ETV Bharat / bharat

కొత్త పార్లమెంట్ భవనానికి గురువారం భూమిపూజ

author img

By

Published : Dec 9, 2020, 7:15 PM IST

Updated : Dec 9, 2020, 11:04 PM IST

దిల్లీ నడిబొడ్డున కొలువుదీరిన పార్లమెంట్‌ భవనం... ప్రజాస్వామ్య స్ఫూర్తికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. వందేళ్ల చరిత్ర ఉన్న ప్రస్తుత భవనం స్థానంలో కేంద్రం కొత్తగా నిర్మిస్తున్న పార్లమెంట్‌.. సరికొత్త హంగులతో, అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకోనుంది. ఇప్పటి వరకు చట్టసభ్యులకు అందుబాటులో లేని ఎన్నో ప్రత్యేకతల సమాహారంగా నిర్మిస్తున్న ఈ నిర్మాణం... దేశ వైవిధ్య సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం.

PARLIAMENT BUILDING
భారతీయుల కలల చిహ్నం.. ప్రజాస్వామ్య సౌధం

భారతీయుల కలల సాకారానికి గుర్తుగా నిలిచే నూతన పార్లమెంటు భవనానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. దిల్లీలో ప్రస్తుత పార్లమెంట్‌ భవనానికి సమీపంలోనే ఈ నిర్మాణాలు చేపట్టనున్నారు. దేశ సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటేలా నూతన భవనాన్ని రూపొందిస్తున్నట్లు వెల్లడించిన కేంద్రం... ప్రస్తుత భవనానికి వందేళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలోనే కొత్త భవన నిర్మాణానికి సంకల్పించినట్లు చెబుతోంది.

ఆధునిక హంగులతో నిర్మిస్తున్న ఈ భవనంలో ఎన్నో ప్రత్యేక సౌకర్యాలను కల్పించనున్నారు. మరో రెండేళ్లలో స్వతంత్ర భారతావని 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా ఈ నూతన భవనంలోనే ఉభయ సభల సమావేశాలను నిర్వహించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఈ భవనంలో ఎన్నో విశిష్టతలు ఉన్నాయి.

PARLIAMENT BUILDING
పార్లమెంట్ భవన నమూనా

అత్యాధునిక సాంకేతికతతో

రూ. 971 కోట్లతో నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక ప్రాజెక్టును టాటా సంస్థ దక్కించుకుంది. దీనికి హెచ్​సీపీ డిజైన్, ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌ ప్రైవేట్ లిమిటెడ్ రూపకల్పన చేస్తోంది. ఈ భారీ భవనానికి ఆరు ప్రవేశ మార్గాలను ఏర్పాటు చేస్తుండగా.. వాటిలో రాష్ట్రపతి, ప్రధాన మంత్రికి ప్రత్యేక మార్గాన్ని కేటాయించారు. లోక్‌సభ సభాపతి, రాజ్యసభ చైర్‌పర్సన్, ఎంపీలలకు ఓ మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నారు.

  • మొత్తంగా 64 వేల 500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణం
  • అధిక తీవ్రతతో వచ్చే భూకంపాలను సైతం తట్టుకునే సామర్థ్యం
  • నాలుగు అంతస్తుల్లో నూతన పార్లమెంట్ భవనం
  • భూగర్భంలోని లోయర్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 20 మంత్రుల కార్యాలయాలు, గ్రౌండ్‌ ఫ్లోర్‌లో 18 కార్యాలయాలు
  • మొదటి అంతస్థులో 26, రెండో అంతస్థులో 28 కార్యాలయాల నిర్మాణం
  • లోక్‌సభకు ఆనుకొనే ఉండే విధంగా ప్రధాన మంత్రి కార్యాయం

ఈ నిర్మాణాన్ని దేశీయ వాస్తు రీతుల్లో నిర్మించడం మరో ముఖ్యమైన విశేషం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన వాస్తు రీతులను ఈ నిర్మాణాల్లో చూడవచ్చని అధికారులు చెబుతున్నారు. వివిధ ప్రాంతాలకు చెందిన 200 మందికి పైగా కళాకారులను నిర్మాణంలో భాగస్వాములను చేసింది కేంద్రం.

సకల సౌకర్యాలతో

ప్రస్తుతం చట్ట సభ్యుల సంఖ్యకు తగిన సౌకర్యాలు లేవని భావిస్తున్న కేంద్రం.. నూతన పార్లమెంట్‌ భవనంలోని లోక్‌సభ ఛాంబర్‌లో 888 సీట్లు, రాజ్యసభ ఛాంబర్లో 384 సీట్లును ఏర్పాటు చేస్తోంది. పార్లమెంట్‌ కమిటీ సమావేశ మందిరాలు, పార్లమెంటరీ వ్యవహారాల ప్రధాన కార్యాలయాలు, లోక్‌సభ సచివాలయం, రాజ్యసభ సచివాలయం, ప్రధాన మంత్రి కార్యాలయం, ఎంపీల కార్యాలయాలు, సిబ్బంది, భద్రతా సిబ్బంది కోసం ప్రత్యేకంగా గదులు ఉండనున్నాయి. ఈ భవనంలో దాదాపు 120 పైగా ఇలాంటి కార్యాలయాలను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. లోక్‌సభ, రాజ్యసభ గ్యాలరీల్లో మీడియా, సాధారణ ప్రజల కోసం 480 సీట్లను ఏర్పాటు చేస్తున్నారు. సభ్యుల సీట్ల పరిమాణాన్ని కూడా పెంచనున్నారు.

