ETV Bharat / bharat

Chandrababu Quash Petition: చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ వాదనలు.. విచారణ రేపటికి వాయిదా

author img

By ETV Bharat Telugu Team

Published : Oct 9, 2023, 6:03 PM IST

Chandrababu Quash Petition: స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో తనపై సీఐడీ అక్రమ కేసు నమోదు చేసిందని.. ఆ కేసు కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది. విచారణ సందర్బంగా సుదీర్ఘంగా వాదనలు కొనసాగాయి. రిమాండ్ రిపోర్టు ఆధారంగా.. 17-ఏ వర్తిస్తుందన్నదే తాము చెప్పదలచుకున్నామని చంద్రబాబు తరపు న్యాయవాది హరీష్‌ సాల్వే స్పష్టం చేశారు. ఈ క్రమంలో రేపు ఉదయం పదిన్నర గంటలకు వాదనలు వినిపించేదుకు.. సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ కోరగా... ఆయన అభ్యర్థనకు సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతి తెలిపింది. దీంతో విచారణ మంగళవారానికి వాయిదా పడింది.

Chandrababu Quash Petition
Chandrababu Quash Petition

Chandrababu Quash Petition: స్కిల్‌ డెవలప్మెంట్‌ కేసులో తనపై సీఐడీ అక్రమ కేసు నమోదు చేసిందని పేర్కొంటూ.. దానిని కొట్టివేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేదితో కూడిన ధర్మాసనం విచారించింది. చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాదులు హరీష్‌సాల్వే, సీఐడీ తరఫున న్యాయవాదులు ముకుల్‌ రోహత్గీ, నిరంజన్‌రెడ్డి, ఏఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు.

సీఐడీ రిమాండ్‌ రిపోర్టులో పెట్టలేదు: చంద్రబాబు తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది హరీష్‌ సాల్వే.. స్కిల్‌ కేసులో సెప్టెంబర్ 19న వాదనలు పూర్తయి హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసిందని సుప్రీంకోర్టుకు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌ 20న కొన్ని డాక్యుమెంట్లను హైకోర్టు ముందు ఉంచిందని తెలిపారు. 2018లో నేరం జరిగిందన్న వివరాలేవీ సీఐడీ రిమాండ్‌ రిపోర్టులో పెట్టలేదని వివరించారు. 2021లో నమోదు చేసిన FIR ఆధారంగానే రిమాండ్‌ రిపోర్టు ఉందని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రిమాండ్ రిపోర్టు ఆధారంగా... 17-ఏ వర్తిస్తుందన్నదే తాము చెప్పదలచుకున్నామని.. కోర్టుకు హరీష్‌ సాల్వే స్పష్టం చేశారు. చట్ట సవరణ ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందన్న దానిపై.. 1959 SER 191 కేసును హరీష్‌ సాల్వే ఉదహరించారు. ఈ కేసు జడ్జిమెంట్ ప్రకారం చట్టసవరణకు ముందు కేసులకు కూడా వర్తిస్తుందని వివరించారు.

రిమాండ్‌ ఆర్డర్‌నే ఛాలెంజ్: ఈ క్రమంలో కలగజేసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ త్రివేది... స్కిల్‌ కేసుకు సంబంధించి... 2018లోనే విచారణ ప్రారంభమైందన్న సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ వాదనలను... ప్రస్తావించారు. రోహత్గీ వాదనే సహేతుకం కాదని... FIRకు దారి తీసిన విచారణ అది కాదని... హరీష్‌ సాల్వే సమాధానమిచ్చారు. గతంలో ఏదో విచారణ జరిగింది... దానిని మూసేశారని తెలిపారు. ఆ తర్వాత కొత్త విచారణ ప్రారంభించారని హరీష్‌ సాల్వే కోర్టుకు తెలిపారు. ఈ క్రమంలో న్యాయమూర్తి జస్టిస్ త్రివేది కలగజేసుకుని... ఆ డాక్యుమెంట్లు ఏవీ... ఎక్కడ ఉన్నాయి? వాటిని హైకోర్టు పరిశీలించిందా? అని అడిగారు. అసలు సమస్య అంతా అక్కడే ప్రారంభమైందని.. హరీష్‌ సాల్వే బదులిచ్చారు. 2018కి సంబంధించిన ఏ డాక్యుమెంట్లనూ ప్రస్తావించలేదని పేర్కొన్నారు. పత్రాలేవీ సమర్పించకపోయినా... రిమాండ్ కోర్టు 2018 ముందు నేరం జరిగినట్లు రికార్డు చేసిందని సాల్వే వివరించారు. రిమాండ్‌ ఆర్డర్‌నే ఛాలెంజ్ చేస్తున్నారా అని జస్టిస్ త్రివేది సాల్వేను ప్రశ్నించగా... అవునని సాల్వే ధర్మాసనానికి నివేదించారు.

