ETV Bharat / bharat

ఈ నెల 10న పార్లమెంట్​ నూతన భవనానికి శంకుస్థాపన

author img

By

Published : Dec 5, 2020, 3:04 PM IST

Updated : Dec 5, 2020, 5:44 PM IST

పార్లమెంట్ నూతన భవన నిర్మాణ పనులు డిసెంబర్ 10న ప్రారంభించనున్నట్లు లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. భూమి పూజ చేయనున్నట్లు చెప్పారు.

parliament
పార్లమెంట్ నూతన భవనం నమూనా

నూతన పార్లమెంట్​ శంకుస్థాపనకు ముహూర్తం ఖరారైంది. డిసెంబర్ 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ పనులు ప్రారంభించేందుకు భూమి పూజ చేయనున్నట్లు లోక్​సభ స్పీకర్ ఓంబిర్లా తెలిపారు. 66,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో రూ. 971 కోట్ల వ్యయంతో ఈ నిర్మాణం చేపట్టనున్నట్లు వెల్లడించారు. రానున్న కాలంలో పార్లమెంట్ సభ్యుల సంఖ్య పెరుగుతుందని, ఈ అవసరాలను దృష్టిలో పెట్టుకొని 1,224 మంది కూర్చునేలా భవన ప్రణాళిక ఉంటుందని స్పీకర్ తెలిపారు.

parliament
పార్లమెంట్ నూతన భవనం నమూనా

భూమి పూజ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీలకు ఆహ్వానాలు పంపించనున్నట్లు తెలిపారు ఓంబిర్లా. కొందరు వర్చువల్​గా, మరికొందరు నేరుగా హాజరవుతారని చెప్పారు. ప్రత్యక్షంగా రెండు వేల మంది, పరోక్షంగా తొమ్మిది వేల మంది భవన నిర్మాణంలో పాలుపంచుకుంటారని వెల్లడించారు.

"ప్రస్తుత పార్లమెంట్ భవనం వందేళ్లు పూర్తి చేసుకుంటోంది. కొత్త భవనాన్ని సొంతంగానే నిర్మించుకొని ఆత్మనిర్భర్ భారత్​కు ఉదహరణగా నిలవడం భారతీయుల కళ. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా కొత్త భవనం ఉంటుంది. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అయ్యే సంవత్సరం(2022)లో పార్లమెంటు సమావేశాలు.. కొత్త భవనంలో జరుగుతాయని ఆశిద్దాం."

-ఓంబిర్లా, లోక్​సభ స్పీకర్

భూకంపానికి తట్టుకునేలా నూతన భవనాన్ని నిర్మించనున్నట్లు తెలిపారు స్పీకర్‌ ఓంబిర్లా. పూర్తి అధునాతన వ్యవస్థలతో నిర్మాణం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుత పార్లమెంట్ భవనాన్ని వారసత్వ పురావస్తు ఆస్తిగా సంరక్షిస్తామని స్పష్టం చేశారు.

ప్రత్యేక వసతులతో..

లోక్​సభ హాలులో 888 మంది, రాజ్యసభ హాలులో 384 మంది కూర్చునేలా కొత్త పార్లమెంట్ భవనం నిర్మించనున్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వారసత్వ సంపదను పరిరక్షించేలా నూతన పార్లమెంట్​లో రాజ్యాంగ హాలును ఏర్పాటు చేయనున్నారు. దీంతోపాటు పార్లమెంట్ సభ్యులకు ప్రత్యేక గదులు, గ్రంథాలయం, కమిటీ రూంలు, భోజనశాలలు, విస్తారమైన పార్కింగ్ స్థలాన్ని సిద్ధం చేయనున్నారు.

నిర్మాణ పనులు జరగనున్న నేపథ్యంలో ప్రస్తుత పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ, బీఆర్ అంబేద్కర్ సహా మొత్తం ఐదు విగ్రహాలను తాత్కాలికంగా అక్కడి నుంచి తరలించనున్నట్లు అధికారులు ఇదివరకే వెల్లడించారు. నూతన భవనం పూర్తయ్యాక.. ఈ విగ్రహాలను తిరిగి ప్రతిష్ఠించనున్నారు.

సెంట్రల్ విస్తాలో భాగంగా పార్లమెంట్ భవనం, సెంట్రల్ సెక్రెటేరియట్​ను నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి భవన్​ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న మూడు కి.మీ మార్గంలో ప్రభుత్వ భవనాలను ఏర్పాటు చేయనుంది. 21 నెలల్లో ప్రాజెక్టును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇదీ చదవండి- మోదీ 2.0: పాలన కేంద్రంగా సెంట్రల్‌ విస్టా

Last Updated : Dec 5, 2020, 5:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.