ETV Bharat / bharat

రాహుల్​ తిరిగొస్తారా? కాంగ్రెస్​ భవితవ్యం ఏంటి?

author img

By

Published : Jul 12, 2020, 12:37 PM IST

Updated : Jul 12, 2020, 12:54 PM IST

2019 లోక్​సభ ఎన్నికల్లో ఘోర వైఫల్యం అనంతరం ఢీలా పడ్డ కాంగ్రెస్​ను నాయకత్వం సమస్య వెంటాడుతోంది. రాహుల్​ గాంధీ రాజీనామా తర్వాత సోనియా గాంధీ తాత్కాలికంగా సారథ్య బాధ్యతలు చేపట్టినప్పటికీ.. 'కాంగ్రెస్​ అధ్యక్షుడు ఎవరు' అనే అంశంపై ఏడాది అయినా స్పష్టత రాలేదు. రాహుల్​ గాంధీ తిరిగి రావాలని, పార్టీని ముందుండి నడిపించాలని పార్టీలోని అనేకమంది ఇప్పటికీ డిమాండ్​ చేస్తున్నారు. మరో నెల రోజుల్లో సోనియా పదవీకాలం ముగుస్తున్న వేళ రాహుల్​ ఏం చేస్తారన్నది ప్రశ్నార్థకం.

Year after Rahul Gandhi's resignation, Leadership question still unanswered in Congress
ఏడాది గడిచినా.. కాంగ్రెస్​ న్యాయకత్వంపై వీడని అనిశ్చితి

దేశ రాజకీయాల్లో కాంగ్రెస్​ పాత్ర కీలకం. దేశాన్ని పాలించడంలో ఏ పార్టీకీ లేనంత అనుభవం కాంగ్రెస్​ సొంతం. కానీ అంతటి చరిత్ర ఉన్న పార్టీ పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరమైంది. నాయకత్వ లేమి, అంతర్గత సమస్యలతో ఉక్కిరిబిక్కరి అవుతోంది. ఇలా ఎంతకాలం? కాంగ్రెస్​కు పునర్​వైభవం తెచ్చేది ఎవరు? కాంగ్రెస్​ను ముందుండి నడిపించేది ఎవరు? శక్తిమంతమైన నరేంద్ర మోదీ-అమిత్​ షా ద్వయాన్ని ఢీకొట్టి విజయం సాధించే సత్తా ఎవరికి ఉంది? అన్న ప్రశ్నలకు దాదాపు కాంగ్రెస్​ సభ్యులందరూ చెబుతున్న ఏకైక సమాధానం.. 'రాహుల్​ గాంధీ'.

రాహుల్​ తిరిగి రావాలి...

లోక్​సభ ఎన్నికల్లో కాంగ్రెస్​ ఘోర పరాభవానికి బాధ్యత వహిస్తూ 2019 జులై 3న పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు రాహుల్​ గాంధీ. అనంతరం తాత్కాలికంగా ఆ పగ్గాలను సోనియా గాంధీకి అప్పగించారు కాంగ్రెస్​ పెద్దలు.

రాహుల్​ రాజీనామా చేసి ఏడాది గడిచినా.. పార్టీ నాయకత్వం విషయంలో ఇంకా అనిశ్చితి వీడలేదు. ఈ అంశం ఇంతకాలం అంతర్గతంగా ఉన్నప్పటికీ.. ఆగస్టు 10తో సోనియా పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఇది మళ్లీ తెరపైకి వచ్చింది.

ఇదీ చూడండి:- 'మోదీ జీ.. బెదిరింపులకు అందరూ లొంగరు'

నిజానికి సోనియా పగ్గాలు చేపట్టినప్పటికీ.. ఏడాది పొడవునా కాంగ్రెస్​ అధ్యక్ష పదవి అంశాన్ని పార్టీ సభ్యులు చర్చిస్తూనే ఉన్నారు. ఆనాడు రాహుల్​ రాజీనామా చేయకూడదని అభ్యర్థించిన కాంగ్రెస్​ సభ్యులు.. తిరిగి ఆయనే అధ్యక్ష పదవిని చేపట్టాలని ఇప్పటికీ డిమాండ్​ చేస్తున్నారు. కానీ రాహుల్​ ఏమాత్రం సానుకూలంగా స్పందించడంలేదు.

ఆగని ప్రయత్నాలు...

అయినా కాంగ్రెస్​ సభ్యులు తమ ప్రయత్నాలను మాత్రం ఆపడం లేదు. తాజాగా శనివారం జరిగిన కాంగ్రెస్​ లోక్​సభ ఎంపీల సమావేశంలోనూ ఈ విషయాన్ని ప్రస్తావించినట్టు తెలుస్తోంది. రాహుల్​ గాంధీ తిరిగి బాధ్యతలు స్వీకరించాలని ప్రతిపాదించారు సీనియర్​ నేత కె.సురేశ్​. ఆయనకు మరో ఆరుగురు ఎంపీలు మద్దతుపలికారు. కానీ రాహుల్​ మాత్రం ఎప్పటిలాగే మౌనంగా ఉండిపోయినట్టు సమాచారం.

