ETV Bharat / bharat

'మోదీ మంత్ర'తో బిహార్​లో ఎన్​డీఏ జోరు

author img

By

Published : Nov 11, 2020, 4:51 AM IST

ఎగ్జిట్​ పోల్స్​ అంచనాలను తారుమారు చేస్తూ బిహార్​లో ఎన్​డీఏ కూటమి సాధారణ మెజార్టీ సాధించింది. ఈ కూటమిలో అతిపెద్ద పార్టీగా నిలిచింది భాజపా. మహాకూటమి ఎన్నో ఆశలు పెట్టుకున్నా.. చివరకు అధికారానికి కాస్త దూరంలో ఆగిపోయింది. ఒక దశలో ఎన్నికల ఫలితాలు సంకీర్ణ సర్కారుకు దారితీస్తాయా అనే సందేహానికి తెరతీశాయి. పార్టీల పరంగా ఆర్​జేడీ అతిపెద్దదిగా నిలిచింది.

nda-won-125-seats-in-bihar
'మోదీ మంత్ర'తో బిహార్​లో ఎన్​డీఏ జోరు

యావద్దేశం ఆసక్తిగా గమనించిన బిహార్ శాసనసభ ఎన్నికల్లో ఎన్​డీఏ కూటమి అధికారం నిలబెట్టుకుంది. హోరాహోరీగా సాగిన పోరులో ప్రతిపక్ష మహాగట్‌బంధన్ నుంచి గట్టిపోటీ ఎదురైనప్పటికీ సాధారణ మెజార్టీని కైవసం చేసుకుంది. ఎన్​డీఏ కూటమిలో భాజపా అత్యధికంగా 74 స్థానాల్లో గెలుపొందగా, ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ నేతృత్వంలోని జేడీయూ 43 సీట్లకే పరిమితమైంది. జేడీయూ గెలుపు అవకాశాలను చాలా చోట్ల లోక్‌జనశక్తి పార్టీ దెబ్బకొట్టగా.. కాంగ్రెస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించకలేకపోవడం మహాకూటమి అవకాశాలను నీరుగార్చింది.

అంచనాలు తారుమారు...

ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలను తలకిందులు చేస్తూ బిహార్ శాసనసభ ఎన్నికల ఫలితాల్లో ఎన్​డీఏ కూటమి అధికారం నిలబెట్టుకుంది. మొత్తం 243 స్థానాలకుగానూ సాధారణ మెజార్టీకి మూడు సీట్లు ఎక్కువగా.. 125 చోట్ల విజయం సాధించింది. ఎన్​డీఏలో అతిపెద్ద పార్టీగా అవతరించిన భాజపా 74 చోట్ల జయభేరి మోగించింది. జేడీయూ 43 చోట్ల గెలవగా, హిందుస్థానీ అవామీ మోర్చా 4, వికాస్‌శీల్‌హిన్సాన్‌ 4 చోట్ల గెలుపొందారు.

ప్రతిపక్ష మహాగట్‌బంధన్‌లో ఆర్​జేడీ 74 చోట్ల విజయం సాధించగా, కాంగ్రెస్‌ 19, వామపక్షాలు 17 చోట్ల గెలిచాయి. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌పై వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఎన్​డీఏ కూటమి నుంచి విడిపోయి ఒంటరిగా పోటీచేసిన ఎల్​జేపీ ఒక్క స్థానానికే పరిమితమైంది. బిహార్‌ ఎన్నికల్లో ప్రత్యేక కూటమి కట్టి పోటీలో దిగిన ఎంఐఎం 5 చోట్ల జయభేరి మోగించింది. బీఎస్పీ, స్వతంత్ర అభ్యర్థి ఒక్కోచోట గెలిచారు.

నెరవేరిన పాసవాన్​ లక్ష్యం...

కేంద్రం, రాష్ట్రంలో చేసిన అభివృద్ధే ప్రధాన అజెండాగా ఎన్నికలకు వెళ్లిన ఎన్​డీఏ బిహార్‌ ప్రజల మనసు గెలవడంలో సఫలీకృతమయ్యింది. అయితే జేడీయూ కంటే భాజపాకు ఎక్కువస్థానాలు వచ్చినందున ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరు అధీష్టిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ పార్టీని దెబ్బతీయాలన్న ఎల్​జేపీ నేత చిరాగ్ పాసవాన్​ లక్ష్యం నెరవేరినట్లే కనిపిస్తోంది. సుమారు 30 స్థానాల్లో జేడీయూ గెలుపు అవకాశాలకు లోక్‌జనశక్తి పార్టీ గండికొట్టినట్లు తెలుస్తోంది.

గత ఎన్నికల మాదిరిగానే ఆర్​జేడీ సత్తా చాటినప్పటికీ భాగస్వామ్య పార్టీ కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపకపోవడం మహాగట్‌బంధన్‌ను అధికారానికి దూరం చేసింది. ఎంఐఎం సైతం ప్రతిపక్ష కూటమి ఓట్లను భారీగా చీల్చినట్లు స్పష్టమవుతోంది. ముఖ్యంగా సీమాంచల్ ప్రాంతంలో మజ్లిస్ పార్టీ సత్తాచాటింది. బహదూర్‌గంజ్‌, బైసీ, జోకిహత్‌, కొచ్చధామం, అమౌర్‌లో ఎంఐఎం అభ్యర్థులు గెలుపొందారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.