమికంగా తెలుస్తోందన్నారు.

CBN CID Custody ముగిసిన సీఐడీ కస్టడీ... అక్టోబర్ 5 వరకు చంద్రబాబుకు రిమాండ్

సింఘ్వీ ఈ వాదనలు వినిపిస్తున్న సందర్భంలో మరోసారి న్యాయమూర్తులు తాము... కేసు మెరిట్స్‌లోకి వెళ్లడం లేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకు తాము పరిశీలించిన వివరాలు పరిశీలిస్తే..17A సెక్షన్‌ అమలులోకి వచ్చిన తర్వాతే...FIR నమోదఅయ్యిందని అంగీకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఐతే, అందులో ఐపీసీ నేరాలకు మినహాయింపులు ఇవ్వలేదు కదా అని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో...FIR నమోదు చేయడం, ప్రత్యేక కోర్టు దానిపై విచారించడం, రిమాండ్‌ ఆర్డర్‌ జారీ చేయడం వంటివన్నీ..చట్టబద్దంగా జరగలేదని వివరించారు. ఎసీబీ కోర్టు విచారించడం మినహా...ఐపీసీ సెక్షన్ల విచారణ కోసం మరో కోర్టుకు పోవడం సాధ్యం కాదని, ఇది అన్ని సెక్షన్లు మిళితమైన కేసు అని గుర్తు చేశారు. లంచం తీసుకుంటూ... దొరికిన వారికి మాత్రమే 17A వర్తించదని, అది తప్పితే ఇంకెవరికీ ఎలాంటి మినహాయింపులు లేవన్నారు. విధాన రూపకర్తలు సదుద్దేశంతో తీసుకున్న నిర్ణయాలపై తప్పుడు కేసులు పెట్టి వేధించరాదన్న ఉద్దేశ్యంతో పార్లమెంటు 17A ని చేర్చిందని సింఘ్వీ వివరించారు.

పిటిషనర్‌పై ఒకదాని తర్వాత మరొక FIR నమోదు చేస్తున్నారని, ఇది కక్షసాధింపు అన్నది స్పష్టంగా కనిపిస్తోందని, మరో రెండు కేసులు ఇప్పటికే సిద్ధం చేశారని మరో సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం తరఫున ముకుల్‌ రోహత్గీ వాదనలు వినిపిస్తూ...ఈ కేసులో 17A ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు. ఈ కేసులో 2021లో FIR నమోదు చేసినప్పటికీ విచారణ మాత్రం 17A సెక్షన్ రాక ముందే ప్రారంభమైనందు వల్ల... ఈ సెక్షన్ వర్తించదన్నారు. దీనికి... జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ ఈ సెక్షన్ రాక ముందే విచారణ ప్రారంభమైనట్లు ఎక్కడుందని ప్రశ్నించారు. ఆ విషయం హైకోర్టు తీర్పులో ఉందని రోహత్గీ వివరించారు. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులకు వ్యతిరేకంగా 2018 జూన్ 5న ఏసీబీ డైరెక్టర్ మెమో జారీ చేసి సాధారణ విచారణ ప్రారంభించమని ఆదేశించారని, దానిపై సీబీఐ విచారణ జరపమని లేఖ రాసినట్లు అదనపు అడ్వొకేట్ జనరల్.. తమ దృష్టికి తెచ్చారని హైకోర్టు తన తీర్పులో పేర్కొందన్నారు. ఆ సమయంలో...జస్టిస్ బోస్ జోక్యం చేసుకుంటూ అది ఎలాంటి విచారణో తమకు ఎలా తెలుస్తుందని ప్రశ్నించాగా.. అందుకు రోహత్గీ బదులిస్తూ తమ వద్ద అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయన్నారు. అప్పటి ముఖ్యమంత్రి నిరుద్యోగుల స్కిల్ డెవలప్మెంట్ కోసం అని చెప్పి కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎలాంటి టెండర్లు లేకుండా ఆ ప్రాజెక్టును అప్పగించారన్నారు. అప్పుడు న్యాయమూర్తులు జస్టిస్ బోస్, జస్టిస్ త్రివేది జోక్యం చేసుకుంటూ తాము ఆ విషయం లోపలికి పోవడం లేదని, ఇక్కడ కేవలం క్వశ్చన్ ఆఫ్ లాకు సంబంధించిన విషయాన్ని మాత్రమే చూస్తున్నామని, కేవలం తేదీలను మాత్రమే పరిశీలిస్తున్నామని చెప్పారు. హైకోర్టు తీర్పు ప్రకారం 17A అన్నది ఇక్కడ వర్తించదని, అందువల్ల దాన్ని ఎందుకు పరిగణలోకి తీసుకుంటారని రోహత్గీ ప్రశ్నించారు. ఆ సమయంలో జస్టిస్ త్రివేది జోక్యంచేసుకుంటూ మీరు చెప్పిన లేఖలు డాక్యుమెంట్లు హైకోర్టు రికార్డుల్లో ఎక్కడున్నాయని ప్రశ్నించగా.. తమ వద్ద ఉన్నాయని రోహత్గీ బదులిచ్చారు. తాము తీర్పులోని అంశాలనే ఇక్కడ ప్రస్తావిస్తున్నామని చెప్పారు. సిద్దార్ధ లూద్రా జోక్యం చేసుకుంటూ ఇప్పుడు చెబుతున్న డాక్యుమెంట్లను వారు ట్రయల్ కోర్టులోకానీ, హైకోర్టులోకానీ సమర్పించ లేదన్నారు. జస్టిస్ బేలా త్రివేదీ స్పందిస్తూ అదే ముఖ్యమని, సమస్య మూలం వరకు వెళ్తుందని వ్యాఖ్యానించారు.

