ETV Bharat / bharat

'మన భూభాగంలోకి ఎవ్వరూ చొరబడలేదు'

author img

By

Published : Jun 20, 2020, 5:09 AM IST

Updated : Jun 20, 2020, 10:02 AM IST

తూర్పు లద్దాఖ్​లోని గల్వాన్​ లోయలో వీర మరణం పొందిన జవాన్లు.. భారత్​ వైపు కన్నెత్తి చూసినవారికి తగిన గుణపాఠం నేర్పారని పేర్కొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దేశ సరిహద్దులోకి ఎలాంటి చొరబాటూ జరగలేదని స్పష్టం చేశారు. సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. లద్దాఖ్​లో చైనాతో ఉద్రిక్త పరిస్థితులపై అఖిలపక్ష భేటీలో ఈ మేరకు వ్యాఖ్యానించారు మోదీ.

PM at all-party meet
'మన భూభాగంలోకి ఎవ్వరూ చొరబడలేదు'

దేశ సరిహద్దుల్లోకి ఎవ్వరూ చొరబడలేదని, ఎలాంటి చొరబాటూ జరగలేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. మన పోస్టుల్లో ఏదీ ఇంకొకరి కబ్జాలో లేదన్నారు. లద్ధాఖ్‌లో ఆత్మబలిదానం చేసిన వీర జవాన్లు... భారత్‌ వైపు కన్నెత్తి చూసినవారికి గుణపాఠం నేర్పి పోయారన్నారు. సరిహద్దుల రక్షణలో మన సైన్యం పూర్తి శక్తిసామర్థ్యాలతో పనిచేస్తోందనీ, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే వెసులుబాటు వారికి కల్పించామని ప్రధాని వెల్లడించారు. దేశ రక్షణ పట్ల ఎవరికీ వీసమెత్తు అనుమానం అక్కర్లేదని భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన శుక్రవారం అఖిలపక్ష సమావేశంలో మాట్లాడారు. లద్దాఖ్​‌ సరిహద్దుల్లో చైనా కవ్వింపులకు కారణాలేంటన్నది వివరించారు. ఈ విషయంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని వెల్లడించారు.

ఈ నెల 16న గల్వాన్‌ లోయలో చైనా బలగాలతో చోటుచేసుకున్న ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ నేపథ్యంలో- సరిహద్దుల్లోని పరిస్థితులను వివరించి, రాజకీయ ఏకాభిప్రాయాన్ని కూడగట్టేందుకు మోదీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. వాస్తవాధీన రేఖ వద్ద యథాతథ పరిస్థితిని పునరుద్ధరించాలని ఈ సందర్భంగా విపక్షాలు డిమాండ్‌ చేశాయి. అఖిలపక్ష నేతల అభిప్రాయాలను విన్న తర్వాత మోదీ మాట్లాడారు.

"గత ఐదేళ్లలో దేశ సరిహద్దుల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. సైన్యానికి అవసరమైన యుద్ధవిమానాలు, ఆధునిక హెలికాప్టర్లు, క్షిపణి రక్షణ వ్యవస్థను బలోపేతం చేసింది. దీంతో వాస్తవాధీనరేఖ వద్ద గస్తీ పెరిగింది. అక్కడి కార్యకలాపాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం వస్తోంది. ఇప్పటివరకూ అడిగేవారు, అడ్డుకునేవారు లేనిచోట.. మన సైన్యం అడుగడుగునా అడ్డుకుంటోంది. దేశంతోపాటు, దేశ ప్రజల రక్షణ కూడా సర్వోన్నతమే. ట్రేడ్‌, కనెక్టివిటీ, కౌంటర్‌ టెర్రరిజం వంటి విషయాల్లో బయటివారి జోక్యాన్ని సహించం.

భారత్‌కు చెందిన అంగుళం భూమివైపు కన్నెత్తిచూసే ధైర్యం ఎవ్వరికీ లేదు. అలాంటి దుస్సాహసానికి పాల్పడినవారికి అమర జవాన్లు గుణపాఠం నేర్పి పోయారు. ఎల్‌ఏసీ వద్ద చైనా అకృత్యం పట్ల యావద్దేశం ఆగ్రహం, ఆక్రోశంతో ఉంది. ఆ భావన మీ అందరి నుంచి పదేపదే వ్యక్తమైంది. దేశరక్షణలో మన సైన్యం వీసమెత్తు అవకాశాన్ని కూడా వదిలిపెట్టడం లేదని భరోసా ఇస్తున్నా. డెప్లాయ్‌మెంట్‌, యాక్షన్‌, కౌంటర్‌ యాక్షన్‌లతోపాటు... భూ, వాయు జలమార్గాల్లో దేశ రక్షణకు వారు చేయాల్సిందంతా చేస్తున్నారు. మరోవైపు... దౌత్యమార్గాల ద్వారా చైనాకు మన వైఖరిని విస్పష్టం చేశాం. భారత్‌ శాంతిని కోరుకుంటుంది. అదే సమయంలో దేశ సార్వభౌమాధికార పరిరక్షణ మనకు అత్యంత ముఖ్యం.

మీరు పంచుకున్న ఆలోచనలు గొప్పగా ఉన్నాయి. ఈ సమావేశం ద్వారా రాత్రింబవళ్లు దేశ సరిహద్దులను కాపాడుతున్న వీర జవాన్లకు అండగా నిలబడ్డాం. వారి శౌర్యం, బలిదానం ప్రతి భారతీయుడి గుండెల్లో చిరస్థాయిగా ఉంటాయి. మీరంతా ఇదే చెప్పారు. యావద్దేశం అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను. తూర్పు లద్ధాఖ్‌లోని పరిస్థితుల గురించి కేంద్ర రక్షణ, విదేశాంగ మంత్రులు చెప్పిన విషయాలను మీరు విన్నారు. సలహాలిచ్చిన పార్టీలకు హృదయపూర్వక ధన్యవాదాలు. మీ సూచనలు భవిష్యత్తు వ్యూహరచనకు ఉపయోగపడతాయన్న నమ్మకముంది. మీరంతా ఒక్కటై ముందుకు రావడం వల్ల సైన్యానికి నైతిక స్థైర్యం పెరుగుతుంది"

- నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి.

