ETV Bharat / bharat

కొవాగ్జిన్‌పై క్లినికల్‌ ట్రయల్‌ మోడ్‌ నిబంధన తొలగింపు!

author img

By

Published : Mar 11, 2021, 5:37 AM IST

భారత్​ బయోటెక్​ సంస్థకు చెందిన కొవాగ్జిన్ టీకాపై ఉన్న క్లినికల్ ట్రయల్ మోడ్​ నిబంధనను కేంద్రం తొలగించనుంది. ఈ మేరకు భారత ఔషధ నియంత్రణ మండలి నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ నిబంధన తొలగిపోయిన తర్వాత కొవాగ్జిన్‌ వినియోగం బాగా పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

covaxin
కొవాగ్జిన్‌పై క్లినికల్‌ ట్రయల్‌ మోడ్‌ నిబంధన తొలగింపు!

కొవిడ్‌ నిరోధానికి భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధి చేసిన 'కొవాగ్జిన్‌' టీకాపై ఉన్న 'క్లినికల్‌ ట్రయల్‌ మోడ్‌' నిబంధన తొలగిపోనుంది. ఈ నిబంధన తొలగించాలని భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) నిర్ణయించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తయారు చేసిన కోవిషీల్డ్‌ టీకాకు అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన డీసీజీఐ, అదే సమయంలో భారత్‌ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్‌ టీకాకు కూడా అత్యవసర వినియోగ అనుమతి ఇస్తూ, దాన్ని క్లినికల్‌ పరీక్షల్లో భాగంగా పరిగణించేలా 'క్లినికల్‌ ట్రయల్‌ మోడ్‌' అని స్పష్టం చేసింది.

దీనివల్ల కొవాగ్జిన్‌ టీకా తీసుకునే వారు ఆ మేరకు ఒక అంగీకార పత్రంపై సంతకం చేయాల్సి వస్తోంది. ఈ వ్యాక్సిన్‌పై మూడోదశ క్లినికల్‌ పరీక్షల మధ్యంతర ఫలితాలను ఇటీవల భారత్‌ బయోటెక్‌ వెల్లడించింది. దీని ప్రకారం కొవాగ్జిన్‌ టీకాకు 81 శాతం ప్రభావశీలత ఉన్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో 'క్లినికల్‌ ట్రయల్‌ మోడ్‌' అనే నిబంధన తొలగించాల్సిందిగా కోరుతూ డీసీజీఐకి భారత్‌ బయోటెక్‌ దరఖాస్తు చేసింది. దీనికి ఔషధ నియంత్రణ అధికారులు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. ఈ నిబంధన తొలగిపోయిన తర్వాత కొవాగ్జిన్‌ వినియోగం బాగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.

స్పుత్నిక్‌ వి టీకాకు అనుమతిపై పరిశీలన

'స్పుత్నిక్‌ వి' టీకాకు అత్యవసర వినియోగ అనుమతి ఇవ్వాలని కోరుతూ డాక్టర్‌ రెడ్డీస్‌ దాఖలు చేసిన దరఖాస్తు సైతం సబ్జెక్టు నిపుణులకమిటీ ముందుకు రానుందని తెలిసింది. రష్యాకు చెందిన ఆర్‌డీఐఎఫ్‌ అభివృద్ధి చేసిన ఈ టీకాను మనదేశంలో డాక్టర్‌ రెడ్డీస్‌ తయారు చేయనుంది.

ఫైజర్‌, మోడెర్నా టీకాల దేశీయ తయారీ?

అమెరికా ఔషధ దిగ్గజ సంస్థలైన ఫైజర్‌, మోడెర్నా కూడా కొవిడ్‌ టీకాలను మనదేశంలో తయారు చేయడానికి ముందుకు వస్తున్నాయి. ధర, ఎగుమతుల విషయంలో స్వేచ్ఛ ఇస్తే తాము ఈ టీకాలను భారత్‌లో తయారు చేస్తామని భారత ఔషధ నియంత్రణ మండలికి ప్రతిపాదించినట్లు తెలిసింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ కూడా మనదేశంలో కొవిడ్‌-19 టీకా తయారీని చేపట్టేందుకు సిద్ధపడుతున్నట్లు పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌కు హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న బయోలాజికల్‌ ఇ.లిమిటెడ్‌తో ఒప్పందం ఉంది.

ఇదీ చదవండి : 'కర్ణాటక సీఎంకు సంబంధించిన సీడీ ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.