ETV Bharat / bharat

'సమయాన్ని తగ్గించి జులైలో పరీక్షలు నిర్వహించండి'

author img

By

Published : Apr 30, 2020, 3:39 PM IST

Updated : Apr 30, 2020, 4:29 PM IST

Reduce exam duration
'సమయాన్ని తగ్గించి జులైలో పరీక్షలు నిర్వహించండి'

దేశంలో కరోనా క్రమంగా విజృంభిస్తున్న నేపథ్యంలో విశ్వవిద్యాలయాల్లో పరీక్షల నిర్వహణపై మార్గదర్శకాలు విడుదల చేసింది యూజీసీ. పరీక్షల వ్యవధిని 3 గంటల నుంచి 2 గంటలకు తగ్గించి ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా జులైలో నిర్వహించాలని సూచించింది. మధ్యంతర సెమిస్టర్ విద్యార్థులకు అంతర్గత మదింపు ద్వారా గ్రేడింగ్ ఇవ్వాలని పేర్కొంది.

కరోనా పరిస్థితులు, సాధ్యాసాధ్యాలను పరిశీలించి సెమిస్టర్ పరీక్షలు వచ్చే జులైలో ఆన్​లైన్ లేదా ఆఫ్​లైన్ ద్వారా నిర్వహించాలని విశ్వవిద్యాలయాలకు సూచించింది యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ). పరీక్షల నిర్వహణ వ్యవధిని 3గంటల నుంచి 2 గంటలకు కుదించాలని ఆదేశించింది.

కరోనా విజృంభన, లాక్ డౌన్ నేపథ్యంలో పరీక్షలు, అకాడమిక్ క్యాలెండర్ పై మార్గదర్శకాలను విడుదల చేసింది యూజీసీ. ఫైనల్ సెమిస్టర్ విద్యార్థులకు పరీక్షలను జులైలోనే నిర్వహించాలని తెలిపింది. మధ్యంతర సెమిస్టర్ విద్యార్థులకు మాత్రం అంతర్గత మదింపు ద్వారా గ్రేడింగ్​ ఇవ్వాలని సూచించింది. పరిస్థితులు కుదుటపడ్డ రాష్ట్రాల్లో జులైలో మాత్రమే పరీక్షలు నిర్వహించాలని సిఫార్సు చేసింది. అందుబాటులో ఉన్న వ్యవస్థలను బట్టి పరీక్షలు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో ఏది ఉత్తమమైనదో విశ్వవిద్యాలయాలే నిర్ణయించుకోవాలని యూజీసీ సూచించింది. ఆఫ్ లైన్ అయితే.. వ్యక్తిగత దూరం నిబంధనలు పాటించాలని పేర్కొంది. విద్యార్థుల ఆరోగ్యం, రక్షణే ప్రథమ ప్రాధాన్యం కావాలని స్పష్టం చేసింది.

అంతర్గత మదింపు ద్వారా..

కరోనా పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చినట్లు కనిపించకపోతే.. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని 50 శాతం అంతర్గత మదింపు, 50 శాతం గత సెమిస్టర్ ఫలితాలను బట్టి గ్రేడింగ్ ఇవ్వాలని చెప్పింది యూజీసీ. తొలి ఏడాది వార్షిక పరీక్షలు రాసేవారికి 100 శాతం అంతర్గత మదింపు ద్వారానే గ్రేడ్ ఇవ్వాలంది.

మెరుగైన గ్రేడ్ కావాలని కోరుకునే విద్యార్థులు తదుపరి సెమిస్టర్ లో ప్రత్యేక పరీక్షలు రాయాల్సి ఉంటుందని యూజీసీ వెల్లడించింది.

ఆగస్టు 1 నుంచి విశ్వవిద్యాలయాల్లో అడ్మిషన్ల ప్రక్రియను మొదలు పెట్టాలని ఆదేశించింది.

ఇదీ చూడండి:అదనపు సమయంతో అధ్యయనానికి మెరుగులు

Last Updated :Apr 30, 2020, 4:29 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.