ఎవరేం అన్నారంటే...

  • నిఘా వర్గాల సమాచారం రాలేదా?

''అఖిలపక్ష సమావేశం ముందుగానే నిర్వహించాల్సింది. కాంగ్రెస్‌కు కొన్ని ప్రశ్నలున్నాయి. ఏరోజు చైనా బలగాలు చొరబడ్డాయి? అతిక్రమణలను ఎప్పుడు గుర్తించారు? ప్రభుత్వానికి ఉపగ్రహ చిత్రాలు అందలేదా? అసాధారణ కార్యకలాపాల గురించి నిఘా వర్గాలు ఉప్పందించలేదా? అక్కడ యథాతథ స్థితిని పునరుద్ధరిస్తామని ప్రజలకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలి. పర్వత ప్రాంతాల్లో గస్తీ కాస్తున్నవారి పరిస్థితేంటి?''

- సోనియాగాంధీ, కాంగ్రెస్‌ అధ్యక్షురాలు

  • టెలికాం, రైల్వేల్లోకి చైనాను రానివ్వొద్దు

''చైనా నియంతృత్వ దేశం. వారు అనుకున్నది చేస్తారు. మనం కలిసికట్టుగా పనిచేస్తే భారత్‌ విజయం సాధిస్తుంది. చైనా ఓడిపోతుంది. ఐక్యంగా మాట్లాడండి, ఆలోచించండి, పనిచేయండి. మేం ప్రభుత్వానికి అండగా ఉంటాం. రైల్వే, టెలికాంరంగాల్లోకి చైనాను రానివ్వకండి.''

- మమతా బెనర్జీ, బంగాల్‌ సీఎం

  • అనైక్యత అనర్థం

''చైనా నుంచి ప్రవాహంలా వస్తున్న వస్తువులు సమస్యగా మారాయి. వాటిలోని ప్లాస్టిక్‌ మన పర్యావరణానికి ప్రమాదకరంగా మారింది. మన్నికలేని వస్తువులతో ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు భారీగా పోగవుతున్నాయి. ఇలాంటి సమయంలో అంతా ఒక్కటై కేంద్రానికి మద్దతుగా నిలవడం మన బాధ్యత. పార్టీలు అనైక్యతను ప్రదర్శిస్తే... మిగతా దేశాలు దానిని అవకాశంగా మార్చుకుని, దుర్వినియోగం చేసే ప్రమాదముంది.''

-నితీశ్‌ కుమార్‌, బిహార్‌ ముఖ్యమంత్రి

  • శాంతి బలహీనతకాదు

''భారత్‌ శాంతిని కోరుకున్నంత మాత్రాన బలహీనంగా ఉన్నట్టు కాదు. మోసం చైనా నైజం. గుడ్లు పీకి చేతుల్లో పెట్టే శక్తిసామర్థ్యాలు మన ప్రభుత్వానికి ఉన్నాయి. మనమంతా ఒక్కటే. ప్రధానికి, సాయుధ బలగాలకు, వారి కుటుంబాలకు అండగా ఉంటాం.''

- ఉద్ధవ్‌ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం

  • అంతర్జాతీయ ఒప్పందాలను గౌరవించాలి

''రక్షణ బలగాలు ఆయుధాలను ధరించాలా? వద్దా? అన్నది అంతర్జాతీయ ఒప్పందాలు నిర్ణయిస్తాయి. అలాంటి సున్నితమైన అంశాలను మనం గౌరవించాల్సి ఉంది.''

- శరద్‌పవార్‌, ఎన్సీపీ

  • ఎల్‌ఏసీని స్పష్టంగా గీయాలి

కేంద్ర ప్రభుత్వం ఉన్నతస్థాయి చర్చలు ప్రారంభించాలి. అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి. ఎల్‌ఏసీని స్పష్టంగా గీయడంతోపాటు... సరిహద్దుల్లో శాంతి, సామరస్యం నెలకొనేలా చర్యలు చేపట్టాలి. కార్గిల్‌ యుద్ధ సమయంలో జరిగిన లోపాలపై నాటి ప్రధాని వాజ్‌పేయీ ఓ కమిటీని వేశారు. నిఘా వైఫల్యంపై అలాంటి కమిటీ ఏమన్నా వేస్తారా?

- సీతారాం ఏచూరి, సీపీఎం, ప్రధాన కార్యదర్శి

  • అంగుళం భూమినీ ఆక్రమించలేరు

దేశం కరోనాతో సతమతమవుతుంటే... కొత్త సమస్య తలెత్తింది. ఇంతటి క్లిష్ట సమయంలో ప్రధానికి తమిళనాడు ప్రజలు పూర్తి అండగా ఉంటారు. మన భూభాగంలో కనీసం అంగుళం స్థలాన్ని కూడా ఎవరూ ఆక్రమించలేరు.

- పన్నీర్‌సెల్వం (ఏఐఏడీఎంకె), తమిళనాడు

ఇదీ చూడండి: దేశ రక్షణే తొలి ప్రాధాన్యం- సైన్యానికి పూర్తి స్వేచ్ఛ: మోదీ

Last Updated :Jun 20, 2020, 10:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.