ETV Bharat / bharat

భాజపాకైనా ఓటేస్తాం: మాయావతి సంచలన ప్రకటన

author img

By

Published : Oct 29, 2020, 6:06 PM IST

బీఎస్పీ అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్​వాదీ పార్టీ అభ్యర్థిని ఓడించేందుకు భాజపాకు ఓటు వేయడానికి వెనుకాడమన్నారు. పార్టీకి షాక్​ ఇచ్చిన ఏడుగురు రెబల్​ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్​ వేటు వేశారు.

Mayawati
భాజపాకైనా ఓటేస్తాం: మాయావతి సంచలన ప్రకటన

రాజ్యసభ ఎన్నికల వేళ ఝలక్ ఇచ్చిన ఏడుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసినట్లు బీఎస్పీ అధినేత్రి మాయావతి గురువారం ప్రకటించారు. రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీకి తగిన బుద్ధి చెప్పడానికి పూర్తి శక్తిని వినియోగిస్తామన్నారు. భాజపాకు ఓటు వేయడానికి కూడా తాము సిద్ధంగానే ఉన్నామని మాయవతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

"ఎమ్మెల్సీ, రాజ్యసభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థిని ఓడించడానికి సర్వ శక్తులూ ఒడ్డుతాం. భాజపా అభ్యర్థికైనా ఓటు వేయడానికి సిద్ధంగానే ఉంటాం. లేదంటే మరో పార్టీకి వేస్తాం."

- మాయావతి, బీఎస్పీ అధినేత్రి

ప్రియాంక ట్వీట్​...

మాయావతి వ్యాఖ్యలపై కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ట్విట్టర్​లో స్పందించారు. భాజపాకు ఓటేస్తామని మాయావతి చెప్పిన సదరు వీడియోను పోస్ట్​ చేస్తూ "ఇంతకన్నా చెప్పడానికి ఏమైనా ఉందా?" అంటూ రాశారు.

నిర్ణయం తీసుకోలేదు...

సస్పెన్షన్​కు గురైన ఏడుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారడంపై నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు. మాయావతి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని చెప్పారు. అయితే రాజకీయాల్లో ఇతర పార్టీ వ్యక్తులను కలవడం నేరం కాదన్నారు నేతలు. బీఎస్పీ రాజ్యసభ అభ్యర్థి రామ్​జీ గౌతమ్​ నామపత్రంపై తమ సంతకాలను ఫోర్జరీ చేసినట్లు రెబల్​ ఎమ్మెల్యేల్లో నలుగురు ఫిర్యాదు చేశారు.

ఏం జరిగింది...?

రాజ్యసభ ఎన్నికల్లో బీఎస్‌పీ అభ్యర్థిగా రామ్​జీ గౌతమ్‌ ఎన్నికను ఆ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు వ్యతిరేకించారు. ఆసక్తికకరంగా, కొద్దిసేపటికే వారంతా సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ను కలుసుకునేందుకు ఆ పార్టీ కార్యాలయానికి నేరుగా చేరుకున్నారు.

ఇదీ చూడండి: రాజ్యసభ అభ్యర్థి ఎంపికలో సొంత పార్టీకే ఎమ్మెల్యేల షాక్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.