ETV Bharat / bharat

CBN Comments: 'టీడీపీ అధికారంలో ఉంటే పోలవరం పూర్తయ్యేది.. జగన్ పాలనలో రాష్ట్రం సర్వ నాశనం'

author img

By

Published : Jun 2, 2023, 3:33 PM IST

Updated : Jun 2, 2023, 5:13 PM IST

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

15:19 June 02

తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలో ఉండాలి

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు

CBN Press meet : జగన్ నాలుగేళ్ల విధ్వంస పాలనలో రాష్ట్రం సర్వనాశనమైపోయిందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శించారు. తొమ్మిదేళ్లయినా రాజధాని ఏదీ అంటే చెప్పుకోలేని దీనపరిస్థితిలో రాష్ట్ర ప్రజలు ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రగతి నిలిచిపోయింది.. మద్యం ఏరులై పారుతోంది.. విశాఖను గంజాయి హబ్‌గా మారిపోయిందని విమర్శించారు. సమైక్య రాష్ట్రంలో టీడీపీ ఆధ్వర్యాన జరిగిన అభివృద్ధిని గుర్తు చేస్తూ.. రాష్ట్ర విభజన తదనంతర పరిణామాలు, వైఎస్సార్సీపీ పాలనపై చంద్రబాబు విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

తెలుగు జాతి అభ్యున్నతికి కృషి.. తెలుగు ప్రజలు ఎక్కడ ఉన్నా అగ్రస్థానంలో ఉండాలన్నదే తెలుగు దేశం పార్టీ ఉద్దేశమని, తెలుగు ప్రజల కోసం నిరంతరం శ్రమించిన పార్టీ టీడీపీ అని చంద్రబాబు నాయుడు తెలిపారు. నాడు సమైక్యాంధ్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం అభివృద్ధి కోసం నిరంతరం పని చేశానని, తెలుగుజాతి పునర్నిర్మాణానికి కృషి చేయాల్సి ఉందని అన్నారు. 1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ఆర్థిక సంస్కరణలకు నాంది పలికారని, తద్వారా దేశానికి దశ, దిశ నిర్దేశించిన వ్యక్తి అని కొనియాడారు. పీవీ నరసింహారావు తెలుగువారు కావడం మనందరికీ గర్వకారణం అని పేర్కొన్నారు. అదే విధంగా ఎన్టీఆర్‌.. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారని తెలిపారు.

సంస్కరణలు, సంపద సృష్టితో ముందుకు.. ఏపీలో రెండో తరం సంస్కరణలు తీసుకువచ్చి సాంకేతికత జోడించి ముందుకు వెళ్లాం.. సంపద సృష్టించి సంక్షేమ పథకాలను పేదలకు అందించాం అని చంద్రబాబు తెలిపారు. నాలెడ్జ్‌ ఎకానమీకి ఐటీ నాంది పలుకుతుందని ఆనాడే చెప్పానని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ విభజన జరిగినపుడు ఏపీకి రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్‌, రూ.1.10 లక్షల కోట్ల అప్పు వచ్చిందని వెల్లడించారు. పరిపాలన, ప్రభుత్వ విధానాల ద్వారా ఇబ్బంది లేకుండా చూశామని, సవాళ్లను అధిగమించి... ఏపీ నంబర్‌వన్‌గా ఉండాలని లక్ష్యం పెట్టుకుని 2029 విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందించామని వివరించారు. నవ నిర్మాణ దీక్ష పేరుతో నిర్దిష్ట లక్ష్యాలు పెట్టుకుని వెళ్లాం.. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు కృషి చేశాం.. సన్‌రైజ్‌ ఆంధ్రప్రదేశ్‌ దిశగా ముందుకెళ్లాం అని తెలిపారు.

రివర్స్ టెండరింగ్ తో పోలవరం ప్రాజెక్టుకు నష్టం.. నదుల అనుసంధానంతో రాష్ట్రంలో ప్రతి ఎకరాకు నీళ్లు ఇచ్చే వీలుంది.. రూ.64 వేల కోట్ల ఖర్చుతో సాగునీటి ప్రాజెక్టు చేపట్టాం అని చంద్రబాబు తెలిపారు. తమ హయాంలోనే పోలవరం ప్రాజెక్టు 72 శాతం పూర్తిచేశాం, సమస్యలన్నింటినీ పరిష్కరిస్తూ ప్రాజెక్టును పరుగెత్తించాం.. ప్రతి సోమవారాన్ని పోలవరంగా మార్చాం.. టీడీపీ అధికారంలో ఉండి ఉంటే 2020 జూన్‌ నాటికి పూర్తయ్యేదని చంద్రబాబు అన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రివర్స్‌ టెండరింగ్‌ పేరుతో ప్రాజెక్టును రివర్స్‌ చేసిందని, కేంద్రం, పీపీఏ చెప్పినా ఏమాత్రం పట్టించుకోలేదని, ప్రాజెక్టుకు నష్టం జరుగుతుందని హెచ్చరించినా వినలేదని మండిపడ్డారు. పేర్కొన్నారు. సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల వరదలు వచ్చి డయాఫ్రమ్‌ వాల్‌ దెబ్బతిని నష్టం జరిగినట్లు తెలిపారు. 2025 నాటికి తొలి విడత పూర్తవుతుందని చెబుతున్నారంటే.. ప్రాజెక్టు పూర్తి చేయడంపై ముఖ్యమంత్రి జగన్​కు ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందన్నారు.

రాజధాని రైతుల భూదానం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా అమరావతికి రూపకల్పన చేశాం.. 29 వేల మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి 33 వేల ఎకరాలు అందించడం ద్వారా సంపద సృష్టిలో భాగస్వాములయ్యారని చంద్రబాబు వివరించారు. అప్పట్లోనే రాష్ట్రానికి 139 సంస్థలు, రూ.50 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.. రాజధాని కొనసాగి ఉంటే రూ.2 లక్షల కోట్ల సంపద వచ్చి ఉండేది అని చంద్రబాబు తెలిపారు. రాష్ట్ర ప్రగతి, భవిష్యత్తును అడ్డుకునే పరిస్థితి వచ్చింది.. మద్యం ఏరులై పారుతోంది.. విశాఖను గంజాయి హబ్‌గా మార్చారని వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై చంద్రబాబు మండిపడ్డారు.

CM Jagan Tour: పరదాల మధ్య సీఎం జగన్ పర్యటన.. మళ్లీ ప్రజలకు తప్పని తిప్పలు

Last Updated : Jun 2, 2023, 5:13 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.