ఎన్నో దశాబ్దాల చరిత్ర గల కాంగ్రెస్​ను తిరిగి గాడినపెట్టేందుకు రాహుల్​ లాంటి ధైర్యవంతులు పార్టీ అధ్యక్ష పదవిలో ఉండటం ఎంతో ముఖ్యమని నేతలు అంటున్నారు.

"పార్టీ పునరుద్ధరణలో ఎదుర్కొనే సవాళ్లను కాంగ్రెస్​ నాయకత్వం తీసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లోనే ధైర్యవంతులు, చైతన్యవంతులైన రాహుల్​-ప్రియాంక గాంధీ సేవలు పార్టీకి ఉపయోగపడతాయి. మోదీ-షా ద్వయాన్ని ఎదుర్కొనే సత్తా వీరికి ఉందని నేను నమ్ముతున్నా."

--- దిగ్విజయ్​ సింగ్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

పార్టీని రాహుల్​ గాంధీ ముందుండి నడిపిస్తే.. ఎంతటి త్యాగాలు చేయడానికైనా కాంగ్రెస్​ సభ్యులు వెనకాడరని దిగ్విజయ్​ సింగ్​ అభిప్రాయపడ్డారు.

" సోనియా, రాహుల్​, ప్రియాంక గాంధీ ముందు ఎన్నో సవాళ్లు ఉన్నాయి. కానీ వారు ఎదుర్కోగలరని నాకు తెలుసు. కాంగ్రెస్​ పార్టీ మొత్తం మీ వెంటే ఉంటుంది. మీరు డిమాండ్​ చేస్తే ఎంతటి త్యాగానికైనా పార్టీ సభ్యులు వెనకాడరు. రాహుల్​ జీ.. దయచేసి మమ్మల్ని ముందుండి నడిపించండి."

-- దిగ్విజయ్​ సింగ్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

ఇదీ చూడండి:- యూపీలో 'అగ్రవర్ణ' రాజకీయం కాంగ్రెస్​కు కలిసొచ్చేనా?

ఐకమత్యం లోపించి...

అయితే రాహుల్​ గాంధీ రాజీనామాకు 2019 లోక్​సభ ఎన్నికల్లో పార్టీ వైఫల్యాలతో పాటు మరో కారణం కూడా ఉంది. అదే.. కాంగ్రెస్​ సభ్యుల్లో లోపించిన ఐకమత్యం. ఈ విషయాన్ని రాహుల్​ అనేకమార్లు బహిరంగంగానే చెప్పారు. తన రాజీనామా లేఖలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో యుద్ధంలో తాను ఒంటరి పోరాటం చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.

ఏడాది గడిచినా.. పార్టీలో ఈ సమస్య ఇప్పటికీ కొనసాగుతున్నట్టు కనిపిస్తోంది. పార్టీ సభ్యులపై విమర్శలు చేస్తూ దిగ్విజయ్​ సింగ్​ చేసిన ఓ ట్వీట్​ ఇందుకు నిదర్శనం.

"జాతీయ అంశాల్లో రాహుల్​-ప్రియాంక చూపిస్తున్న దూకుడు వైఖరికి నేను మద్దతిస్తున్నా. కానీ కొందరు సభ్యులకు వీరి వైఖరి నచ్చడం లేదు. రాహుల్​-ప్రియాంకకు వారు మద్దతివ్వడం లేదు. అసలు అలాంటి వాళ్లు కాంగ్రెస్​లో ఉండటం ఎందుకు?"

--- దిగ్విజయ్​ సింగ్​, కాంగ్రెస్​ సీనియర్​ నేత.

ఇదీ చూడండి:- మిషన్​ 2022: సీఎం అభ్యర్థిగా ప్రియాంక గాంధీ!

మొర ఆలకించేనా?

సోనియ గాంధీ పదవీకాలన్ని మరికొంత కాలం పొడిగించే విషయంపై సీడబ్ల్యూసీ(కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ) ఓ నిర్ణయం తీసుకునే అవకాశముంది. అయితే పార్టీకి పూర్తి స్థాయి అధ్యక్షుడి అవసరం ఉందని కాంగ్రెస్​ నేతలు భావిస్తున్నారు.

ఇటీవలి కాలంలో.. అనేక అంశాల్లో కేంద్రంపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ కాంగ్రెస్​ సభ్యుల్లో ఉత్తేజాన్ని నింపుతున్నారు రాహుల్​. కీలక అంశాలపై వివిధ నేతలతో చర్చలు కూడా జరుపుతున్నారు. మరి కాంగ్రెస్​ సభ్యుల మొర ఆలకించి.. పార్టీ అధ్యక్ష పదవిని రాహుల్ తిరిగి చేపడతారా లేదా అన్నది ఆసక్తికరం.

ఇవీ చూడండి:-

Last Updated : Jul 12, 2020, 12:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.