ETV Bharat / bharat

రాజస్థాన్​లో జోరుగా రిసార్టు రాజకీయం

author img

By

Published : Jun 12, 2020, 2:28 PM IST

రాజ్యసభ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజస్థాన్​లో రిసార్టు రాజకీయాలు జోరందుకున్నాయి. ఎమ్మెల్యేలను భాజపా మభ్యపెడుతోందన్న ఆరోపణల మధ్య అధికార కాంగ్రెస్ పార్టీ.. 100 మంది శాసన సభ్యులను రిసార్టుకు తరలించింది. ఎమ్మెల్యేలంతా ఐకమత్యంతోనే ఉన్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ స్పష్టం చేశారు.

Rajasthan Congress MLAs stay overnight at resort to thwart 'poaching bid'
రాజ్యసభ ఎన్నికల వేళ రాజస్థాన్​లో రిసార్టు రాజకీయం!

రాజస్థాన్​లో అధికార పార్టీ శాసనసభ్యులను భాజపా మభ్యపెట్టేందుకు యత్నిస్తోందన్న ఆరోపణల మధ్య ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తతతో వ్యవహరిస్తోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ సహా 100 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దిల్లీ- జైపుర్ రహదారిలో ఉన్న ఓ రిసార్టులో రాత్రంతా బస చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఎమ్మెల్యేలకు ఇతర పార్టీలు ఎరవేసే అవకాశం ఉన్నందున వారందరినీ రిసార్టులోనే ఉండాలని పార్టీ ఆదేశించినట్లు స్పష్టం చేశాయి.

ఉపముఖ్యమంత్రి సచిన్ పైలట్ సహా కీలక నేతలతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్. తమ ఎమ్మెల్యేలంతా ఐకంగానే ఉన్నారని స్పష్టం చేశారు. కాంగ్రెస్ తరపున రాజ్యసభ బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్థులు సునాయాసంగా విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

"రాజ్యసభ ఎన్నికలు రెండు నెలల క్రితమే నిర్వహించాల్సింది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను భాజపా కొనుగోలు చేయడం పూర్తి కాలేదు కాబట్టే ఎన్నికలను వాయిదా వేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి ఒక్క ఓటు కూడా ఇతర పార్టీల అభ్యర్థులకు పడదు. ఇద్దరు సీపీఎం ఎమ్మెల్యేల మద్దతు మాకు ఉంది. "

-అశోక్ గహ్లోత్, రాజస్థాన్ ముఖ్యమంత్రి

రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేల వ్యవహారాన్ని స్వయంగా ముఖ్యమంత్రి గహ్లోత్​ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లు రాజస్థాన్ ప్రభుత్వ చీఫ్ విప్ మహేశ్ జోషి తెలిపారు. వ్యక్తిగత, ఆరోగ్య కారణాలతో 8-10 మంది ఎమ్మెల్యేలు రిసార్టు నుంచి వెళ్లిపోయారని.. త్వరలోనే వారందరూ తిరిగివస్తారని స్పష్టం చేశారు. ప్రస్తుతం 100 మంది ఎమ్మెల్యేలు రిసార్టులో ఉన్నట్లు వెల్లడించారు.

కాంగ్రెస్ సునాయాసంగా...

రాజస్థాన్​లో మూడు రాజ్యసభ సీట్లకు ఎన్నికలు జరగనుండగా... కాంగ్రెస్, భాజపాలు ఇద్దరు చొప్పున అభ్యర్థులను బరిలోకి దించాయి. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 200 స్థానాల్లో కాంగ్రెస్​కు 107, భాజపాకు 72 సీట్ల బలం ఉంది. కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్న ఇద్దరు నేతలు సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.