PARLIAMENT BUILDING
నూతన పార్లమెంట్ భవనం

సమావేశ మందిరాల్లోనూ ఆధునిక సదుపాయాలను సమకూర్చనున్నారు. ప్రస్తుతం తొలి రెండు వరుసల్లో కూర్చునే వారికే డెస్క్‌ సౌకర్యం ఉండగా... కొత్త దాంట్లో అందరికీ ఆ సౌకర్యాన్ని కల్పించనున్నారు.

  • సభ్యుల ఎదురుగా ఫర్నిచర్‌లో స్మార్ట్ డిస్‌ప్లేల ఏర్పాటు
  • సభ్యులు మాట్లాడేటప్పడు ఒక భాష నుంచి మరొక భాషలోకి తక్షణం అనువదించే ఏర్పాట్లు
  • ప్రత్యేక మైక్రోఫోన్, రికార్డింగ్, ఓటేందుకు వీలుగా బయోమెట్రిక్ సదుపాయం

సభ్యులు వేసే ఓటు స్పష్టంగా కనిపించడానికి కొత్త భవనంలో 281 అంగుళాల వీడియో తెరను, గ్యాలరీల్లో కూర్చొనే ప్రజలకు సభా కార్యక్రమాలు కనిపించేలా 165 అంగుళాల తెరను ఏర్పాటు చేయనున్నారు.

అధునాతన నిఘా

నూతన పార్లమెంట్‌లోని లోక్‌సభ పైకప్పును జాతీయ పక్షి అయిన నెమలి పింఛం, రాజ్యసభ పైకప్పును జాతీయ పుష్పమైన కమలం ఆకారాల్లో రూపుదిద్దనున్నారు. సెంట్రల్‌ లాంజ్, కోర్టు యార్డులో జాతీయ వృక్షం మర్రిచెట్టును యథాతథంగా ఉంచుతారు. భవనంలో అడుగడుగునా అధునాతన నిఘా కెమెరాలతో పటిష్ఠ ఏర్పాట్లు చేయనున్నారు.

గ్రంథాలయం, రాజ్యాంగ హాల్​

నూతన పార్లమెంట్ భవనం నిర్మాణంలో వాయు, శబ్ద కాలుష్యాన్ని నియంత్రించేందుకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నట్లు కేంద్రం పేర్కొంది. ఎంపీలందరికీ ప్రత్యేక కార్యాలయాలు ఉంటాయని, కాగిత రహిత సమావేశాలకు అనుగుణంగా సరికొత్త ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది. పార్లమెంటు సభ్యులకు లాంజ్, గ్రంథాలయం, బహుళ కమిటీ గదులు, భోజన ప్రదేశాలు, విశాలమైన పార్కింగ్ స్థలం ఉండేలా ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించింది. కొత్త భవనంలో భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వాన్ని ప్రదర్శించేందుకు ఒక రాజ్యాంగ హాల్‌ను సైతం నిర్మించనున్నారు.

2022 అక్టోబర్ నాటికి పూర్తి

ప్రస్తుతం ఉన్న పార్లమెంటు భవనానికి సమీపంలోనే నూతన భవన నిర్మాణం చేపట్టనుండగా... దాదాపు రూ. 861 కోట్లతో సెంట్రల్‌ విస్తా రీడెవలప్‌మెంట్‌ ప్రాజెక్ట్‌లో భాగంగా 22 నెలల వ్యవధిలో పార్లమెంట్ భవనం పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది. కొత్త భవనం నిర్మాణం పూర్తయ్యాక ప్రస్తుతం ఉన్న ఉత్తర, దక్షిణ బ్లాకులను మ్యూజియంగా మార్చి...సందర్శకులకు అవకాశం కల్పించనున్నట్లు అధికార వర్గాలు వివరించాయి. 2022 అక్టోబర్‌ నాటికి కొత్త పార్లమెంట్‌ భవన నిర్మాణం పూర్తవనుండగా... అప్పటివరకు ఇప్పుడున్న పార్లమెంట్‌ భవనంలోనే సమావేశాలు నిరాటంకంగా జరిగేలా చర్యలు తీసుకున్నట్లు లోక్‌సభ సెక్రటేరియట్‌ వెల్లడించింది.

Last Updated : Dec 9, 2020, 11:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.