అవినీతి నిరోధక శాఖ చట్టం ప్రకారం కేసు: ఈ క్రమంలో విచారణను కాసేపు వాయిదా వేసిన ధర్మాసనం... మధ్యాహ్నం 2 తర్వాత తిరిగి ప్రారంభించింది. భోజన విరామం అనంతరం వాదనలు ప్రారంభించిన చంద్రబాబు(Chandrababu ) తరఫు న్యాయవాది హరీష్‌ సాల్వే 17-ఏ డేట్‌ ఆఫ్‌ వర్తిస్తుందా... లేదా డేట్‌ ఆఫ్‌ అఫెన్స్‌ కింద వర్తిస్తుందా అనేది కోర్టు ముందుంచామని... ధర్మాసనం దృష్టికి తెచ్చారు. నేరుగా నగదు తీసుకుంటూ పట్టుబటితే తప్ప మిగిలిన అన్నింటికీ 17-ఏ వర్తిస్తుందని పేర్కొన్నారు. అవినీతి నిరోధక శాఖ చట్టం ప్రకారం కేసు పెడితే... ఈ పాటికి మాకు ఉపశమనం లభించేదన్నారు. రిమాండ్‌ రిపోర్టును మేము ఛాలెంజ్‌ చేస్తున్నామని తేల్చిచెప్పారు. రిమాండ్‌ రిపోర్టుపైనే మా వాదనంతా అని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా... 17-ఏ కు సంబంధించి పంకజ్‌ బన్సల్‌ కేసును హరీష్‌ సాల్వే ఉదహరించారు. 17-ఏకు వర్తించే అన్ని కేసుల్లో ప్రతి సందర్భంలో అనుమతి తీసుకోవాలనేది కేంద్రం స్టాండర్డ్‌ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ జారీ చేసిందని సాల్వే పేర్కొన్నారు. 17-ఏ విషయంలో హైకోర్టులో భిన్నమైన ఉత్తర్వులు వచ్చాయని గుర్తుచేశారు. కొన్ని హైకోర్టులు డేట్ ఆఫ్‌ అఫెన్స్‌ నుంచి పరిగణించాయని... కొన్ని కోర్టులు డేట్‌ ఆఫ్‌ ఎఫ్‌ఐఆర్‌ను పరిగణించాయని సాల్వే వివరించారు. ఈ కేసులో ఇప్పటికే సీఐడీ కేవియట్‌ దాఖలు చేసిందన్న సాల్వే.. నోటీసు అన్నది ఇప్పుడు అసందర్భమన్నారు. కావాలంటే మధ్యంతర ఉత్తర్వులపై వారి వాదనలు వినవచ్చని చెప్పారు.

ఈ క్రమంలో కలగజేసుకున్న న్యాయమూర్తి జస్టిస్‌ త్రివేది... కేసు పూర్వాపరాలు చూడకుండా మళ్లీ హైకోర్టుకు పంపించమంటారా అని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ హరీష్‌ సాల్వే... హైకోర్టు డేట్‌ ఆఫ్‌ అఫెన్స్‌ను పరిగణనలోకి తీసుకుందని ధర్మాసనానికి వివరించారు. డేట్ ఆఫ్‌ ఎఫ్‌ఐఆర్‌ను పరిగణనలోకి తీసుకోవాలన్నదే తమ వాదన అని సాల్వే తెలిపారు. సుప్రీంకోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. సీఐడీ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది నిరంజన్‌రెడ్డి... వాదనలు మొత్తం విన్నాక డాక్యుమెంట్లు ఇచ్చామనడం సరికాదన్నారు. రిమాండ్‌ రిపోర్టులోనే అన్నీ ఉన్నాయని చెప్పారు. హరీష్‌ సాల్వే కలగజేసుకుంటూ... మనీలాండరింగ్‌ కేసు పెడితే దానికి సంబంధించిన సంపూర్ణ వివరాలు... ఆరోపణలు ఎదుర్కొన్నవారికి ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వివరాలు ఇవ్వకుండా అరెస్టు చేస్తే చట్టవ్యతిరేకమవుతుందని సాల్వే చెప్పారు.