Chandrababu Judicial Remand Extended: చంద్రబాబు జ్యుడీషియల్‌ రిమాండ్‌ ఈ నెల 24 వరకు పొడిగింపు

17A పై ట్రయల్ కోర్టులో వాదనలు వినిపించినప్పుడు ప్రభుత్వం... ఇప్పుడు చెబుతున్న 2018 విచారణకు సంబంధించిన డాక్యుమెంటు సమర్పించ లేదని సిద్దార్థ లూథ్రా ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. హైకోర్టులో వాదనలన్నీ పూర్తయిన తర్వాత న్యాయమూర్తికి దాన్ని అందించారని చెబుతూ ఆ కాపీని ధర్మాసనానికి అందజేశారు. ఈ వాదనలు విన్న అనంతరం జస్టిస్ అనిరుద్ధబోస్ స్పందిస్తూ మీరు హైకోర్టు ముందు దాఖలు చేసిన డాక్యుమెంట్లన్నింటినీ సోమవారం లోపు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. అది చాలా ముఖ్యమైన విషయం అన్నారు. అందుకు రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ అంగీకరించారు. తర్వాత జస్టిస్ త్రివేదీ జోక్యం చేసుకుంటూ హైకోర్టులో అదనపు అడ్వొకేట్ జనరల్ చేసిన వాదనలను పరిగణలోకి తీసుకోవడం మినహా ఆ డాక్యుమెంట్లను పరిగణలోకి తీసుకుందా? లేదా? అన్న విషయాలపై తమకు స్పష్టత రావాల్సి ఉందన్నారు. ఆ తీర్పులో 2018 విచారణ మెమోకు సంబంధించిన చర్చ ఎక్కడా లేదని వ్యాఖ్యానించారు. అప్పుడు సిద్దార్ధ లూథ్రా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన డాక్యుమెంట్‌ లిస్ట్ వారు దాఖలు చేసిన కౌంటర్లో ఉందని.. దాన్ని ఇప్పుడే కోర్టుకు అందిస్తానని చెప్పి సమర్పించారు. అయితే ధర్మాసనం అందుకు సోమవారం వరకు సమయం ఇవ్వగా ఆలోపు దాఖలు చేస్తామని ముకుల్ రోహత్గీ తెలిపారు. దానిపై అవసరమైతే తాము కౌంటర్ దాఖలు చేస్తామని లూథ్రా తెలిపారు. అనంతరం.. ధర్మాసనం కేసు తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది.

Last Updated : Oct 3, 2023, 7:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.