ETV Bharat / bharat

18న షా సమక్షంలో కమలం గూటికి సువేందు!

author img

By

Published : Dec 15, 2020, 4:48 PM IST

టీఎంసీ అసంతృప్తి నేత సువేందు అధికారి.. ఈ నెల 18న భాజపాలో చేరనున్నట్టు తెలుస్తోంది. కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సమక్షంలో ఆయన భాజపా తీర్థం పుచ్చుకునే అవకాశమున్నట్టు సమాచారం.

Suvendu Adhikari to turn saffron on December 18 ?
18న కమలం గూటికి సువెందు!

బంగాల్​ కేబినెట్​ మంత్రి పదవికి రాజీనామా చేసి.. రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్​ ఇచ్చిన సువేందు అధికారి.. త్వరలోనే భాజపా గూటికి చేరనున్నట్టు సమాచారం. దిల్లీలో ఈ నెల 18న కేంద్ర హోం మంత్రి అమిత్​ షా సమక్షంలో సువేందు భాజపా తీర్థం పుచ్చుకోనున్నారని పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

రెండు రోజుల పర్యటనలో భాగంగా అమిత్​ షా ఈ నెల 19న బంగాల్​కు వెళ్లనున్నారు. ఆయనతో కలిసి సువేందు కూడా రాష్ట్రానికి వెళ్తారని సమాచారం. అయితే.. ఒక వేళ సువేందు దిల్లీకి వెళ్లకపోతే.. అమిత్​ షా పర్యటనలోనైనా ఆయన భాజపాలోకి చేరుతారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి.

సువేందు పార్టీ మార్పుపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే తృణమూల్​ కాంగ్రెస్​ సీనియర్​ నేత.. భాజపాలోకి చేరతాననంటే కచ్చితంగా ఆహ్వానిస్తామని ఈటీవీ భారత్​తో పేర్కొన్నారు బంగాల్ భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​.

"నేను సువేందుతో ప్రత్యక్షంగా మాట్లాడలేదు. కానీ కొందరు ఇప్పటికే మాట్లాడారు. ఈ విషయంపై పార్టీ అధిష్ఠానం ఓ నిర్ణయం తీసుకుంటుంది. సువేందు అధికారి వంటి నేతలు చేరితే భాజపా మరింత బలపడుతుంది. భాజపాలోకి సువేందుకు మేము స్వాగతిస్తాం."

--- దిలీప్​ ఘోష్​, బంగాల్​ భాజపా అధ్యక్షుడు.

మమతకు అత్యంత విశ్వాస పాత్రుడని గుర్తింపు ఉన్న తృణమూల్ కీలక నేత సువేందు అధికారి.. గత నెలలో కేబినెట్ మంత్రి పదవికి రాజీనామా చేశారు. పార్టీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సువేందు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

ఇదీ చూడండి:- 'సువేందుది ముగిసిన అధ్యాయం- ఇక మాటల్లేవ్​​'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.