ETV Bharat / spiritual

మోహిని ఏకాదశి రోజు ఈ వస్తువులు దానం చేస్తే కోరికలన్నీ తీరుతాయట! - Mohini Ekadashi Special

author img

By ETV Bharat Telugu Team

Published : May 18, 2024, 3:58 PM IST

Mohini Ekadashi 2024 : హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. శుక్ల పక్ష ఏకాదశి బహుళ పక్ష ఏకాదశి ఏదైనా ప్రతి ఏకాదశికి ఓ ప్రత్యేకత ఉంటుంది. వైశాఖ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతం ఎలా చేయాలి? మోహిని ఏకాదశి వ్రతం చేసిన వారు ఎలాంటి పుణ్య ఫలం పొందుతారు అనే ఆసక్తికర విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం.

Mohini Ekadashi 2024
Mohini Ekadashi 2024 (Getty Images)

Mohini Ekadashi 2024 : అమరత్వాన్ని ప్రసాదించే అమృతం కోసం దేవదానవులు చేసిన క్షీరసాగర మధనం నుంచి ఉద్భవించిన అమృతాన్ని పొందడం కోసం దేవదానవులు యుద్ధానికి దిగిన సమయంలో శ్రీ మహావిష్ణువు మోహినిగా మారుతాడు. అత్యంత సుందరమైన మోహినిని చూసి అందరి మనసులు చలిస్తాయి. ఆ సమయంలో మోహిని రూపంలో విష్ణుమూర్తి అమృతాన్ని దేవతలకు మాత్రమే అందేలా చేసి దేవతలకు అమరత్వం కలిగిస్తాడు. అలా విష్ణుమూర్తి మోహిని అవతారం స్వీకరించిన వైశాఖ శుద్ధ ఏకాదశిని మోహిని ఏకాదశిగా జరుపుకుంటాం.

విష్ణుమూర్తి ఆరాధన అనంతకోటి పుణ్యం
మోహిని ఏకాదశి రోజు శ్రీ మహా విష్ణువుని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని, రోజువారీ జీవితాల్లో ఎదురయ్యే ఆర్థికపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని శాస్త్ర వచనం.

మోహిని ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి
అన్ని ఏకాదశుల మాదిరిగానే మోహిని ఏకాదశి రోజు కూడా రోజంతా పూర్తిగా ఉపవాసం ఉండాలి. కేవలం జలం మాత్రమే స్వీకరిస్తూ రోజంతా విష్ణుమూర్తి పూజలు, భజనలు చేస్తూ కాలక్షేపం చేయాలి. ఆరోగ్య సమస్యలు కారణంగా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లు వంటి సాత్వికాహారం తీసుకోవచ్చు. ఇలా ఏకాదశి ఘడియలు పూర్తి అయ్యేంతవరకు ఉపవాసం ఉండి ద్వాదశి ఘడియలు రాగానే శుచిగా ప్రసాదం తయారు చేసుకుని శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని భక్తి శ్రద్ధలతో పారాయణ చేయాలి. అనంతరం నైవేద్యం, మంగళ హారతులు ఇచ్చి ప్రసాదాన్ని భక్తితో స్వీకరించి ఉపవాసాన్ని విరమించాలి.

కోరిన కోర్కెలు తీర్చే దానాలు
మోహిని ఏకాదశి రోజు ధాన్యం, వస్త్రాలు, ఆహారపదార్ధాలు, జలం, రాగి సామాగ్రి, నిరుపేదలకు దుప్పట్లు, బ్రాహ్మణులకు పండ్లు, తేనే, స్వచ్ఛమైన నెయ్యి వంటివి దానం చేస్తే కోరిన కోరికలు తీరుతాయని శాస్త్ర వచనం.

మోహిని ఏకాదశి వ్రత ఫలితం
నియమ నిష్టలతో మోహిని ఏకాదశి వ్రతాన్ని చేసిన వారికి అనంత కోటి పుణ్య ఫలం దక్కుతుందని శాస్త్ర వచనం. ఈ ఒక్క ఏకాదశి వ్రతం చేస్తే వెయ్యి గోవులను దానం చేసిన ఫలితం కలుగుతుందని సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే వరమిచ్చాడు. శ్రీ మహా విష్ణువు ఎలాగైతే మోహినిగా మారి దేవతల కష్టాలు తీర్చాడో అలాగే మన కష్టాలు కూడా పోవాలని, మనిషిలోని చెడు గుణాలనే రాక్షస ప్రవృత్తి పోయి మంచి గుణాలనే సాత్విక ప్రవృత్తి పెరగాలని ఈ మోహిని ఏకాదశి వ్రతం ఆచరిస్తారు.

ముఖ్యగమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. అంతే కానీ, వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవనే విషయాన్ని పాఠకులు గమనించాలి. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.

పెయింట్స్ లేని ఇంట్లో దరిద్ర దేవత తిష్ఠ- తులసి మొక్క బాధ్యత యజమానిదే! - Vastu Shastra Tips For Home

వినాయకుడి ముందు గుంజీలు ఎందుకు తీస్తారు? అసలు విషయం తెలిస్తే మీరు కూడా! - Gunjillu In Vinayaka Temple

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.