ETV Bharat / bharat

నయా వైరల్ సింగర్.. ఒక్కరోజు జైలు శిక్షతో లైఫ్​ టర్న్.. పోలీసులు వీడియో అప్లోడ్ చేయగానే..

author img

By

Published : Jan 11, 2023, 3:15 PM IST

అరెస్టై జైలులో గడిపిన ఒక్కరోజు.. ఓ యువకుడి జీవితాన్ని మార్చేసింది. జైలులో పాడిన అతడి పాట ఇంటర్నెట్​లో తెగ వైరల్ అవుతోంది. భోజ్​పురిలో అతడు పాడిన పాటను పోలీసులు రికార్డు చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో తనకు అనేక అవకాశాలు వస్తున్నాయని ఆ యువకుడు చెబుతున్నాడు.

kanhaiya-raj- sings Bhojpuri song in Jail
kanhaiya-raj- sings Bhojpuri song in Jail

జైల్లో పాట పాడిన ఖైదీ

జైలు గోడల మధ్య పాట పాడి దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి వచ్చాడు బిహార్​లోని కైమూర్​కు చెందిన కన్హయ్య రాజ్. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడన్న కారణంగా భబువా రోడ్​ రైల్వే స్టేషన్ పోలీసులు అతడిని అరెస్టు చేశారు. ఒక రోజు జైలులో ఉన్న కన్హయ్య రాజ్.. ఓ భోజ్​పురి పాటతో ఇంటర్నెట్​లో పాపులారిటీ సంపాదించుకున్నాడు. జైలులో పాట పాడుతుండగా పోలీసులు ఈ వీడియో తీసి.. సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు.

కైమూర్ జిల్లా, రామ్​గఢ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దహ్రక్ గ్రామంలో నివసిస్తున్నాడు కన్హయ్య రాజ్. జైలులో పాట పాడిన కన్హయ్య వీడియో చూసినవారంతా ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. అద్భుతంగా పాడావంటూ మెచ్చుకుంటున్నారు. వీడియో వైరల్ అయిన తర్వాత తనకు అనేక అవకాశాలు వచ్చాయని కన్హయ్య చెబుతున్నాడు. తాగిన మత్తులో ఇతరులకు ఇబ్బంది కలిగించారన్న ఆరోపణలతో భబువా రోడ్​ రైల్వే స్టేషన్ పోలీసులు కన్హయ్యను అరెస్టు చేశారు. ఒక రోజు జైలులో ఉంచి విడుదల చేశారు. అయితే, ఈ ఆరోపణలను కన్హయ్య కొట్టిపారేశారు. తాను మద్యం సేవించడం వల్ల అరెస్టు కాలేదని.. తన పాటల్లో అశ్లీలత ఉందని తప్పుగా భావించి ఎవరో ఫిర్యాదు చేశారని చెప్పాడు.

"ఏం చేస్తుంటారని పోలీసులు అడిగితే పాటలు పాడతాం అని చెప్పా. మరి పాడి వినిపించండి అని కోరారు. తప్పకుండా వినిపిస్తాం అని చెప్పి పాట పాడాను. దాన్ని ఎవరో రికార్డు చేసి వైరల్ అయ్యేలా చేశారు. మేం అశ్లీలత ఉన్న పాటలను (గతంలో) పాడలేదు. అన్నంలో బెల్లం కలిపి చేసే పదార్థాన్ని మేం డూడీ అంటాం. దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటే మేం ఏం చేయగలం?"
-కన్హయ్య రాజ్, గాయకుడు

తనది పేద కుటుంబమని కన్హయ్య చెబుతున్నాడు. తన తండ్రి, సోదరుడు కూలీ పనిచేస్తున్నారని, పదో తరగతి పాసైన తాను 2018లో పాటలు పాడటం మొదలుపెట్టానని చెప్పాడు. వీడియో వైరల్ అయిన తర్వాత పాట పాడేందుకు బనారస్​కు రావాలని అవకాశం వచ్చిందని తెలిపాడు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.