ఒప్పందం ఎవరితో జరిగింది: జస్టిస్ అనిరుద్ధ బోస్‌ కలగజేసుకుని... విచారణ ఎప్పుడు ప్రారంభమైందని అడిగారు. ప్రాథమిక విచారణ 2021లో ప్రారంభమైందని హరీష్ సాల్వే బదులిచ్చారు. 2021 సెప్టెంబర్‌ 7న ఫిర్యాదు ఆధారంగా విచారణ ప్రారంభమైందని... ఆ ఫిర్యాదుతో పిటిషనర్‌కు సంబంధమే లేదని సాల్వే వాదించారు. ఆ ఫిర్యాదు డిజైన్ టెక్‌ అనే కంపెనీకి సంబంధించిందని వివరించారు. ఒప్పందం ఎవరితో జరిగిందని జస్టిస్‌ త్రివేది ప్రశ్నించగా... రాష్ట్ర ప్రభుత్వంతో జరిగిందని సాల్వే సమాధానమిచ్చారు. ఆ ఫిర్యాదు... డిజైన్‌టెక్‌, స్కిల్‌టెక్‌ మధ్యలో GSTకి సంబంధించినదని సాల్వే కోర్టుకు తెలిపారు. అన్ని పరిణామాలను పరిశీలిస్తే... కేసు నమోదు, ఫిర్యాదు, విచారణ అన్నీ 2021లోనే జరిగాయని సాల్వే కోర్టుకు తెలిపారు. 2018 జూన్‌లో FIR లేదు, విచారణ లేదనని తేల్చి చెప్పారు. 17-ఏ కు సంబంధంచి తెలంగాణ హైకోర్టు తీర్పును హరీష్ సాల్వే ఉదహరించారు.

నిధుల విడుదల అనేది కేబినెట్ నిర్ణయం: 2018 జులైకు ముందు జరిగిన నేరాలకు 17-ఏ వర్తించదన్నది రాష్ట్ర ప్రభుత్వం వాదనగా ఉందని సాల్వే చెప్పారు. ఆరోపణలన్నీ 2015, 2016కు సంబంధించినవి కాబట్టి... ఇప్పటి విచారణలో పరిగణనలోకి తీసుకోలేమని హైకోర్టు భావించిందని సాల్వే అన్నారు. ఫిర్యాదు, విచారణ అన్నీ 2021లోనే ఉన్నాయి కాబట్టి... 17-ఏ కు వర్తిస్తుందని కోర్టుకు విన్నవిస్తున్నామని చెప్పారు. కేసులో ఎప్పుడు ఏం జరిగింది.. వివరాలేంటి అనేదానిపై ఇప్పుడు తాము ప్రస్తావించట్లేదని సాల్వే కోర్టుకు తెలిపారు. కేసులో ఉన్న వాస్తవాలపై రాష్ట్ర ప్రభుత్వం మసిపూసే ప్రయత్నం చేసిందని సాల్వే ఆరోపించారు. 2015-2016లో చంద్రబాబు నిధులు విడుదల చేసినట్లు చెబుతున్నారన్న సాల్వే... నిధుల విడుదల అనేది కేబినెట్ నిర్ణయమని.. వ్యక్తులకు వర్తింపజేయలేమన్నారు.

Lokesh Going to Delhi: దిల్లీకి లోకేశ్​.. సుప్రీంలో చంద్రబాబు క్వాష్ పిటీషన్‌పై విచారణ నేపథ్యంలో..

ప్రతీకార చర్యలు: 17-ఏ తీసుకొచ్చిన కారణమే రాజకీయ ప్రతీకార చర్యలు లేకుండా ఉండటం కోసమని సాల్వే గుర్తుచేశారు. ప్రభుత్వాలు మారినప్పుడు గత ప్రభుత్వాలపై వేధింపులు లేకుండా ఉండేందుకే చట్టసవరణ జరిగి... 17-ఏ అమలులోకి వచ్చిందన్నారు. 17-ఏ అమలుపై కేంద్ర ప్రభుత్వం స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌ను రాష్ట్రాలకు జారీచేసిందన్నారు. దేశవ్యాప్తంగా ఒకేలా అమలు జరిగేలా కేంద్ర ప్రభుత్వం ప్రొసీజర్‌ను తీసుకొచ్చిందని తెలిపారు. సింగిల్‌ విండోలో పబ్లిక్‌ సర్వెంట్లందరికీ రక్షణ కల్పించేందుకు 17-ఏ ఉపకరిస్తుందని సాల్వే వివరించారు. పబ్లిక్‌ సర్వెంట్లపై ఆరోపణలు చేయాలంటే తప్పనిసరిగా అధీకృత అధికారి నుంచి సమ్మతి అవసరమని సాల్వే కోర్టుకు చెప్పారు. ప్రతీకార చర్యలకు పాల్పడిన సందర్భాలు ఉన్నందునే చట్టానికి సవరణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

