ETV Bharat / bharat

ప్రధాని మెచ్చిన 'ప్యాడ్​ బామ్మ' కథ తెలుసా?

author img

By

Published : Mar 8, 2020, 5:34 PM IST

womens-day-meet-pad-dadi-who-gives-free-sanitary-napkins-to-girls
ప్రధాని మెచ్చిన 'ప్యాడ్​ బామ్మ' కథ తెలుసా?

'మహిళలను గౌరవించిన చోటే దేవతలు నివాసముంటారు' అని ఇతిహాసాలు ఘోషిస్తున్నా.. ఇప్పటికీ చాలామంది ప్రతినెలా ఆడవారు పడే శారీరక బాధను అర్థం చేసుకోరు. నెలసరి సమయంలో వారి అవసరాలనూ పట్టించుకోరు. అందుకే, గుజరాత్​కు చెందిన ఓ మహిళ మహోద్యమాన్ని చేపట్టారు. ప్రతి నెలా ప్రభుత్వ పాఠశాల్లో బాలికలకు సుమారు 5000 శానిటరీ ప్యాడ్​లు ఉచితంగా పంచుతూ 'ప్యాడ్​ బామ్మ'గా కీర్తిగాంచారు. ఇప్పటివరకు 4 లక్షలకు పైగా ప్యాడ్​లు పంచి.. ప్రధాని నరేంద్రమోదీ ప్రశంసలు పొందారు.

ప్రధాని మెచ్చిన 'ప్యాడ్​ బామ్మ' కథ తెలుసా?

పేద విద్యార్థులకు శానిటరీ ప్యాడ్​లు పంచుతూ.. నెలసరి సమయంలో పాటించాల్సిన జాగ్రత్తలు ప్రచారం చేస్తూ 'ప్యాడ్​ బామ్మ'గా గుర్తింపు పొందారు గుజరాత్​ సూరత్​కు చెందిన మీనా మెహతా. గర్భాశయ క్యాన్సర్​కు వ్యతిరేకంగా పోరాడుతున్న ఆమెను ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసించారు. మహిళల అభివృద్ధిలో.. భర్త అతుల్​ మెహతాతో కలిసి ఆమె సాధించిన ఘనతలను ఈటీవీ భారత్​తో పంచుకున్నారు మీనా.

"నా పేరు మీనా మెహతా. మానూని ఫౌండేషన్​ స్థాపకురాలిని. గత ఏడేళ్లుగా 11 నుంచి 14 ఏళ్ల బాలికలకు నేను శానిటరీ ప్యాడ్​లు ఉచితంగా పంచుతున్నాను. అప్పుడే రుతుక్రమం ప్రారంభమయ్యే పిల్లలకు ప్యాడ్​ను ఎలా ఉపయోగించాలి, దాన్ని ఎలా పారేయాలి, ఎన్ని గంటలకోసారి ప్యాడ్​ మార్చాలో అన్నీ నేర్పుతున్నాను. ఇప్పుడు పిల్లలు పూర్తిగా నేర్చేసుకున్నారు కూడా.

మొదటి నుంచి మేము ప్రభుత్వ పాఠశాలల్లో బాలికలకు ఉచితంగా పంచుతున్నాము. ఎందుకంటే వారికి డబ్బులు వెచ్చించి ప్యాడ్​లు కొనుక్కునే స్తోమత ఉండదు. ఇప్పటి వరకు మేము దాదాపు 4 లక్షల ప్యాడ్​లను ఉచితంగా పంచాము.

ఏడేళ్ల క్రితం ఓ బాలిక చెత్తబుట్టలోంచి రెండు ప్యాడ్​లను తీస్తూ కనిపించింది. నేను అడిగినప్పుడు తను చెప్పింది విని నాకు ఆశ్చర్యం కలిగింది. బామ్మ మేము ప్రతి నెలా.. ఇలా వాడిపడేసిన ప్యాడ్​లను తీసుకుని వాటిని నీటితో కడిగి మేము వాడతామని తను చెప్పింది. ప్రతి నెలా అమ్మాయిలకు కావలసిన ప్యాడ్​లను ఎవ్వరూ పట్టించుకోరని అప్పుడే నాకు అర్థమైంది. వారి ఆరోగ్యాలకు ఇదెంతో అవసరం. కాబట్టి మేము చేపట్టిన ఈ కార్యక్రమాలతో ప్రజల్లో ఎంతో మార్పు వచ్చింది. బాలికలు వారి తల్లులకు ప్యాడ్​ను ఉపయోగించడం నేర్పిస్తున్నారు. ఇప్పుడు వారి నెలవారి సరుకుల జాబితాలో ప్యాడ్​లు చేరిపోయాయి.

2013 నుంచి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. దీని గురించి ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్​ చేయడం మాకు చాలా సంతోషాన్ని కలిగించింది. మమ్మల్ని ఆయన గుర్తించారు. మేము ఏమి చేయాలనుకుంటున్నామో, ఎలాంటి మార్పు తీసుకురావాలనుకుంటున్నామో ప్రపంచం తెలుసుకోవాలి. ఎందుకంటే గర్భాశయ​ కేన్సర్​లో భారత దేశం మొదటి స్థానంలో ఉంది. అందుకే తొలి దశలోనే బాలికలకు ప్యాడ్​లు ఇచ్చి, శుభ్రత వైపు వారిని మలిస్తే కేన్సర్​ వచ్చే అవకాశాలు తగ్గుతాయి.

​క్యాన్సర్​ కారణంగా మహిళల గర్భాశయం దెబ్బతింటుంది. పిల్లలు ఆరోగ్యంగా పుట్టరు. అందుకే, ఇలాంటి సమస్యలు రాకుండా పోరాడుతున్నాం. నెలసరి సమయంలో పరిశుభ్రత పాటిస్తే తల్లులు దృఢంగా ఉంటారు. తల్లి దృఢంగా ఉంటే దేశం దృఢంగా మారుతుంది.

బాలికలకు కేవలం ప్యాడ్​లు పంచడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. అందుకే ప్యాడ్​లతో పాటు లోదుస్తులను కూడా పంచుతున్నాము మేము. అలా పంచితేనే అవగాహన వస్తుంది. ఇలా ప్రజల్లో అవగాహన కలిగిస్తున్నందుకు బాలీవుడ్​ హీరో అక్షయ్​కుమార్​ మాకు రూ.5 లక్షలు విరాళంగా ఇచ్చారు."

- మీనా మెహతా, మానూని ఫౌండేషన్​ స్థాపకురాలు

ఇదీ చదవండి:మహిళల భద్రత ఎవరికీ పట్టదా? మార్పు వచ్చేదెప్పుడు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.