ETV Bharat / bharat

'బిహార్ బరిలో లాలూ లేకపోవడం లోటే'

author img

By

Published : Oct 13, 2020, 3:23 PM IST

బిహార్ ఎ​న్నికల ప్రచారాల్లో ఆర్​జేడీ చీఫ్ లాలూ లేకపోవటం తమకు పెద్ద లోటు అని ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడానికి ముందు.. పార్టీ నేతలకు లాలూ కీలక సందేశం ఇచ్చారని తెలిపారు. విజయం కోసం శాయశక్తులా కృషి చేయాలని పిలుపునిచ్చినట్లు చెప్పారు.

Tejashwi Yadav
తేజస్వీ యాదవ్

బిహార్​ ఎన్నికల్లో రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్​జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్​ పాల్గొనకపోవడం తమకు లోటేనని ఆయన కుమారుడు, పార్టీ నేత తేజస్వీ యాదవ్​ తెలిపారు. ఎన్నికల ప్రచారాల్లో పార్టీ కార్యకర్తల్లో స్ఫూర్తిని పెంచే సామర్థ్యం కచ్చితంగా కొరవడుతుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి ముందు ఏఎన్​ఐ వార్తా సంస్థతో మాట్లాడారు తేజస్వీ.

"పార్టీ వ్యక్తులమే కాదు.. ప్రజలు కూడా లాలూను మిస్ అవుతున్నారు. ప్రజలు ఆయనపై ఉంచిన నమ్మకంతోనే గత ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించాం. ఆయన చూపించిన మార్గంలోనే మేం నడుస్తున్నాం. ఈ ఎన్నికలు బిహార్ ప్రజలకు ఎంత ప్రాధాన్యమైనవో ఆయన అర్థం చేసుకున్నారు. విజయం కోసం అందరూ కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు."

- తేజస్వీ యాదవ్​, ఆర్​జేడీ నేత

ఇదే తొలిసారి..

దాణా కుంభకోణానికి సంబంధించిన చైబాసా ట్రెజరీ కేసులో లాలూకు ఇటీవల ఝార్ఖండ్ హైకోర్టు బెయిల్​ మంజూరు చేసింది. అయితే మరో కేసు ఇంకా కోర్టులో ఉన్న నేపథ్యంలో లాలూ జైలులోనే ఉండాల్సి వచ్చింది. 30ఏళ్ల కాలంలో ఎన్నికల ప్రచారంలో లాలూ పాల్గొనకపోవటం ఇదే తొలిసారి.

అప్పుడైనా వస్తారని..

ఈ నేపథ్యంలో పార్టీ నేతలకు లాలూ ఇచ్చిన సందేశాన్ని ప్రస్తావించారు తేజస్వీ. ఈ కష్ట సమయాల్లో ప్రజలకు మద్దతుగా నిలబడి వారి గళాన్ని వినిపించాలని కోరారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో ఆయన ఉనికి, శక్తి, సామర్థ్యాన్ని కోల్పోబోతున్నామని అన్నారు. ఆర్​జేడీ ఆధ్వర్యంలోని మహాకూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రమాణ స్వీకారోత్సవానికి ఆయన వస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు.

మూడు దశల్లో..

బిహార్​లోని 243 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఈ నెల​ 28, నవంబర్ 3, 7 తేదీల్లో నిర్వహించనున్న ఎన్నికల ఫలితాలను నవంబర్​ 10న ఈసీ ప్రకటించనుంది.

ఇదీ చూడండి: బిహార్​ బరి: కాంగ్రెస్​పై మైనార్టీల గుస్సా- ఎందుకు ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.