17-ఏ ప్రకారం అప్రూవల్‌ తీసుకోవాలి: 17-ఏ ప్రకారం ప్రజాప్రతినిధులపై ఎంక్వైరీ, ఇన్వెస్టిగేషన్‌... దేనికైనా పోలీసులు అనుమతులు పొందాల్సిందేనని.. సాల్వే కోర్టుకు వివరించారు. 17-ఏ లో ఉన్న నిబంధనలు బెంచ్‌ ముందు ఉంచిన సాల్వే... యశ్వంత్ సిన్హా కేసులో తీర్పు తర్వాత స్పష్టమైన నిబంధనలు ఏర్పాటయ్యాయని గుర్తుచేశారు. ఆ కేసులోని మెరిట్స్ ఆధారంగా ఈ కేసునూ పరిగణించాల్సి ఉంటుందని కోరారు. S.O.P. ప్రకారం కేసు నమోదుకు, విచారణకు దేనికది ప్రత్యేక అనుమతులు తీసుకోవాల్సిందేనని సాల్వే తేల్చిచెప్పారు. ఒక ప్రజాప్రతినిధిపై విచారణ జరగాలంటే 17-ఏ ప్రకారం అప్రూవల్‌ తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. చట్ట సవరణ జరిగిన మూడేళ్లకు S.O.P. వచ్చిందని... అంతకుముందు ఏం జరిగిందని జస్టిస్ త్రివేది ప్రశ్నించారు. ఇలాంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని రెజీమ్‌, రివేంజ్‌ అనే పదాలను తీసుకొచ్చిందని సాల్వే బదులిచ్చారు.

Chandrababu Quash Petition Hearing: చంద్రబాబు పిటిషన్లపై సుప్రీంకోర్టు, హైకోర్టులో విచారణ

ఎవరికీ అభ్యంతరం లేదు: ఈ క్రమంలో రేపు ఉదయం పదిన్నర గంటలకు వాదనలు వినిపించేదుకు.. సీఐడీ తరఫు న్యాయవాది ముకుల్‌ రోహత్గీ కోరగా... ఆయన అభ్యర్థనకు సుప్రీంకోర్టు ధర్మాసనం అనుమతి తెలిపింది. హరీష్‌ సాల్వే వాదనలు కొనసాగించారు. జస్టిస్ త్రివేది కలగజేసుకుంటూ... 17-ఏ అన్నది అవినీతిని నిరోధించడంలో భాగంగా వచ్చిందని గుర్తుచేశారు. అవినీతిని నిరోధించడంలో నష్టం జరగకూడదన్న బాధ్యత కూడా ఉందన్నారు. దీనికి సాల్వే బదులిస్తూ... మీరన్నది నిజమే... కేసు నమోదు, విచారణ.. అధీకృత అధికారి నుంచి అనుమతి తీసుకున్నాక విచారణ చేయడంలో ఎవరికీ అభ్యంతరం లేదన్నారు.

ఆధారాలు కనిపిస్తున్నాయి: ఈ క్రమంలో కలగజేసుకున్న న్యాయమూర్తి జస్టిస్ అనిరుద్ధ బోస్‌.. మీ క్లయింట్ కేసులో 17-ఏ వర్తిస్తుందన్న దానికి ఆధారాలు కనిపిస్తున్నాయని... సాల్వేతో అన్నారు. దీనికి బదులిస్తూ సాల్వే... బెంచ్ పరిశీలన వాస్తవమేనన్నారు. అధికార విధుల నిర్వర్తనకు సంబంధించిన అంశం ఇందులో ఇమిడి ఉందన్నారు. ఇదంతా చూస్తే 10 శాతం ప్రభుత్వం ముందుగా ఇచ్చి... 90 శాతం సీమెన్స్‌ తర్వాత పెట్టడం మూలాన వచ్చినట్లుందని... మరో న్యాయమూర్తి జస్టిస్ త్రివేది అన్నారు. ఈ కేసులో అందరికీ బెయిల్‌ వచ్చిందని... అసలు అరెస్టు అనేదే చట్ట విరుద్ధమని హరీష్ సాల్వే అన్నారు. పార్లమెంటు 17-ఏ చట్టం తీసుకొచ్చిందే ప్రతీకార చర్యలు లేకుండా ఉండటం కోసమేనని సాల్వే పునరుద్ఘాటించారు. ఇక నుంచి జరగబోయే వాటికే కాదు... గతంలో జరిగినవాటికి కూడా 17-ఏ వర్తిస్తుందని అన్వయించుకోవచ్చని హరీష్‌ సాల్వే అన్నారు.

అనంతరం సుప్రీంకోర్టు చంద్రబాబు క్వాష్‌ పిటిషన్‌పై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది.

Lokesh to approach Supreme Court on Chandrababu case : 'స్కిల్' కేసులో దిల్లీ వేదికగా లోకేశ్ న్యాయపోరాటం..! సుప్రీంను ఆశ్రయించనున్న టీడీపీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.